బలిపీఠంపై జాతి భవిత

మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధినేతలు జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, నరేంద్ర ఆర్యలను హైదరాబాద్‌ పోలీసులు ఇటీవల గోవాలో చాకచక్యంగా పట్టుకున్నారు. డిసౌజా నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో దందా నడిపిస్తున్నాడు. ఆఫ్రికా నుంచి మత్తుమందులు

Published : 29 Sep 2022 00:37 IST

మాదక ద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధినేతలు జాన్‌ స్టీఫెన్‌ డిసౌజా, నరేంద్ర ఆర్యలను హైదరాబాద్‌ పోలీసులు ఇటీవల గోవాలో చాకచక్యంగా పట్టుకున్నారు. డిసౌజా నాలుగు దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో దందా నడిపిస్తున్నాడు. ఆఫ్రికా నుంచి మత్తుమందులు తెప్పిస్తున్న ఆర్య-  పదిహేనేళ్లుగా వాటిని ఇండియాలో బట్వాడా చేస్తున్నాడు. జాతిని నిర్వీర్యం చేసే విష వ్యాపారాన్ని వాళ్లిద్దరూ నిరాటంకంగా నిర్వహిస్తుంటే- అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఇన్నేళ్లుగా వేడుక చూస్తోందా? దేశీయంగా డ్రగ్‌ మాఫియాను ఏలుతున్న వంద మంది పేర్లతో మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ఒక జాబితాను సిద్ధంచేస్తోందని, ఇక యుద్ధం ప్రకటించడమే తరువాయి అనే అధికారిక కథనాలు మూడేళ్ల నాడు వెల్లువెత్తాయి. ఏమైంది... ఆ కర్కోటకుల్లో ఎందరికి అరదండాలు పడ్డాయి? మాదక మహోత్పాతం నుంచి దేశాన్ని రక్షించడంలో కోటలు దాటుతున్న సర్కారీ మాటలు- చేతల్లో తేలిపోతున్నాయి. సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించినట్లు- సమాజంలో ఊడలు దిగిన మాదక ముఠాల మూలంగా పరిస్థితులు పోనుపోను విషమిస్తున్నాయి. 2006-2013 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1.52 లక్షల కిలోల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఆపై ఎనిమిదేళ్లలో అంతకు రెండింతలకు పైగా సరకు యంత్రాంగానికి చిక్కింది. మాదక ద్రవ్యాల వినియోగదారులు, చిల్లర సరఫరాదారులపైనే ఎక్కువగా కేసులు నమోదుచేస్తున్న యంత్రాంగం- కీలక సూత్రధారులను కటకటాల్లోకి పంపడంలో మాత్రం ఆపసోపాలు పడుతోంది. దేశీయంగా దొంగ గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించడంలోనూ అది చేతులెత్తేస్తోంది. కేంద్రం, రాష్ట్రాల నడుమ సమన్వయ రాహిత్యం, సిబ్బంది కొరత, ఇంటిదొంగల చేతివాటం వంటివి మాదక మహమ్మారి కరాళనృత్యానికి తాళమేస్తున్నాయి. యువభారతం జవసత్వాలను అవే పీల్చి పిప్పిచేస్తున్నాయి!

ముంబయిలోని నవశేవా నౌకాశ్రయంలో కొద్దిరోజుల క్రితం రూ.1,725 కోట్ల విలువైన 22 టన్నుల హెరాయిన్‌ అధికారులకు చిక్కింది. దేశంలోకి వెల్లువెత్తుతున్న మాదక ద్రవ్యాల్లో డెబ్భై శాతం సముద్ర మార్గంలోనే వస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే- కంటైనర్ల తనిఖీ వ్యవస్థను కొలువుతీర్చాలి. నౌకాదళం, కోస్టుగార్డు, పోలీసు బలగాలు, ప్రభుత్వ ప్రైవేటు నౌకాశ్రయాల అధికారులు కలిసికట్టుగా పరిశ్రమించాలి. కొవిడ్‌ అనంతరం డార్క్‌నెట్‌లో మత్తుమందుల ఆర్డర్లు, క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు, పార్శిళ్ల రూపంలో ఎక్కడికంటే అక్కడికి సరఫరాలు ఉద్ధృమయ్యాయి. ‘చాలా ప్రమాదకరమైన పద్ధతి ఇది... రాబోయే రోజుల్లో ఇంకా పెచ్చరిల్లనుంది... దాన్ని నిరోధించడానికి ఇప్పటికీ తగిన సాధనసంపత్తి, శిక్షణ ఏమీ లేవు’ అంటూ ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ప్రధాన్‌- ఇంతలంతలవుతున్న ముప్పును కాచుకోవడంలో మన సన్నద్ధత ఏపాటిదో ఇటీవలే బయటపెట్టారు. అటు పాకిస్థాన్‌ నుంచి కుప్పలుతెప్పలుగా మాదక ద్రవ్యాలను మోసుకొస్తున్న డ్రోన్లను పడగొట్టేందుకు తగిన సాంకేతిక వనరులు తమ దగ్గర లేవని సరిహద్దు భద్రతాదళం అధికారులే ఒప్పుకొంటున్నారు. ఆ లోపాలను పరిహరించడంపై కేంద్రం దృష్టి సారించకపోతే- మాదక ముఠాల ఆటలు కట్టించడం అసాధ్యమే!  మొత్తం సమాజానికే ఎసరుపెడుతున్న మాదకాసురులపై ఏమాత్రం సానుభూతి చూపించనక్కర్లేదని పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఆస్తుల స్వాధీనం, అత్యంత కఠిన శిక్షలతో మాఫియా మూకలపై ఉక్కుపాదం మోపాలి. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రభుత్వాలు చురుకెత్తించి- ప్రాణాంతక ఉచ్చులో చిన్నారులు, యువత చిక్కుకోకుండా కాచుకోవాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.