logo

విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు

భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్‌సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Published : 01 May 2024 01:38 IST

రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ధ్వజం

బి.కొత్తకోట షాదీ మహల్‌లో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ప్రసంగిస్తున్న

రాజంపేట లోక్‌సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి

బి.కొత్తకోట, కురబలకోట, న్యూస్‌టుడే: భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్‌సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కురబలకోట, బి.కొత్తకోటల్లో జరిగిన రోడ్‌షోలలో పాల్గొనడంతో పాటు అనంతరం జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రసంగిస్తూ భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లింలకు నష్టం జరుగుతుందని మసీదులకు కరపత్రాలను పంపి భయాందోళనలను సృష్టిస్తున్నారని, ఇలాంటి విష ప్రచారాన్ని మైనార్టీలు నమ్మవద్దని కోరారు. వాస్తవానికి ముస్లింల అభ్యున్నతి కోసం అయిదేళ్ల పాలనలో ముస్లింలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. మైనార్టీలకు ఇస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్‌ కొనసాగుతుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించినందువల్ల దీనిపై ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేదని వివరించారు. మదనపల్లె, పుంగనూరుల మీదుగా వెళ్లాల్సిన కడప-బెంగళూరు రైల్వేలైనును సీఎం జగన్‌ పులివెందుల మీదుగా మళ్లించుకుంటే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి నిద్రపోతున్నారా..? అని మాజీ సీఎం ప్రశ్నించారు. భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణాలతో అక్రమ కేసుల బనాయింపులతో రౌడీ రాజ్యాన్ని నడుపుతున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకరనాథరెడ్డిని పుంగనూరుకు తరిమివేయడానికి ఓటును ఆయుధంగా మలుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన మామ కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి చాలా వరకు తాను చేయించానని తెలిపారు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ సంస్ధలను ఇక్కడ నెలకొల్పడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి, భాజపా రాష్ట్ర నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్‌తాజ్‌, భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్‌,పోల్‌ మేనేజ్‌మెంటు సమన్వయకర్త కుడుం శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జీ సాయినాథ్‌లతో పాటు వివిధ మండలాల ఎన్‌డీఏ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని