logo

కోడ్‌ ఉల్లంఘన.. ఊరూరా వైకాపా స్టిక్కర్లు

పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ ఖాజీపేట మండలంలో అధికార పార్టీ కోడ్‌ ఉల్లంఘనల పరంపర పెరుగుతూనే ఉంది.

Published : 10 May 2024 03:21 IST

నాగసానిపల్లెలో మోటారు షెల్టరుకు...

ఖాజీపేట, న్యూస్‌టుడే: పోలింగ్‌ తేదీ దగ్గరపడేకొద్దీ ఖాజీపేట మండలంలో అధికార పార్టీ కోడ్‌ ఉల్లంఘనల పరంపర పెరుగుతూనే ఉంది. ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా బడులు, గుడులు, చర్చిలు, విద్యుత్తు స్తంభాలు ఇలా ఒకటేమిటి ప్రజాక్షేత్రంలో ప్రతిచోటా కోడ్‌ ఉల్లంఘనలు దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నిర్భయంగా గ్రామాల్లో జగన్‌ కోసం సిద్ధమంటూ ఇష్టానుసారంగా స్టిక్కర్లు అతికిస్తున్నా అధికారుల కళ్లకు ఇవేమీ కనిపించడం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే అన్నట్లుగా తయారైంది. కోడ్‌ ఉల్లంఘనలు పర్యవేక్షించాల్సిన అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం అవుతుండటంతో మండలంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అపహాస్యం అవుతోంది. ఖాజీపేట మండలం నాగసానిపల్లె పంచాయతీ కేంద్రంలో ఎక్కడ చూసినా అధికార పార్టీకి చెందిన స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. విద్యుత్తు స్తంభాలు, విద్యుత్తు మోటారు షెల్టరు, చర్చి ఇలా ఒకటేమిటి గ్రామం మొత్తం అధికార వైకాపా స్టిక్కర్లు అంటించి ఉన్నాయి. స్థానిక సర్పంచి అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ కోడ్‌ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇప్పటికైనా కోడ్‌ ఉల్లంఘనలను పర్యవేక్షించే అధికారులు ప్రజాక్షేత్రంలో అంటించిన వైకాపా స్టిక్కర్లను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

నాగసానిపల్లెలో చర్చి తలుపునకు...

ఒక్క వానకే బయటపడ్డ రంగులు

చాపాడు: ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఎక్కడా రాజకీయ పార్టీల రంగులు కనిపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయ రంగులకు కొన్ని ప్రాంతాల్లో తూతూ మంత్రంగా సున్నం కొట్టడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కొట్టుకుపోయి యథావిధిగా వైకాపా రంగులు దర్శనిమిస్తున్నాయి. చాపాడు మండలం భద్రిపల్లెలో పాల కేంద్రం భవనాన్ని ఆర్బీకేగా వినియోగిస్తూ వేసిన రంగులు ఇలా బయటపడ్డాయి. సచివాలయాల వద్ద సీఎం, ప్రభుత్వ పథకాలకు అతికించిన కాగితాలు చినిగిపోయి అలాగే దర్శనమిస్తున్నాయి.

చాపాడు మండలం భద్రిపల్లె పాల కేంద్రానికి వైకాపా రంగులు

బద్వేలు, మైలవరం, పోరుమామిళ్ల: బద్వేలు నియోజకవర్గం, మైలవరం మండలంలో ఎన్నికలకోడ్‌ ఉల్లంఘన కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ అమలు ఉన్నా లెక్కపెట్టడంలేదు. వైకాపాకు చెందిన సిద్ధం స్టిక్కర్లు పలుగ్రామాల్లో పట్టణాల్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొందరు వచ్చి ఇళ్లకు విద్యుత్తు స్తంభాలకు అంటించారు. పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామ సచివాలయంపై నవరత్నాల పథకం పోస్టరు వెలిసింది. బాలిరెడ్డిపల్లె గ్రామంలో ఇళ్లపై సిద్ధం స్టిక్కర్స్‌ అంటించిన విషయం మరవక మునుపే బద్వేలు పట్టణం, మైలవరంలో పలుచోట్ల వైకాపా పథకాలతోపాటు సిద్ధం స్టిక్కర్లు ఇళ్ల గోడలు,  విద్యుత్తు స్తంభాలపై వెలిశాయి. సిద్దవటం రోడ్డులోని మార్కెట్టు యార్డు విద్యానగర్‌లో ఈ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని