logo

జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!

కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు.

Updated : 27 Apr 2024 06:18 IST

వైద్య సేవలకు ప్రైవేటు ఆసుపత్రుల అనాసక్తి
రూ.కోట్లలో పేరుకుపోయిన బిల్లుల బకాయిలు
ఇదే అదునుగా పేదల నుంచి బలవంతపు వసూళ్లు  

కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్యశ్రీ కార్డు కింద శస్త్రచికిత్స చేయాలని కోరగా, ఇందుకు ఆసుపత్రి వర్గాలు ససేమిరా అన్నాయి. ఇప్పటికే భారీ ఎత్తున బకాయిలు పేరుకుపోయాయని, ఏం చేయలేమని చేతు లెత్తేశారు. పేద కుటుంబం కావడంతో శస్త్రచికిత్స వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

ప్రొద్దుటూరు పట్టణంలో ఓ మహిళకు కాలు విరిగిపోయింది. శస్త్రచికిత్సకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్య పరీక్షలు, ఆరోగ్యశ్రీ పథకానికి అనుమతి కోరుతూ చేపట్టిన ప్రక్రియ పూర్తయింది. అనుమతులు వచ్చాకగానీ.. వైద్యసేవలు మొదలుపెట్టడానికి అవకాశం లేదు. దీంతో ఆసుపత్రిలోనే బాధితురాలు నొప్పితో బాధపడుతున్నారు. చికిత్స అత్యవసరమంటే డబ్బులు కడితే గానీ చికిత్స చేయలేమని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 

ఈనాడు, కడప

ఇలాంటి పరిస్థితులు అన్నమయ్య, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో నిత్యం వందలాది మంది ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకొంటుండగా, క్షేత్ర స్థాయిలో మాత్రం రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ‘మూడు వేలకు పైగా చికిత్సలు ఆరోగ్యశ్రీకి చేర్చాం. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచాం. ఇదీ వైకాపా సర్కారు డప్పు’. ‘మరి నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు సంగతేంటి? ఇది మాత్రం అడగకూడదు. అడిగితే బెదిరింపులు’. అందుకే నెట్‌వర్క్‌ ఆసుపత్రులు మా వల్లకాదంటూ చేతులెత్తేస్తున్నాయి. వీటికి బకాయి పెట్టేసిన ప్రభుత్వం పేద రోగులను నరకం అంచుల్లోకి నెట్టేస్తోంది. ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్‌ వేలల్లో పేరుకుపోతుంటే వైకాపా ప్రభుత్వ ప్రచారం మాత్రం పీక్స్‌ వెళ్తోంది.

జగన్‌ ప్రచార అర్భాటం

పేదలే నా ప్రాణం. వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం. ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ జగన్‌ తన ప్రసంగాల్లో ఊదరగొడుతుంటారు. వాస్తవంగా చూస్తే పథకానికి అనారోగ్యమొచ్చింది. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల బిల్లులను వేగంగా చెల్లించకుంటే దాని ప్రభావం రోగులకు అందించే వైద్యంపై పడుతుందని కాగ్‌ హెచ్చరించినా జగన్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రచారం చేసుకున్నంత గొప్పతనమేమీలేదు. ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదు. బీమా కార్డు తీసుకెళితే ధీమా దక్కడంలేదు. అయినా గొప్పలు చెప్పుకోవడంలో జగన్‌ తగ్గడంలేదు.

రోగుల నుంచి దండుకుంటూ...

బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని ఆసరా చేసుకుంటున్న కొన్ని ఆసుపత్రులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇవ్వడంలేదంటూ రోగుల నుంచే వైద్య సేవలకయ్యే వ్యయాన్ని వసూలు చేస్తున్నాయి. అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కూడా రోగుల నుంచే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు దండుకుంటున్నాయి. వారం తర్వాత రావాలని పంపిస్తూ అప్పుడు మాత్రమే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకుంటున్నట్లు రికార్డులు తయారు చేస్తున్నారు. రోగులకు పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించినట్లు యాజమాన్యాలు ప్రభుత్వానికి క్లెయిమ్‌లు చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ చికిత్స పొందిన కేసులపై మెడికల్‌ ఆడిట్‌ జరగాలని కాగ్‌ సూచించినా నేటికీ అతీగతి లేకుండా పోయింది.

బిల్లులకు మొరపెట్టుకుంటున్నా మోక్షం లేదు

ఆరోగ్యశ్రీ పథకం కింద సకాలంలో బిల్లులు చెల్లించాలని, ప్యాకేజీ ధరలు పెంచాలని ఎంతగా ఆసుపత్రులు యాజమాన్యాలు మొరపెట్టుకుంటున్నా, సేవలు నిలిపేస్తామని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం బెదిరింపులతో నోళ్లు మూయించాలని చూస్తుందేగానీ.. బిల్లుల విషయంలో అభయం ఇవ్వడంలేదు. కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవలపైనే మనుగడ సాగించే కొన్ని ఆసుపత్రులకు నిర్వహణ భారంగా మారుతోంది. ఆ ప్రభావం రోగులపై పడుతోంది. జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వార్షిక చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచామంటూ ప్రచారంలో తరిస్తోంది. ఇవ్వని బిల్లులకు ఎన్ని రూ.లక్షలు చేస్తే ఏం లాభం అన్నది.. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ప్రశ్న.

60 రోజుల్లో చెల్లించాల్సి ఉన్నా..!

ఆరోగ్యశ్రీ ట్రస్టు మార్గదర్శకాల ప్రకారం క్లెయిమ్‌ పంపిన 60 రోజుల్లోగా చెల్లింపులు పూర్తి కావాల్సి ఉంది. దీనికి కొన్నిసార్లు నెలల తరబడి సమయం తీసుకుంటోంది. ఎన్ని రోజులైనా సార్వత్రిక ఎన్నికల తరుణంలో బిల్లులొస్తాయన్న గ్యారంటీ లేదని ఆసుపత్రుల వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నది రోగులే. బిల్లుల చెల్లింపుల జాప్యంపై ఎన్ని విమర్శలు వస్తున్నా. సర్కారులో చలనం రావడంలేదు. అసలు జనం బాధలను పట్టించుకునే స్థితిలోనే ప్రభుత్వం లేదు. విసిగిపోయిన ఆనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలు అడపాదడపా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. సేవలు నిలిపివేయక తప్పదంటూ అల్టిమేటం ఇచ్చినప్పుడు మాత్రమే చివరి నిమిషంలో ప్రభుత్వం కొంతమేర బిల్లులు చెల్లిస్తోంది. 

  • జిల్లాలో మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు 4,87,035
  • నెట్‌వర్క్‌ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు 39
  • ప్రభుత్వాసుపత్రులు 63

గుండె శస్త్రచికిత్స డబ్బులు రాలేదు

గుండె శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ డబ్బులు వస్తాయని ఆశలు పెట్టుకున్నాను. రూ.ఐదు లక్షలు సొంత డబ్బులు పెట్టుకుని శస్త్రచికిత్స చేయించుకున్నాను.

సుబ్బారెడ్డి, గోపవరం, బద్వేలు మండలం


వైద్య పరీక్షలకు అదనంగా ఖర్చు 

మూడు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైంది. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయగా రూ.73 వేలు వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తర్వాత రెండుసార్లు వైద్య పరీక్షలకు అదే ఆసుపత్రికి వెళ్లగా ప్రయాణ ఖర్చులతోపాటు రూ.16 వేలు అదనంగా ఖర్చయింది.

భక్తాంజనేయరెడ్డి, విశ్వనాథపురం, చాపాడు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని