logo

మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్‌ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు.

Published : 01 May 2024 06:13 IST

న్యూస్‌టుడే, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట, చాపాడు, బ్రహ్మంగారిమఠం

ఆర్టీసీ బస్టాండు వద్ద వాహనాలు వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు

ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్‌ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. ముఖ్యమంత్రి వచ్చారంటే హామీలు గుప్పిస్తారంటూ ఆశించిన ప్రజలు నిరుత్సాహపడ్డారు. తెలుగుగంగ స్థిరీకరణకు కుందూనది నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ఎత్తిపోతల పథకం విషయంలో నోరుమెదపలేదు. బిల్లులు చెల్లించకపోవడంతో ఆగిపోయిన అభివృద్ధి పనులపైనా మాట్లాడలేదు. జిల్లాలో ప్రధాన సాగునీటి వనరుల్లో కేసీ కాలువ, తెలుగుగంగ ప్రధానం కాగా, వాటి ఊసే ఎత్తలేదు. తిరిగి అధికారంలోస్తే నియోజక వర్గానికి ఏం చేయబోతామో అనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న పథకాలు, బటన్‌ నొక్కుడు కార్యక్రమాలపై గొప్పలు చెప్పుకొన్నారే కానీ నిధులు మంజూరు చేయక నిలిచిపోయిన నాడు-నేడు పనుల విషయాన్ని ప్రస్తావించలేదు. చంద్రబాబుతోపాటు కూటమి, కాంగ్రెస్‌ పార్టీల నాయకులతోపాటు పత్రికలు, ఛానళ్లపై విమర్శలు చేశారు. చివరిలో ఎమ్మెల్యే రఘునాథరెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డిలు సైతం మాట్లాడకపోవడంతో ప్రజలు వెనుతిరిగారు. జగన్‌ రాక ఆలస్యం కావడంతో మండుటెండలో జనం అల్లాడిపోయారు. ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడికి వెళ్లి తలదాచుకోవడం కనిపించింది. జగన్‌ బస్సుపైకి చేరగానే రోడ్డుపైకి చేరుకున్నారు. జగన్‌ ప్రసంగిస్తున్న 8 నిమిషాలకే ప్రజలు వెనుతిరగడం కనిపించింది. సీఎం ప్రసంగం పూర్తయ్యే సరికి ఆప్రాంతం సగం ఖాళీ కావడం గమనార్హం.

అన్నం పొట్లాల కోసం ఆటో చుట్టూ చేరిన పోలీసులు

పెరిగిన పోలీసుల నిఘా : సీఎం జగన్‌పై గులకరాయి దాడి ఘటనతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మేడలపై జనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మిద్దెలు నివాసం ఉంటున్న వారిని సైతం మేడపైకి రాకుండా చూసుకున్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో ప్రతి ఇంటిపైనా పోలీసులను ఏర్పాటు చేశారు. రెండు అంతస్తులుంటే పైన కింద సిబ్బందిని నియమించి నిఘా పెట్టారు. ఎప్పుడూలేనిది మేడలపైకి చేరకుండా పోలీసులు తీసుకున్న చర్యలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రయాణికులు, వాహనదారుల పాట్లు: ఎన్నికల ప్రచారô కోసం సీఎం జగన్‌ మైదుకూరు రాకతో పోలీసులు పట్టణాన్ని దిగ్బంధం చేశారు. పట్టణంలోని నాలుగురోడ్లలోనూ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహన రాకపోకలు అడ్డుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న మేరకు 12.45 గంటలకు సీఎం మైదుకూరు చేరుకుంటారని ప్రచారం జరిగినా రహదారులపైకి చేరుకున్న పోలీసులు ఉదయం 10 గంటలకే బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. రాకపోకలను అడ్డుకోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని