logo

ఎమ్మెల్యే భూమిపూజ చేసి రెండేళ్లు... పూర్తికి ఇంకెన్నాళ్లు

ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది.

Published : 10 May 2024 03:22 IST

జమ్మలమడుగులో మురిగిపోయిన రూ.86 లక్షలు
అగ్నిమాపక శాఖ భవన పనులకు గ్రహణం
న్యూస్‌టుడే, జమ్మలమడుగు

జమ్మలమడుగులో నిధుల్లేక ఆగిన అగ్నిమాపక శాఖ భవన పనులు

ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో చూస్తే సమస్యలు తిష్ఠవేశాయి. నిధుల లేమితో నూతన భవన నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. ముద్దనూరుకు ఫైర్‌స్టేషన్‌ మంజూరైనా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. కొండాపురం, ముద్దనూరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే జమ్మలమడుగు నుంచే పరుగులు పెట్టాల్సి ఉంటుంది. స్థానిక ముద్దనూరు రోడ్డులో 2021, జనవరి 7వ తేదీన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అగ్నిమాపక శాఖ నూతన భవనానికి భూమిపూజ చేశారు. కార్యాలయంతోపాటు రెండు అగ్నిమాపక వాహనాలను నిలుపుకొనేందుకు వీలుగా, ఇతర గదుల కోసం సుమారు రూ.86 లక్షలు కేటాయించారు. అక్కడి భూమిని పరిశీలించిన అనంతరం పనులు మొదలయ్యాయి. పునాదులు దాటి గోడల నిర్మాణ సమయంలో పనులు కుంటుపడ్డాయి. నిధుల లేమితో చాలా కాలంగా పనులు ఆగిపోయాయి.

పెచ్చులూడి పడుతుంటే భయం భయంగా సిబ్బంది విధులు

1962లో నిర్మించిన పాత భవనంలోనే అగ్నిమాపకశాఖ కార్యాలయం నేటికీ కొనసాగుతోంది. అప్పుడప్పుడూ పైనుంచి పెచ్చులూడి పడుతుంటే సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జమ్మలమడుగు ఫైర్‌స్టేషన్‌ పరిధిలో జమ్మలమడుగుతోపాటు మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురం మండలాలు ఉండేవి. కొత్తగా ముద్దనూరుకు ఫైర్‌స్టేషన్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాడిపత్రి రోడ్డులో స్థలం ఎంపిక చేసినా పనులు మొదలు కాలేదు. ఇప్పటి వరకు ఆ రెండు మండలాల్లో ఏవైనా అగ్నిప్రమాదాలు జరిగితే జమ్మలమడుగు సిబ్బంది వెళ్లి ఆర్పాల్సి ఉంటుంది. అక్కడి గ్రామాలు 20 నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉండడంతో అంతదూరం చేరుకునే లోగా నష్టం జరిగిపోతుంది కావున ముద్దనూరులో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటు చేసి జమ్మలమడుగులో నూతన భవనానికి నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల ముద్దనూరు మండలంలో అగ్నిప్రమాదాలు జరిగాయి. గడ్డివాములు, చక్కడిపోలో మంటలు వ్యాపించగా జమ్మలమడుగు నుంచి ఫైర్‌ ఇంజిన్‌ వెళ్లి ఆర్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతదూరం వెళ్లేసరికి నష్టం జరిగిపోయిందని బాధితులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని