logo

రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు

మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్‌, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని

Updated : 04 May 2024 06:16 IST

పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిలారెడ్డి ప్రశ్నలవర్షం

మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల

మైదుకూరు, న్యూస్‌టుడే : మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్‌, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని పీసీసీ అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఆరోపించారు. ఏపీ న్యాయ్‌ యాత్ర పేరుతో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో ప్రసంగించారు. కడప నుంచి దువ్వూరు చేరుకున్న షర్మిలారెడ్డి చింతకుంట మీదుగా చాపాడు, ఖాజీపేట, జీవీసత్రం, వనిపెంట మీదుగా మైదుకూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఏనాడో రాజోలి జలాశయం పూర్తి అయ్యేదన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక శంకుస్థాపన చేశారని, నాన్న పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును నేను పూర్తి చేస్తానని చెప్పి ఐదేళ్లవుతున్నా తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని ఎలా ప్రాజెక్టు పూర్తి అవుతుందని ప్రశ్నించారు. కుందూనది నీటితో లక్ష ఎకరాలు స్థిరీకరిస్తామని చెప్పినా పూర్తి చేయలేదన్నారు. ఏనాడైనా ఎమ్మెల్యేను ప్రశ్నించారా? ధర్నా అయినా చేశారా మరి ఎందుకు వేయాలి వీరికి ఓట్లు అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి రాజోలి కోసం పోరాటం చేశాడా, స్టీల్‌ ఫ్యాక్టరీ కావాలని దిల్లీలో ఒక్కసారైనా గొంతు విప్పారా అని విమర్శించారు. మరి ఎందుకు వేయాలన్న వీరికి ఓట్లు అంటూ సభలో ప్రజల ప్రశ్నించారు. ఆలోచన చేయాలని మీభవిష్యత్తే కాకుండా మీబిడ్డల భవిష్యత్తు ఓటుపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడి ఉందని, మరోపక్క రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డి హత్య చేసిన అవినాష్‌రెడ్డి నిలబడి ఉన్నాడని, ఎంపీగా రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కావాలో, వివేకానందరెడ్డిని చంపినట్లు సీబీఐ చెబుతున్న అవినాష్‌రెడ్డి కావాలో తెల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. నన్ను గెలిపించండి.. ఈగడ్డకే అంకితమవుతానని పేర్కొన్నారు. సభలో వివేకానందరెడ్డి కుమార్డె వెఎస్‌. సునీతారెడ్డి, పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని