logo

ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు.

Published : 04 May 2024 05:35 IST

అయిదేళ్లలో కలగానే కనీస సదుపాయాలు
కొత్తకోటను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు

రోడ్డు వసతి లేని బి.కొత్తకోట శివార్లలోని పెయింటర్ల కాలనీలోని వీధి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. బెంగళూరు రోడ్డులోని పెయింటర్ల కాలనీని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అయిదేళ్లలో పెయింటర్ల కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులు ఏవీ లేకపోవడమే దీనికి నిదర్శనం. పట్టణంలో భవనాలకు సున్నంతో పాటు రంగులు వేసుకుని జీవిస్తున్న కార్మికులు అధికంగా ఉన్నారు. 2002లో వీరి కోసం అప్పటి తెదేపా ప్రభుత్వం గృహ నిర్మాణ కాలనీని ఏర్పాటు చేసింది. క్రమంగా ఈ కాలనీ విస్తరించి ఇక్కడే ఆదర్శ ప్రభుత్వ విద్యాలయం, వసతి గృహాలను ప్రభుత్వం నిర్మించింది. ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతామని వారంతా స్పష్టం చేస్తున్నారు.

  • బి.కొత్తకోట-బెంగళూరు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పెయింటర్ల కాలనీలో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టలేకపోయారు. సిమెంటు రోడ్ల మాట దేవుడెరుగు... కనీసం మట్టి రహదారులకు రూపురేఖలు ఏర్పడలేదు. మురుగు కాలువల నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ఇళ్ల మధ్యన మురుగు నిల్వలతో దోమల బెడద నానాటికీ అధికమవుతోంది. తాగునీటి సరఫరా కోసం బోరును వేసి కొన్ని ఇళ్లకు డైరెక్టు పంపింగ్‌ ద్వారా నీళ్లు ఇస్తున్నారు. మిగిలిన కుటుంబాలు పైపులైను వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం ట్యాంకరుతో నీళ్లు తెప్పించుకుంటున్నారు. ఈ కాలనీలో ఓవర్‌హెడ్‌ ట్యాంకును నిర్మించి నీటిని ఇళ్లకు సరఫరా చేయాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు వీధిలైట్లు లేకపోవడంతో కాలనీలో అంధకారం అలుముకుంటోంది. కాగా ఇదే కాలనీని ఆనుకుని బీరంగి రెవెన్యూ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వేధిస్తున్న పాముల బెడద

తాగునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌ ఇచ్చేలా పైపులైన్లను వేయించాలి. పాముల బెడద అధికంగా ఉండటంతో భయాందోళనలకు గురవుతున్నాం. వీధిలైట్లు వేయించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

టి.రమణమ్మ, పెయింటర్ల కాలనీ


కన్నెత్తి చూడని పాలకులు

కనీస సదుపాయాలు లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసిన తర్వాత పునాదులు వేసి వెళ్లిపోయారు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్ల సదుపాయాన్ని కల్పించాలని ఎందరిని కోరినా ఫలితం లేకుండా పోయింది.

బి.బావాజీ, పెయింటర్ల కాలనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని