వ్యర్థాల నుంచి జీవ ఇంధనం!

పెట్రో ఉత్పత్తుల విస్తృత వినియోగం ద్వారా పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టాలను, పోనుపోను ఇంతలంతలవుతున్న ముడి చమురు దిగుమతుల బిల్లును ఏకకాలంలో నియంత్రించేదిగా ఇథనాల్‌ పేరు

Published : 12 Aug 2022 00:52 IST

పెట్రో ఉత్పత్తుల విస్తృత వినియోగం ద్వారా పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టాలను, పోనుపోను ఇంతలంతలవుతున్న ముడి చమురు దిగుమతుల బిల్లును ఏకకాలంలో నియంత్రించేదిగా ఇథనాల్‌ పేరు కొన్నేళ్లుగా మార్మోగుతోంది. అటువంటి జీవ ఇంధనాన్ని పంట వ్యర్థాల నుంచి రూపొందించే రూ.900కోట్ల కర్మాగారమొకటి హరియాణాలోని పానీపత్‌లో తాజాగా మొదలైంది. ఉత్తర భారతదేశంలో టన్నులకొద్దీ వరిదుబ్బుల్ని పొలాల్లోనే వదిలేసి అక్కడే తగలబెట్టడం పరిపాటి. పర్యవసానంగా, దేశ రాజధాని పరిసర ప్రాంతాలు దీపావళి రోజుల్లో తీవ్ర వాయుకాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతుంటాయి. పానీపత్‌ కర్మాగారాన్ని వర్చువల్‌ పద్ధతిలో జాతికి అంకితమిస్తూ ప్రధాని మోదీ చెప్పినట్లు- దేశంలోనే అభివృద్ధిపరచిన రెండోతరం (2జీ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే విభాగం పుణ్యమా అని... దిల్లీ ఆ చుట్టుపక్కల నివసించేవారు ఇక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటారు! చెరకు రసం, మొలాసెస్‌ వంటివి ఉపయోగించి బయో ఇథనాల్‌ ఉత్పత్తి చేయడం తొలితరం సాంకేతికత. పంట వ్యర్థాలు తదితరాల నుంచి జీవ ఇంధనం రాబట్టడం 2జీ ప్రత్యేకత. ఇప్పటివరకు అమెరికా, బ్రెజిల్‌కే పరిమితమైన ఆ సాంకేతికత దేశీయంగా తొలిసారి అందుబాటులోకి రావడం జాతికే గర్వకారణం. పానీపత్‌ విభాగం ఏటా రెండు లక్షల టన్నుల పంట వ్యర్థాలనుంచి మూడు కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తుందంటున్నారు. 2025-26 నాటికల్లా 20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోలును దేశమంతటా విక్రయించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రవచిత లక్ష్యం. అందుకోసం వెయ్యి కోట్ల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుందన్న అంచనా రెండు నెలలక్రితం వెలుగు చూసింది. ఆ మేరకు పంజాబ్‌, ఒడిశా, అస్సామ్‌లలోనూ కొత్త యూనిట్లు రానున్నాయి. ప్రైవేటురంగంలో అటువంటి 16 కర్మాగారాల ప్రతిపాదనలూ వినిపిస్తున్నాయి. జీవ ఇంధనరంగంలో మారుతున్న భారత ముఖచిత్రాన్ని కళ్లకు కడుతున్న పరిణామాలివి!

ఎనిమిదేళ్లుగా దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి, వినియోగం రెండూ పెరిగాయి. మోదీ తొలిసారి కేంద్రాధికారం చేపట్టేసరికి 40కోట్ల లీటర్ల దాకా నమోదైన ఇథనాల్‌ ఉత్పత్తి ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు విస్తరించింది. ఇథనాల్‌ కలిపిన పెట్రోలు వాడకం రూపేణా ఎన్డీయే జమానాలో రూ.50వేలకోట్ల దాకా విదేశమారక ద్రవ్యాన్ని ఆదా చేయగలిగినట్లు, దాదాపుగా అదంతా రైతులకు చేకూరిన లబ్ధేనని చెబుతున్నారు. అదే సమయంలో 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రించగలగడం మరింత ముఖ్య ప్రయోజనం! జీవ ఇంధన ఉత్పత్తిలో అమెరికా, బ్రెజిల్‌, ఐరోపా యూనియన్‌, చైనా మనకన్నా ఎంతో ముందున్నాయి. తాజా, వాడేసిన వంటనూనెలు, జంతువుల కొవ్వుతో తయారయ్యే జీవ ఇంధనాన్ని అమెరికా విరివిగా వినియోగిస్తోంది. చెరకును విస్తృతంగా పండించే బ్రెజిల్‌లో ఏడో దశకం నుంచే జీవ ఇంధన వినియోగం చురుకందుకొంది. పెట్రోలుకు ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తున్న జనచైనా పెద్దయెత్తున జీవ ఇంధన తయారీ నిమిత్తం మలేసియా, ఇండొనేసియాలనుంచి కర్రపెండలం దుంపల్ని దిగుమతి చేసుకుంటోంది. మొక్కజొన్న, కలప రద్దు, జంతు వ్యర్థాలు, మురుగు నుంచీ బయోడీజిల్‌ తయారీకి దేశదేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. తనవంతుగా ఇథనాల్‌ ఉత్పత్తికి ఇండియా లక్షల టన్నుల చక్కెర నిల్వల్ని, మిగులు ఆహార ధాన్యాల్ని మళ్ళించనుందన్న కథనాలు గతంలో చర్చోపచర్చలకు దారి తీశాయి. ఆఫ్రికాలో తిండిగింజల ధరవరలు భగ్గుమనడానికి కారణం జీవ ఇంధనాల సృష్టికి వాటిని ఉపయోగించడమేనన్న విమర్శల నేపథ్యంలో- దేశీయంగా 2జీ ఇథనాల్‌ సాంకేతికత వినియోగం వైపు అడుగులు పడటం, వ్యర్థాలు రైతాంగానికి ఆదాయ వనరుగా మారడం... గొప్ప తీపికబురు. దేశంలోని ఆరుకోట్ల హెక్టార్ల బీడుభూమిలో సగం విస్తీర్ణంలోనైనా జత్రోపా సాగు చేస్తే ఏడాదికి ఆరుకోట్ల టన్నుల జీవ ఇంధనం అందుబాటులోకి వస్తుందని రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం 2005లోనే ఉద్బోధించారు. అటువంటి మేలిమి సూచనలకూ సరైన మన్నన దక్కితే, దేశ ఇంధన భద్రతకు ఢోకా ఉండదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.