ఆకలిమంటల్లో జీవనహక్కు

ఆకలి మంటల్లో కమిలిపోతున్న అన్నార్తుల్ని ఆదుకోవడం సంక్షేమరాజ్య విధ్యుక్తధర్మం. దేశంలో ఆకలిచావుల్ని నివారించడానికి సామాజిక వంటశాలల ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడల్లా, ఆ మౌలిక బాధ్యతను ప్రభుత్వాలకు గుర్తు చేస్తూనే ఉంది... సర్వోన్నత న్యాయస్థానం!

Published : 20 Jan 2022 00:10 IST

ఆకలి మంటల్లో కమిలిపోతున్న అన్నార్తుల్ని ఆదుకోవడం సంక్షేమరాజ్య విధ్యుక్తధర్మం. దేశంలో ఆకలిచావుల్ని నివారించడానికి సామాజిక వంటశాలల ఏర్పాటును కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడల్లా, ఆ మౌలిక బాధ్యతను ప్రభుత్వాలకు గుర్తు చేస్తూనే ఉంది... సర్వోన్నత న్యాయస్థానం! దేశంలో ఎక్కడా ఆకలి చావులన్నవే లేవంటూ కేంద్రం తాజాగా ప్రమాణపత్రం సమర్పించడం సుప్రీంకోర్టునే కాదు- యావత్‌ దేశాన్నీ విస్మయపరచేదే. పెచ్చరిల్లుతున్న పోషకాహార లోపాలు దేశవ్యాప్తంగా ఎన్నో పసిప్రాణాల్ని కబళిస్తున్నట్లు లోగడ పరిశోధనలనేకం వెల్లడించాయి. కొవిడ్‌ సంక్షోభంతో ఆదాయాలు తెగ్గోసుకుపోయిన అసంఖ్యాక కుటుంబాలు దుర్భర పేదరికంలోకి కూరుకుపోతున్నాయి. ఏటా పిల్లలు సహా సుమారు 25 లక్షల ప్రాణాల్ని క్షుద్బాధ బలిగొంటున్నదన్న అంచనాలు భీతావహ స్థితిగతులకు అద్దం పడుతున్నాయి. పోషకాహార లోపాలతో జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్న అభాగ్యుల గోడు అరణ్యరోదనమవుతోంది. నిరుడు మే నెలలో వలసకూలీల అవస్థల విచారణకు ఉద్దేశించిన కేసు సర్వోన్నత న్యాయస్థానం ముందుకొచ్చింది. నాడు వాదనలు వినిపిస్తూ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌- రిక్షా కార్మికులు, చిరువ్యాపారులు, అసంఘటిత రంగ శ్రామికులెందరో మలమల మాడిపోతున్న దీనదృశ్యాల్ని కళ్లకు కట్టారు. ఈ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘రాష్ట్రాలనుంచి అందిన సమాచారం ప్రాతిపదికన...’ అంటూ మొక్కుబడిగా ప్రమాణపత్రం వండివార్చింది. అధికారిక గణాంకాల ప్రకారమే, దేశంలో 19కోట్ల మంది కాలే కడుపులతో పొద్దుపుచ్చుతున్నారు. దాన్నెక్కడా ప్రస్తావించకుండా, ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పకుండా, సరైన అధ్యయనమన్నదే చేపట్టకుండా- ఆకలి చావులు లేవని ప్రభువులు ఎలా తీర్మానించేస్తారు?

ఏడున్నర దశాబ్దాల క్రితం ఆంగ్లేయుల చెర వీడిన తరుణాన, ఇప్పుడిక ఆకలికోరలనుంచి విముక్తం కావడమే ప్రధాన కర్తవ్యమని జాతిజనులకు బాబూ రాజేంద్ర ప్రసాద్‌ పిలుపిచ్చారు. వాస్తవంలో, సాధించిందేమిటి? డెబ్భై అయిదు సంవత్సరాల అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన వేళ ఉన్నది ఉన్నట్లు ఒప్పుకొనే నిజాయతీ, సాహసం నేతాగణంలో కొరవడుతున్నాయి. ఎవరైనా న్యాయపాలిక కళ్లకు గంతలు కట్టజూడటం వృథా ప్రయాస. తాజా ప్రమాణపత్ర రూపకర్తలకు గుర్తుందో లేదో- ఆకలిని, పోషకాహార లోపాల్ని దీటుగా ఎదుర్కోవడంలో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విఫలమవుతున్నట్లు రెండేళ్లక్రితం ‘నీతిఆయోగ్‌’ వెల్లడించింది. 116 దేశాల అంతర్జాతీయ క్షుద్బాధా సూచీలో భారత్‌ 101వ స్థానానికి పరిమితమైంది. అంతా బాగానే ఉంటే- కోట్లమంది ఆకలి తీర్చడానికి మధ్యాహ్న భోజన పథకం, విస్తృత ప్రాతిపదికన అంగన్‌వాడీల వ్యవస్థ... ఎందుకు అవసరమైనట్లు? ప్రజాపంపిణీ వ్యవస్థలో కంతల కారణంగా, లబ్ధిదారులకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలు పక్కదారి పట్టి నల్లబజారుకు తరలుతున్నాయని పార్లమెంటరీ స్థాయీసంఘమే తూర్పారపట్టింది. వ్యవసాయం, లఘు పరిశ్రమలు, చేనేత వంటివి సంక్షోభంలో కూరుకుపోయి కోట్లాది జీవితాలు కొరతల కొలిమిలో కునారిల్లుతున్నాయి. అర్ధాకలి, పస్తుల విజృంభణ ఆహారభద్రత అర్థతాత్పర్యాలనే కుళ్లబొడుస్తోంది. ఛిద్రమైన బతుకుల వాస్తవ వెతలను గాలికొదిలేసి సమస్య ఆనుపానులే లేవంటే- పరిస్థితి దానంతటదే కుదుట పడుతుందా? ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సామాజిక వంటశాలలు ఆరంభమయ్యాయి. చేతనైనంత మేరకు క్షుద్బాధా పీడితుల్ని ఆదుకుంటున్నాయి. దేశంలో ఎవరూ ఎక్కడా తిండికోసం అలమటించాల్సిన దుర్గతి ఉండకూడదు. అందుకోసం సామాజిక వంటశాలల స్ఫూర్తిని అంతటా విస్తరింపజేయాలి. ఆ మానవీయ బాధ్యతను కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో చురుగ్గా భుజాలకు ఎత్తుకోవాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.