logo

జగన్‌ హామీకి తొండి... పరిహారానికి గండి..!

కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

Published : 27 Apr 2024 06:06 IST

అయిదేళ్ల పాలన ముగుస్తున్నా అందని ఆర్థిక సాయం
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ అంటున్న గండికోట నిర్వాసితులు
న్యూస్‌టుడే, కొండాపురం

జలాశయంలో నీటమునిగిన గంగాపురం (పాతచిత్రం)

‘దేవుడు దయతలిస్తే గండికోట రిజర్వాయరులో ఈ ఏడాది 20 టీఎంసీలకు తగ్గకుండా నీరు నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిర్వాసితులకు రూ.6.75 లక్షలు ఇస్తున్నా సరిపోలేదని చెబుతుండడంతో రూ.10 లక్షలు ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు రూ.6.75 లక్షలు ఇచ్చిన ఆ గ్రామాలకు రూ.3.25 లక్షలు అదనంగా ఇవ్వబోతున్నాం’..

-ఇదీ 2019, జులై 8న సీఎం హోదాలో తొలిసారిగా జమ్మలమడుగు బహిరంగ సభలో జగన్‌ అన్న మాటలు.

కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం తొలిసారిగా 12 టీఎంసీల నీటిని నింపింది. అంతకు ముందు, అప్పటి వరకు రూ.1.86 లక్షలున్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ సొమ్మును రూ.6.75 లక్షలకు పెంచింది. ముంపునకు గురైన 14 గ్రామాల్లోని 9,096 మంది నిర్వాసితులకు రూ.479.35 కోట్లు మంజూరు చేసి పంపిణీ చేశారు. గండికోట నిర్వాసితులకు అదనంగా మరో రూ.3.25 లక్షలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

ఇంతవరకు అతీగతీ లేదు.

మరో 16 రోజుల్లో ఎన్నికలు: సీఎం జగన్‌ హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయింది. వైకాపా ప్రభుత్వం కాలపరిమితి కూడా దాటిపోతోంది. సాధారణ ఎన్నికలు కూడా మరో 16 రోజుల్లో జరగనున్నాయి. 9,096 మంది నిర్వాసితులకు రూ.3.25 లక్షల అదనపు పరిహారం కింద రూ.295.62 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర పుణ్యమా..అని నిర్వాసితుల ప్రస్తావన గతేడాది మేలో తెరపైకి వచ్చింది. 2023, జులై 6వ తేదీ రూ.454.60 కోట్లకు సంబంధించిన జీవో 312ను విడుదల చేసింది. అదనపు పరిహారం చెల్లింపునకు  దస్త్రాన్ని కదిలింది. గతేడాది నవంబరులో  నిర్వాసితులతో సంతకాలను చేయించినా ఇంతవరకు సొమ్ములు అందలేదు.

ఇప్పటికీ అందలేదు 

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పూర్తవుతున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. మొదటి విడత 14 గ్రామాల్లో మా గ్రామాన్ని గుర్తించి అప్పటి ప్రభుత్వం రూ.6.75 లక్షలు పరిహారం అందించింది. వైకాపా ప్రభుత్వం అదనంగా ఇస్తామన్న రూ.3.25 లక్షల పరిహారం సొమ్ములు ఇప్పటికీ అందలేదు.

మనోహర్‌, కె.బొమ్మేపల్లె

ఇళ్లు, భూములు కోల్పోయాం

జలాశయం కోసం సొంతూరు, భూములు, ఇళ్లను కోల్పోయాం. సీఎం జగన్‌ ఇస్తామన్న అదనపు పరిహారం రూ.3.25 లక్షలు ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లవుతున్నా సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదు. ప్రస్తుతం పనులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం.

సురేష్‌రెడ్డి, కొర్రపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని