logo

దండిగా ప్రభుత్వ పరివారం.. మొండిగా పేదలపై ప్రతీకారం

ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు.

Updated : 01 May 2024 06:41 IST

మండుటెండలో అవ్వాతాతలకు పరీక్ష
ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహావేశాలు
ఓట్ల కోసం జగన్‌ వికృత రాజకీయం

ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం నిప్పులు చెరుగుతున్న మండు టెండలతో అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లి పింఛను సొమ్ములు తెచ్చుకోవాలంటే రవాణాపరంగా నానా అవస్థలు పడాల్సిందే. తీవ్ర వడగాల్పులతో అనారోగ్యం బారినపడి  జరగరాని ఘటన జరిగినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా బాధ్యులెవరని పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

న్యూస్‌టుడే, కడప, వేంపల్లె, జమ్మలమడుగు గ్రామీణ, ప్రొద్దుటూరు, బద్వేలు, పెండ్లిమర్రి, వీఎన్‌పల్లె, కమలాపురం

నిప్పులు చెరుగుతున్న ఎండలతో పండుటాకులు విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. సత్తువలేని శరీరాలు, అవసాన దశలో కదల్లేని దీనావస్థ, జీవిత చరమాంకంలో ఊతకర్ర సాయం లేకుండా అడుగు వేయలేని అభాగ్యులు... మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే దివ్యాంగులు... జీవిత భాగస్వామి దూరమై మనోవేదన చెందుతున్న వారికి ఇంటి వద్దే పింఛను ఇస్తామని మొన్నటి దాకా సీఎం జగన్‌ బాకా ఊదారు. సార్వత్రిక సంగ్రామం వేళ రాష్ట్ర ప్రభుత్వం వికృత రాజకీయానికి తెరలేపింది. సామాజిక భద్రత పింఛన్ల సొమ్ము లబ్ధిదారుల చేతికి ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టాలని కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైకాపా పాలనలో విధాన నిర్ణేతల తప్పిదాలను ప్రతిపక్షాల పార్టీల నేతలపై వేయాలని కుట్ర పన్నింది. వేలాది మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ద్వారా ఇంటింటికి నగదు పంపిణీ చేయకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసి మండుటెండలో పరీక్ష పెట్టడమేంటని పింఛనుదారులు ప్రశ్నిస్తున్నారు. జవసత్వాలు సన్నగిల్లిన వృద్ధులు ఆపై ఎందుకీ కక్ష... ఏమిటీ శిక్ష? అంటూ వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

కమలాపురంలో సచివాలయం వద్ద వేచి ఉన్న పింఛనుదారుల (పాత చిత్రం)

మండుటెండల్లో పండుటాకులు మగ్గిపోతారు

ఎన్నికల నేపథ్యంలో సామాజిక పింఛనుదారులకు వాలంటీర్ల ద్వారా నగదు లావాదేవీలు చేయరాదని సీఈసీ ఉత్తర్వులిచ్చింది. దీంతో లబ్ధిదారులను గత నెలలో సచివాలయాలకు రప్పించి అందజేశారు. ఈ నెలలో పింఛన్ల పంపిణీకి కొత్త నిర్ణయం తీసుకొంది. నడవలేని, కదల్లేని, మంచానికి పరిమితమై, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, బ్యాంకుల్లో ఖాతాల్లేని వారికి నేరుగా ఇంటికి, మిగిలినవారికి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో పింఛను సొమ్ము జమ చేయాలని ముందుకొచ్చింది. చాలామంది ఖాతాల్లో కొన్ని నెలలుగా ఆర్థిక లావాదేవీలు జరగకపోవడంతో మనుగడలో లేవు. జిల్లాలో భానుడి భగభగలతో 43 నుంచి 45 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పైగా వడగాల్పులు భయపెడుతున్నాయి. పింఛను సొమ్ములను బ్యాంకులో ఖాతాలో వేస్తే పల్లెల నుంచి వెళ్లి తెచ్చుకోవాలంటే రవాణా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామీణ గడపలో రవాణా పరంగా ఆటోలే ఆధారం. రానుపోను కనీసమంటే 15 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి  ఉంటుంది. సూర్యతాపంతో పండుటాకులకు ప్రాణసంకటమని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

వేంపల్లె సచివాలయం వద్ద పింఛను కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు (పాత చిత్రం)

అరపూటలో ఇంటింటికీ పంపిణీ చేయొచ్చు

ఆయా ప్రభుత్వ శాఖల్లోని సిబ్బందిని పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఇంటింటికీ పింఛను పంపిణీ కార్యక్రమాన్ని సులభంగా పూర్తిచేయొచ్చు. గ్రామాల్లో అరపూట లోపు, పట్టణాల్లో ఒకరోజులో పంపిణీ చేయొచ్చు. మహా అంటే రెండ్రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసేయొచ్చు. ఈ విషయాన్ని వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా పక్కన పెట్టేసి బ్యాంకు ఖాతాలకు పింఛను సొమ్ములు జమ చేస్తామని ప్రకటించింది. సీఎం జగన్‌ లబ్దిదారులపై కాసింతైనా కనికరం చూపకుండా, ఈ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని వైకాపా విశ్వప్రయత్నం చేస్తోంది.

దూరం... పండుటాకులపై భారం

  •  పెద్దముడియం మండలంలోని కొండసుంకేసుల గ్రామం నుంచి పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లాలంటే సుమారు 19 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
  •  ప్రొద్దుటూరు మండలం బంకచిన్నాయపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. ఇక్కడ పింఛనుదారులు 12 కిలో మీటర్ల దూరంలోని ప్రొద్దుటూరుకు ఆటోలో వెళ్లాల్సిందే.
  •  కొండాపురం మండలంలోని రేగడిపల్లె గ్రామంలోని 247 మంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలోని పింఛను సొమ్ము తెచ్చుకోవడానికి 15 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రమైన కొండాపురానికి వెళ్లాల్సి ఉంటుంది. వీరందరికీ ఆటోలే ఆధారం.
  •  జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామంలోని పింఛనుదారులు సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మలమడుగుకు రావాల్సి ఉంటుంది.
  •  జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లెకు చెందిన పింఛనుదారులు జమ్మలమడుగు పట్టణంలో ఉన్న బ్యాంకుకు రావాలంటే సుమారు 23 కిలోమీటర్ల దూరం ప్రయాణించక తప్పదు.
  •  బద్వేలు మండలం లక్కవారిపల్లెలోని పింఛనుదారులు బద్వేలులోని ఏపీజీబీకి వెళ్లాలంటే రానుపోను 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దయనీయ పరిస్థితి.
  •  వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లె నుంచి బ్యాంకున్న అలవలపాడుకు బస్సు సౌకర్యం లేదు. పింఛన్‌ కోసం బ్యాంకు వెళ్లాలంటే 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

ఇళ్ల వద్దనే పింఛను ఇవ్వాలి

గతంలో మాదిరిగానే ఇళ్ల వద్దనే వృద్ధులు, వితంతు మహిళలకు పింఛనులివ్వాలి, లేదంటే వృద్ధ మహిళలు ఆటోలో కమలాపురంలోని బ్యాంకులకు వెళ్లి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా ఊర్లో 478 మంది ఉన్నారు. ఇలా అన్ని ఊళ్లలోవారు ఒకేసారి బ్యాంకులకు వెళ్లి తీసుకోవడం అంటే ఇబ్బందే. క్యూలో ఉండాలంటే మా లాంటి వృద్ధులకు సాధ్యమవుతుందా... ఇళ్ల వద్దనే పింఛను డబ్బులివ్వాలి.

 వైపీ రాములమ్మ, ఎర్రగుడిపాడు

ఇబ్బందులకు గురిచేస్తున్నారు 

పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాల్లో వేయడం సరైన నిర్ణయం కాదు. మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మా లాంటి వృద్ధులం బ్యాంకులకు వెళ్లాలంటే చాలా కష్టం.  బ్యాంకుకు రావాలంటే నడవలేని మేము ఆటోను బాడుగకు తీసుకుని వెళ్లాల్సిందే. 

తులశమ్మ, వీఎన్‌పల్లె

బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందే

మా గ్రామం నుంచి పెండ్లిమర్రిలోని బ్యాంకుకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేదు. పింఛను సొమ్ముకు బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోవాలంటే అదే పనిగా ఆటో తీసుకొని వెళ్లాల్సి వస్తుంది.  బ్యాంకులో క్యూలైన్‌లో ఉండి డబ్బులు తీసుకోవాలంటే ఎంత కష్టమో అధికారులు ఆలోచించాలి.

నాగమల్లారెడ్డి, తిప్పిరెడ్డిపల్లె, పెండ్లిమర్రి మండలం

20 కిలోమీటర్లు ప్రయాణించాలి

నాకు జమ్మలమడుగు బ్యాంకులో ఖాతా ఉంది. మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదు. సుమారు 20 కిలోమీటర్లు ఆటోకు రూ.60 ఖర్చవుతుంది. బ్యాంకులో రసీదు రాసి డబ్బులు తీసుకోవాంటే కష్టం. పేదలు, దివ్యాంగులు, వృద్ధుల జీవితాలతో ఆడుకోవడం మానేయాలి. పండుటాకుల బాధలను పట్టించుకోవాలి.

గోవిందయ్య, పెద్దదండ్లూరు, జమ్మలమడుగు మండలం

తిరగడం నా వల్ల కాదు

నాకు 70 ఏళ్లు. పింఛను సొమ్ము కోసం బ్యాంకుకు వెళ్లాలంటున్నారు. నాకు ఏటీఎం కార్డు లేదు. మా ఊరికి నుంచి జమ్మలమడుగు పట్టణంలో ఉన్న బ్యాంకుకు సమారు 23 కిలోమీటర్ల దూరం. ఉదయం 7 గంటలకే ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇంతటి ఎండలో బ్యాంకుకు వెళ్లి పింఛను సొమ్ము తీసుకోవాలంటే నాలాంటి వృద్ధుల వల్ల కాదు.

పెంచలమ్మ, గండికోట కొట్టాలపల్లె, జమ్మలమడుగు మండలం

ఒక్కరోజులో పంపిణీ చేయొచ్చు

నేను పంచాయతీ కార్యదర్శిగా మూడు గ్రామాల్లో 1,325 మంది పింఛనుదారులకు మూడు రోజుల్లో పంపిణీ చేసేవాడిని. ప్రభుత్వం అవ్వాతాతల పింఛను సొమ్ము బ్యాంకుల్లో జమ చేస్తామనడం దుర్మార్గం. కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు ఎండలో వెళ్లి లైన్లలో నిల్చుని తెచ్చుకోవాలంటే వారికి కష్టమే. ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులోనే మొత్తం పంపిణీ చేయొచ్చు. 

పి.రాజా, విశ్రాంత పంచాయతీ కార్యదర్శి, రాయచోటి

ఉద్యోగులతో పంపిణీ చేసేందుకు ఇబ్బందేంటి?

మండుటెండల్లో కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి బ్యాంకులో వరుసలో నిల్చుని వృద్ధులు డబ్బులు తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల్లో పది శాతం మందితో ఇంటింటికీ పింఛను పంపిణీ చేస్తే రెండు రోజుల్లో ముగుస్తుంది. వైకాపా ప్రభుత్వం అలా చేయకుండా నాటకాలాడుతోంది.

 కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని