logo

లైంగిక వేధింపులు.. చిత్రహింసలు.. విసిగిపోయి భర్తను చంపేసినభార్య

భార్య మనసు గ్రహించకుండా పడక గదిలో లైంగికంగా చిత్రహింసలు పెడుతున్న భర్త తీరుపై విసిగిపోయి కడతేర్చింది ఇల్లాలు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చిన్నకోడూరు మండలం

Updated : 07 Jan 2022 12:53 IST

వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ రాజేశ్‌

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: భార్య మనసు గ్రహించకుండా పడక గదిలో లైంగికంగా చిత్రహింసలు పెడుతున్న భర్త తీరుపై విసిగిపోయి కడతేర్చింది ఇల్లాలు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగింది. చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌ గ్రామానికి చెందిన మర్కంటి ఎల్లయ్య (55), నర్సవ్వ (50) దంపతులు. ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుమార్తె రేణుకకు గ్రామంలోనే ఇచ్చి ఏడేళ్ల క్రితం పెళ్లి చేశారు. భార్యాభర్తలిద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. నర్సవ్వను ఆమె భర్త ఏళ్లుగా వేధిస్తున్నాడు. శారీరకంగా కలవాలంటూ తరచూ గొడవపడుతూ ఇష్టారీతిన కొట్టేవాడు. చిన్నపాటి కారణాలకు చితకబాదేవాడు. మూడు నెలల క్రితం కూర సరిగా వండలేదని బాదాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని గొడవ సద్దుమణిగించారు.

గత సోమవారం భార్య దగ్గరికి రానివ్వక పోవడంతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ గొడ్డలి కర్రతో కొట్టాడు. ఆమె గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లింది. మరోసారి పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చింది. బుధవారం రాత్రి మరోసారి లైంగికంగా వేధించాడు. అర్ధరాత్రి తరువాత మరోసారి సతాయించగా ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె బయటకు వెళ్లే మార్గం లేకుండా ఇంటి గడియ వేసి, గొడ్డలి కర్రతో భార్యపై ఎల్లయ్య మళ్లీ దాడి చేశాడు. అనంతరం అతను నిద్రలోకి జారుకోగా శారీరక హింసను భరించలేని నర్సవ్వ అక్కడే ఉన్న గొడ్డలితో భర్త మెడ పైన వేటు వేసింది. ఫలితంగా ఎల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తెల్లవారుజామున స్థానికులు గమనించి కుమార్తె కుటుంబానికి చెప్పారు. రక్తపు మడుగులో ఉన్న ఎల్లయ్యను చూసి హతాశులయ్యారు. సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేశ్‌ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. అక్కడే ఉన్న నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను రోదిస్తూ ఆవేదనాభరితంగా వివరించింది. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని