logo

Balineni Srinivasa Reddy - YSRCP: పదవి వీడిన విధేయుడు

2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రిగా బాలినేని బాధ్యతలు నిర్వహించారు. మొదటి మూడేళ్లూ ఆయన హవా నడిచింది.

Updated : 30 Apr 2023 10:23 IST

వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి
చెల్లుబాటు కాకుండా పోతున్న మాట 
సమన్వయకర్తగా బాలినేని రాజీనామా

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రిగా బాలినేని బాధ్యతలు నిర్వహించారు. మొదటి మూడేళ్లూ ఆయన హవా నడిచింది. గత ఏడాది చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉద్వాసన పలికారు. అదేసమయంలో జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించారు. ఈ విషయమై బాలినేని అలకబూనారు. ఆయన అభిమానులు నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో బెట్టు వీడారు. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత విజయవాడ నుంచి తొలిసారి జిల్లాకు వస్తూ భారీ ర్యాలీగా బాలినేని బల ప్రదర్శన చేశారు.

జిల్లా పెద్దన్నగా ఆయన వద్దనేనా..!: తనకు పదవి లభించని నాటి నుంచీ మంత్రి సురేష్‌తో బాలినేని ఎడముఖం పెడముఖగానే వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత ఆయన్ను ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగా వైకాపా ప్రకటించింది. ఆ తర్వాత స్వల్ప కాలంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు కేటాయించారు. అప్పటి వరకు జిల్లాలో వైకాపాకు బాలినేని పెద్దన్నగా వ్యవహరించారు. అటువంటిది జిల్లా పార్టీతో సంబంధాలను పూర్తిగా తప్పించారు.

విమర్శలు.. ఫిర్యాదులు...: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇటీవల పలు వివాదాలు చుట్టుముట్టాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డికి చెందిన లేఅవుట్‌కు సంబంధించి అటవీ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని.. బాలినేని అటవీ శాఖా మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ జనసేనకు చెందిన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఓ సినీ నిర్మాణ సంస్థలో బాలినేని తరపున ఆయన వియ్యంకుడు పెట్టుబడులు పెట్టారంటూ ఐటీ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణలతో పాటు ఒంగోలులో కుండా భాస్కర్‌రెడ్డి నిర్మిస్తున్న శ్రీకరి ఎంపైర్‌లో చెరువు, ప్రభుత్వ భూములను ఆక్రమించారని, అక్రమంగా ఏడు కిలో మీటర్ల దూరంలో పైపులైన్లు వేసి నీటిని తరలించే ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ వరుస వివాదాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

కొమ్ము కాయని అధిష్ఠానం...: తనపై వస్తున్న వరుస ఆరోపణలు, చోటుచేసుకుంటున్న వివాదాల వెనుక పార్టీలోని నేతలే ఎవరో ఉండి చేయిస్తున్నారనేది బాలినేని అభియోగం. ఈ నేపథ్యంలో ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ఏర్పాటు చేసి విచారణ జరిపించి నిర్దోషిత్వం నిరూపించుకోవాలని పార్టీ పెద్దల్లో ఒకరు బాలినేనితో వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇది ఆయన్ను ఆగ్రహానికి గురిచేసిందనే చర్చ సాగుతోంది.

సమాచారవివ్వకుండానే నియామకాలు..!: ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డీఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేసింది. ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్ధన్‌ నియమితులయ్యారు. బాలినేనికి ఆయన సన్నిహితుడే అయినప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డిల ప్రమేయంతో ఆ నియామకం చేపట్టారంటూ బాలినేని గుర్రుగా ఉన్నారని ప్రచారం. తనకు విధేయుడిగా ఉన్న ఓ పోలీసు సీఐని జిల్లాకు తీసుకొచ్చేందుకు శ్రీనివాసరెడ్డి ఎంతగానో ప్రయత్నించారు. అయితే అవేమీ ఫలించలేదు. సదరు సీఐని బాపట్ల జిల్లా సంతమాగులూరులో నియమించారు. అనంతరం పది రోజుల్లోనే వీఆర్‌కు పంపారు. పోలీసు శాఖ తన మాటకు పెద్దగా విలువ ఇవ్వకుండా పక్కనబెడుతున్నారని బాలినేని భావిస్తున్నట్టు సమాచారం.

ఆ మాత్రలతో సంబంధం ఏమిటి..?: తాజాగా విదేశాలకు ట్రెమడాల్‌ మాత్రలతో సేఫ్‌ ఫార్ములేషన్‌ కంపెనీ డైరెక్టర్‌ శనగల శ్రీధర్‌రెడ్డి ముంబై కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కంపెనీలో బాలినేని గోవిందరెడ్డి, అరుణ అదనపు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ ఉదంతం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. జిల్లాకే చెందిన వీరికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్న బంధుత్వం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. తన మాటకు పార్టీలో పెద్దగా విలువివ్వని నేపథ్యంలో ఆ పదవిలో ఉండీ ఏం ప్రయోజనమని గత కొన్నిరోజులుగా తన సన్నిహితుల వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లోనే పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడం వైకాపా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిసోంది.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సమీప బంధువు. వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు. వైకాపా ఆవిర్భావం నుంచి జగన్‌ వెన్నంటి ఉంటూ నడిచిన సీనియర్‌ నేత ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు పార్టీ అప్పగించిన బాధ్యతలను వద్దనుకున్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. సంబంధిత లేఖను అధినాయకత్వానికి పంపారు. ఈ పరిణామం చర్చనీయాంశం కావడంతో పాటు.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

మంత్రి x మాజీ మంత్రి...

ఏప్రిల్‌ 12న ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మార్కాపురం పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్‌ వద్దకు వాహనాలో బాలినేని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో మంత్రి సురేష్‌ను అనుమతించారు. దీంతో మాజీ మంత్రి అలకబూనారు. తనను అడ్డుకోవడం వెనుక పార్టీలోని కొందరి కుట్ర ఉందని అనుమానించారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభకు హాజరు కాకుండానే వెనుదిరిగారు. ఈ విషయం తెలిసి సీఎం వెనక్కు పిలిపించి ఈబీసీ నేస్తం బటన్‌ను బాలినేనితోనే నొక్కించారు. ఆ తర్వాత కూడా అలక వీడలేదు. నాలుగు రోజుల క్రితం ఒంగోలులో డీఆర్‌సీ సమావేశం నిర్వహించారు. మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్‌ హాజరైనప్పటికీ శ్రీనివాసరెడ్డి గైర్హాజరయ్యారు. ఆ తర్వాత రోజే ఒంగోలులో మురుగు శుద్ధి జల కేంద్రం ప్రారంభోత్సవంలో బాలినేనిని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రి సురేష్‌ నానాపాట్లు పడ్డారు. ముఖ్యఅతిథి హోదాలో బాలినేని మాట్లాడుతున్న సమయంలో చేతులు కట్టుకుని, తలొంచుకుని నిల్చునే ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేనికి అధిక ప్రాధాన్యమిచ్చి ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు అంతగా పట్టించుకోలేదు. షెడ్యూల్‌ ప్రకారం ఒంగోలులో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను అదేరోజు మంత్రి పరిశీలించాల్సి ఉంది. అయితే ప్రొటోకాల్‌ పరంగా తనకు చోటుచేసుకున్న అవమానంతో ఆ కార్యక్రమాన్ని మంత్రి సురేష్‌ రద్దు చేసుకున్నారు. హుటాహుటిన విజయవాడ బయలుదేరి వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని