logo

పీహెచ్‌సీలన్నావ్‌... చేతులెత్తేశావ్‌..!

‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్‌ ప్రచారార్భాటంగా చేశారు.

Updated : 29 Apr 2024 06:29 IST

అదనపు కేంద్రాల ఊసే పట్టని సీఎం జగన్‌
నిధుల్లేవంటూ ఏమార్చిన వైకాపా ప్రభుత్వం

‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్‌ ప్రచారార్భాటంగా చేశారు. ప్రస్తుతం మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఉంటే అదనంగా మరొకటి ఏర్పాటు చేస్తామని, వైద్యులను నియమిస్తామని, ఆధునిక వసతులతో అవసరమైన భవనాలు నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం కూడా హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయడంతో వైద్య సేవలు అందుబాటులోకొస్తాయని పల్లె వాసులు ఆనందపడ్డారు. ఆయా ప్రాంతాల్లో పీహెచ్‌సీ భవన నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించారు. సాంకేతిక నిపుణులు ఏఏ పనులు చేయాలో నిర్ధారించి అంచనాలు రూపొందించారు. అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు నివేదించారు. కాసుల కష్టంతో సీఎం జగన్‌ మాట తప్పారు. నిధులివ్వలేక చేతులెత్తేశారు. హామీని నెరవేర్చకుండా గ్రామీణుల ఆశలపై నీళ్లు జల్లారు. నేనింతే అంటూ జగన్‌ ఇచ్చిన హామీని అమలు చేయకుండా మడమ తిప్పారు.

న్యూస్‌టుడే, కడప, అట్లూరు, ప్రొద్దుటూరు: ఉమ్మడి కడప జిల్లాలో 807 గ్రామ పంచాయతీలుండగా, 6,27,653 కుటుంబాల్లో 21,18,257 మంది నివాసం ఉంటున్నారు. వీరికి వైద్య సేవలందించడానికి 74 చోట్ల దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనుబంధంగా మరో 448 ఉప కేంద్రాలు (సబ్‌ సెంటర్లు) ఉన్నాయి. సగం మండలాల్లో ఒక్కో పీహెచ్‌సీ మాత్రమే ఉంది. మారుమూల ఉన్న జనానికి సకాలంలో వైద్యం అందటం గగనం అవుతోంది. ప్రతి మండలంలో రెండు చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులను, సిబ్బంది నియమించి అధునాతన యంత్ర పరికరాలను సమకూరిస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు వేగంగా అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎక్కడెకక్కడ ఏర్పాటు చేయాలో సమాచారం సేకరించి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి పంపించాలని రాష్ట్ర ఉన్నతాధికారులు గతేడాది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీ పరిధిలోని కుటుంబాలు, జనాభా, ఆయా ప్రాంతంలో ప్రబలే రోగాలను పరిగణనలోకి తీసుకొని 2 కి.మీ నుంచి 40 కి.మీ దూరం ఉన్న చోట నూతనంగా 30 చోట్ల పీహెచ్‌సీల అవసరం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వైద్యాధికారులు ప్రతిపాదించారు.

ఉత్తర్వులు ఉత్తిదేనా?

జనాభా ప్రాతిపదికనను పరిగణనలోకి తీసుకొని అందరికీ అనువైన, ఆమోదయోగ్యమైన ప్రాంతంలో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముందుకొచ్చారు. ఉమ్మడి కడపలో 30 చోట్ల అవసరం ఉంటుందని జిల్లా అధికారులు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు మూడేళ్ల కిందట కిందట ప్రతిపాదనలు పంపించారు. తొలివిడతలో 22 చోట్ల అనుమతి ఇస్తూ 2021, సెప్టెంబరు 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూమి లేదా, దాతలు ముందుకొచ్చి భూమి ఇస్తే తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కొక్క చోట కనీసం 1.50 ఎకరాల విస్తీర్ణం ఉండాలని తెలిపారు. ప్రధాన రహదారికి అతి సమీపంలో జాగాను ఎంపిక చేయాలని ఉత్తర్వులిచ్చారు. చాలాచోట్ల రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ, ర.భ.శాఖ అధికారులు పరిశీలించి స్థల సేకరణ చేశారు. కొన్నిచోట్ల స్థల అప్పగింత, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవ్వలేదు.

రెండింటికే పరిమితం

అధునాతన సదుపాయాలు కావాలంటే ఒక్కో భవనానికి రూ.2 కోట్లు నుంచి రూ.2.50 కోట్లు కావాల్సి ఉంటుందని రెండేళ్ల కిందట ర.భ. శాఖ సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను రహదారులు, భవనాల శాఖ అధికారులకు అప్పగించారు. చాపాడు మండలం నక్కలదిన్నె పీహెచ్‌సీకి రూ.2.41 కోట్లు కేటాయించగా పనులు పూర్తి చేసి ప్రారంభించారు. దువ్వూరు మండలం చింతకుంటలో భవన నిర్మాణానికి రూ.2.45 కోట్లకు మాత్రమే అనుమతి లభించగా నిర్మాణంలో ఉన్నాయి. మిగతా 20 చోట్ల ఎలాంటి పరిపాలన, ఆర్థిక అనుమతి రాకపోవడంతో ఇంకా పనులకు శ్రీకారం చుట్టలేదు. పైగా కొన్ని కొత్త పీహెచ్‌సీల పేరిట వైద్యాధికారులు, సిబ్బందిని నియమించినా ఆనక ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేశారు.

కాసుల కటకట పక్కన పెట్టేశారట

ఎగువరామాపురం, జ్యోతి క్షేత్రం, పాయలకుంట్ల, ఎస్‌.వెంకటాపురం, శాస్త్రినగర్‌, ఉప్పలూరు, ఉక్కాయపల్లె, పైడికాలువ, ఎన్‌.పాలగిరి, కృష్ణాపురం, కొర్రపాడు, పార్నపల్లి, నల్లచెరువుపల్లి, మంటపంపల్లి, నాగిరెడ్డిపల్లి, సానిపాయి, గంగనేరు, నాగవరం, వత్తలూరు, చక్రంపేటలో చేపట్టడానికి తొలి విడతలో ఆర్థిక ఆమోదం లభించలేదు. కొత్తగా పీహెచ్‌సీ నిర్వహించడానికి ఆయా ప్రాంతంలో సరిపడా కుటుంబాలు, జనాభా నివాసం లేరని తాజాగా గుర్తించారు. పైగా తక్కువ సంఖ్యలో ఆరోగ్య ఉపకేంద్రాలు, గ్రామ సచివాలయాలు ఉన్నట్లు నిర్ధారించారు. పల్లెల్లో నివసిస్తున్న కుటుంబాలు, జనం, ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ప్రబలే వ్యాధులపై వైద్యాధికారులు, సిబ్బంది ద్వారా హడావుడిగా సర్వే చేయించారు. స్థలాలను ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులను ఉత్తర్వులిచ్చారు. అధునాతన మౌలిక సదుపాయాలతో భవనాన్ని నిర్మించాలని ఆకృతికి రూపకల్పన చేయాలని   ర.భ.శాఖ సాంకేతిక నిపుణులను ఆదేశించారు. సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది ఎంపిక, నియామకాలపై కసరత్తు చేశారు. తాత్కాలిక సర్దుబాటు చేయాలని భావించారు. ప్రభుత్వాసుపత్రి అందుబాటులోకి వస్తుందని సమాచారం తెలుసుకొని గ్రామీణుల మోము ఎంతో మురిసిపోయింది. పరిపాలన అనుమతి ఇచ్చిన ఏడాది తర్వాత కేవలం రెండింటికే నిధులిచ్చి చేతులు దులిపేసుకొన్నారు. ధర్మాసుపత్రి కల ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదని పల్లె వాసులు నైరాశ్యం చెందుతున్నారు.

భయపెడుతున్న వ్యాధులు

గ్రామీణులను సీజనల్‌ వ్యాధులు, వైరల్‌, విష జ్వరాలు, డెంగీ, మలేరియా, టైపాయిడ్‌, మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత, గుండె, కేన్సర్‌, క్షయ, కీళ్లనొప్పులు, పక్షవాతం, పోషకాహారం లోపం వంటి సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రభుత్వ వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ వైద్యం రానురాను మరింత ఖరీదు అవుతోంది. జబ్బుల నుంచి కోలుకోవడానికి చేస్తున్న ఖర్చు తడిసిమోపెడంత అవుతోంది. అప్పులు చేసి ఆరోగ్యం బాగు చేసుకోవాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. పేదలకు మరింత ఆర్థికంగా భారమవుతోంది. అయినా ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి మడత పెట్టేసింది. అదే గ్రామీణులకు శాపంగా మారింది.

ప్రభుత్వ తీరుతో మా ఆశలు ఆవిరి

మంటపంపల్లెలో ఆసుపత్రి ఏర్పాటు కోసం రెండేళ్ల కిందçË అధికారులు  స్థలాన్ని ఎంపిక చేశారు. ఇంతవరకు ఇక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు. మా ఊరి నుంచి ఒంటిమిట్ట పీహెచ్‌సీకి వెళ్లాలంటే 12 కి.మీ, రాజంపేట ధర్మాసుపత్రికి చేరుకోవాలంటే 18 కి.మీ వెళ్లాలి.

ప్రసాద్‌రెడ్డి, మంటపంపల్లె

ఒట్టి మాటలతో సరిపెట్టేశారు

మా పల్లెకు సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని రెండేళ్ల కిందట అధికారులు ప్రకటించారు. గ్రామీణుల కోసం కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గొప్పగా ఆర్భాటం చేసింది. ఒట్టి మాటలతో సరిపెట్టేశారు.

రామచంద్రారెడ్డి, అమ్మవారిపల్లె

కడప నగరానికి వెళ్లాల్సిందే

సుమారు 2 వేల కుటుంబాలున్న ఎస్‌.వెంకటాపురంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. వైద్యానికి అట్లూరుకు వెళ్లాలంటే రవాణా సదుపాయం లేదు. బద్వేలు, కడపకు వైద్యానికి వెళ్లాల్సివస్తోంది.

గాలి ఓబులయ్య, ఎస్‌.వెంకటాపురం

వైద్యసేవలకు వ్యయప్రయాసలు

ప్రొద్దుటూరు మండలం కొర్రపాడుకు మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి నోచుకోలేదు. దీంతో వైద్యసేవలకు ప్రొద్దుటూరు పట్టణానికి వ్యయ ప్రయాసాలకు ఓర్చి వెళ్లాల్సి వస్తోంది. పీహెచ్‌సీ త్వరిగతిన నిర్మిస్తే మాకందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

ఎం.శ్రీనివాసులరెడ్డి , కొర్రపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని