logo

కొలిస్తే అంత ఉండదు

పన్నెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇళ్లంటూ అపార్ట్‌మెంటులో ఫ్లాటు అమ్ముతారు. లిఫ్టు, మెట్లు, కారిడార్‌, ఇంటి గోడలతో కలిపినా.. కొలతల్లో ఆ విస్తీర్ణం కనిపించదు. సగటున

Updated : 10 Dec 2021 10:26 IST

నిర్మాణ రంగంలో దగా

ఫిర్యాదులొస్తున్నా నిద్ర లేవని ‘రెరా’

ఈనాడు, హైదరాబాద్‌

పన్నెండు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడక గదుల ఇళ్లంటూ అపార్ట్‌మెంటులో ఫ్లాటు అమ్ముతారు. లిఫ్టు, మెట్లు, కారిడార్‌, ఇంటి గోడలతో కలిపినా.. కొలతల్లో ఆ విస్తీర్ణం కనిపించదు. సగటున 20-30శాతం విస్తీర్ణం తక్కువ ఉంటుంది. కొంత కాలంగా కొందరు నిర్మాణదారుల్లో ఇలాంటి ఓ మోసం ఉంటుందనే ఆలోచనే వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏల నుంచి అన్ని అనుమతులు పొందిన అపార్ట్‌మెంట్లలో.. ఎలాంటి అవకతవకలు ఉండవనే నమ్మకంతో పౌరులు గుడ్డిగా మోసపోతున్నారు.

విస్తీర్ణంలో కోత

సీతాఫల్‌మండి వంతెన పక్కన జీహెచ్‌ఎంసీ అనుమతితో నిర్మాణమైన అపార్ట్‌మెంట్‌లో నాలుగు అంతస్తులు, ప్రతి అంతస్తులో మూడు పడక గదుల ఫ్లాట్లు రెండు ఉంటాయి. గోడలతో కలిపి ఫ్లాటు విస్తీర్ణం(బిల్టప్‌ ఏరియా) కొలవగా, నిర్మాణదారు చెప్పిన దానికన్నా 25శాతం తక్కువ. కారిడార్‌, లిఫ్టు, మెట్ల విస్తీర్ణాన్ని కలిపినా కొలత సరిపోలేదు. ఇంటి యజమాని నిర్మాణదారుని ప్రశ్నిస్తే.. డబ్బు పూర్తిగా చెల్లించి, గృహప్రవేశం చేశాక కొలతల గురించి అడుగుతారేంటి అని జవాబిచ్చారు. ఈ విషయమై ఓ నిర్మాణ సంస్థ యజమానిని వివరణ కోరగా.. ‘‘20ఏళ్ల కిందట ఇంట్లోని కార్పెట్‌ ఏరియానే అమ్మేవారు. అప్పుడు రెండు పడక గదుల ఇల్లంటే విశాలంగా కనిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్లాటు విస్తీర్ణంలో క్రమంగా.. గోడలు, బాల్కనీ, ఎక్స్‌టర్నల్‌ బాల్కనీ, కారిడార్‌, మెట్లు, లిఫ్టు, తదితర ప్రాంతాలను కలపుతూ వెళ్తున్నాం. భూమి ధర, నిర్మాణ వ్యయం పెరగడంతో అలా చేయాల్సి వస్తోంది.’’అని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. మొదటిసారి ఇళ్లు కొనేవారి నుంచి చాలా ఫ్లాట్లకు యజమానిగా ఉన్నోళ్లూ దీని గురించి ఆలోచించట్లేదని, ప్రభుత్వమూ పట్టించుకోవట్లేదని ఆయన వెల్లడించారు.

ఇలా మోసం

● రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసి వినియోగదారులకు అప్పగిస్తామని నిర్మాణదారులు ఒప్పందపత్రం రాసిస్తారు. దానికి తగ్గట్లు విడతలవారీ పూర్తి డబ్బు తీసుకుంటారు. ప్రాజెక్టు మాత్రం సమయానికి పూర్తవట్లేదు. ఫిర్యాదు చేద్దామని ‘రెరా’ను ఆశ్రయిస్తే.. ప్రాజెక్టును నాలుగేళ్లు, ఐదేళ్లలో పూర్తి చేస్తామని అదే నిర్మాణదారు అక్కడిచ్చిన స్వీయ ధ్రువీకరణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇది వినియోగదారులను మోసం చేయడమే.

నిద్రాణంగా రెరా..

కొనుగోలుదారులు, నిర్మాణదారుల మధ్య సంధానకర్తగా ఉంటూ, సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర స్థిరాస్తి అభివృద్ధి, నియంత్రణ చట్టం(రెరా) అమలు కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీటీసీపీ ఉన్నతాధికారి ఇద్దరే మొదట్నుంచి రెరా’ను నడిపిస్తున్నారు. పూర్తిస్థాయిలో సభ్యులు నియామకం కాకపోవడం, ఆన్‌లైన్‌ ఫిర్యాదుల వ్యవస్థ లేకపోవడం, నేరుగా వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకూ రెరాలో అధికారుల కొరత ఉండటం వినియోగదారులకు సమస్యలు తెచ్చిపెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని