logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు వైకాపా ఎర!

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.

Published : 04 May 2024 05:23 IST

రూ.2 వేలు ఇచ్చేందుకు సన్నద్ధం
ఉద్యోగులపై నాయకుల ఒత్తిళ్లు

రాయచోటి, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కూడగట్టేందుకు డబ్బులు ఎర వేస్తున్నారు. ఎవరైనా డబ్బులు తిరష్కరిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో పోలింగ్‌ విధులకు వెళ్లే ఉద్యోగులు అందరికి పోస్టల్‌ బ్యాలెట్లు అందజేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు వారికి సంబంధించిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లి బ్యాలెట్‌ పత్రాలు తీసుకుని అక్కడే ఓటు వేయాల్సి ఉంది. బ్యాలెట్‌తో పాటు రెండు నమూనా పత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆ సందర్భంలో ఓటేసేందుకు ఎవరు వచ్చారు.? ఎందరు అనుకూలంగా ఉన్నారు తదితర వివరాలు ఉపాధ్యాయుల్లో కొంతమంది వైకాపా నేతలకు చేరవేస్తున్నారు. వెంటనే అక్కడికి చేరుకుని వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటు వేసిన బ్యాలెట్‌ పేపరుతో పాటు బ్యాలెట్‌ను మడిచి కవర్‌లో పెట్టి సీల్‌ చేసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేయాల్సి ఉంటుంది. లక్కిరెడ్డిపల్లెలో వైకాపా తరఫున ఇద్దరు ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్ల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇద్దరు ఉపాధ్యాయులు మోటారు సైకిల్‌పై సంచరిస్తూ నేరుగా ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా ఓటుకు రూ.2 వేల చొప్పున నగదు పంపిణీ చేస్తున్నారని సమాచారం. రాయచోటిలో ఓ కీలక సంఘం నేత నోట్ల పంపిణీ కార్యక్రమాన్ని తెరవెనుక ఉండి నడిపిస్తున్నారని ఉపాధ్యాయ వర్గాలలో చర్చ సాగుతోంది. అధికార పార్టీ అనుబంధ సంఘాల నేతలు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రాయచోటి, రాజంపేట, మదనపల్లె, రైల్వేకోడూరులలో కొంతమంది వైకాపా అనుకూల ఉద్యోగులు నిమగ్నమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని