IPL 2024 Umpiring Errors: రోల్‌ మోడల్‌ లాంటి ఐపీఎల్‌లో... ఇదేం అంపైరింగ్‌!

ఈ ఏడాది ఐపీఎల్‌ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో...

Published : 10 May 2024 16:14 IST

ఐపీఎల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్‌ లీగ్‌. మిగిలిన లీగ్‌లకు ఇదో రోల్‌ మోడల్‌. ఈ టోర్నీని చూసే మిగిలిన లీగ్‌లు నియమ నిబంధనలు ఏర్పాటుచేసుకుంటూ ఉంటాయి. అలా 17 ఏళ్లుగా టీ20 క్రికెట్లో లీగ్‌లకు ఓ స్థాయిని తీసుకొచ్చిన ఐపీఎల్‌ (IPL) ఇప్పుడు నాసిరకంగా మారిందా! 2024 సీజన్లో అంపైరింగ్‌ చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. దాదాపు చాలా మ్యాచ్‌ల్లో అంపైర్లు అధ్వాన నిర్ణయాలతో ఆటగాళ్లకే కాదు అభిమానులకు కూడా షాక్‌ ఇస్తున్నారు. అసలు ఇది అంపైరింగేనా అనే అనుమానాన్ని కలిగిస్తున్నారు. తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్‌ ఫలితాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. మైదానంలో ఉన్న అంపైర్‌ అప్పటికప్పుడు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సరే అనుకోవచ్చు కానీ.. రివ్యూలు చూసి తీర్పు వెల్లడించే థర్డ్‌ అంపైర్‌ కూడా తప్పులు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

కోహ్లీ.. నో బాల్‌!

ఐపీఎల్‌ 17లో అంపైరింగ్‌ నిర్ణయాలకు బలైన ఆటగాళ్లలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 223 పరుగుల ఛేదనలో విరాట్‌ (Virat Kohli) 7 బంతుల్లో 18 పరుగులు చేసి జోరు మీదున్నప్పుడు హర్షిత్‌ రాణా వేసిన ఓ హై నోబాల్‌ అతడి బ్యాట్‌ పైభాగంలో తగలడం బౌలర్‌కే క్యాచ్‌ వెళ్లడం జరిగిపోయాయి. దీన్ని ఫీల్డ్‌ అంపైర్‌ టెలివిజన్‌ అంపైర్‌కు పంపించాడు. రిప్లేల్లో బంతి కోహ్లీ బ్యాట్‌ను తాకినప్పుడు అతడు క్రీజు బయట ఉన్నట్లు.. నడుము కంటే ఎక్కువ ఎత్తులో బంతి దూసుకొచ్చినట్లు తేలింది. అయినా కూడా థర్డ్‌ అంపైర్‌ కోహ్లీని ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అతడు హతాశుడయ్యాడు. అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే పెవిలియన్‌కు చేరాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే నడిచింది. 

వైడ్‌ బంతులను కూడా..

బ్యాటర్ల ఔట్‌లే కాదు వైడ్‌ బంతులను కూడా సరిగా నిర్ణయించలేకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. గుజరాత్‌ టైటాన్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజుశాంసన్‌కు గుజరాత్‌ పేసర్‌ మోహిత్‌శర్మ ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా ఓ బంతిని విసిరాడు. దాన్ని షాట్‌ ఆడేందుకు శాంసన్‌ ఆఫ్‌ సైడ్‌ వైపు జరిగాడు. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రివ్యూ అడిగాడు. రివ్యూలు చూస్తే శాంసన్‌ కదలికలను బట్టి బంతి వైడ్‌ కానట్లు అనిపించింది. అందుకే థర్డ్‌ అంపైర్‌ మరోసారి రిప్లే చూశాడు. చివరికి ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే కట్టుబడినట్లు తేల్చాడు. దీంతో గిల్‌ ఆశ్చర్యపోయాడు. ఇక లఖ్‌నవూ-దిల్లీ మ్యాచ్‌లోనూ ఇలాంటి తప్పిదమే జరిగింది. ఇషాంత్‌శర్మ వేసిన బంతి లెగ్‌సైడ్‌ పడిందని అంపైర్‌ వైడ్‌ ఇచ్చాడు. ఫీల్డింగ్‌ టీమ్‌ రివ్యూకి వెళ్లడంతో టీవీ అంపైర్‌ వైడ్‌ కాదని తేల్చాడు. ముంబయితో మ్యాచ్‌లో లఖ్‌నవూ బ్యాటర్‌ ఆయుష్‌ బదోని రనౌట్‌ కూడా ఈ వివాదాస్పద నిర్ణయాల జాబితాలోకి వస్తుంది.

సంజు వివాదం

సంజు శాంసన్‌ను ఔట్‌ ఇచ్చిన తీరైతే ఇంకా దారుణం. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ గెలిచే స్థితి నుంచి ఓడిపోయింది. శాంసన్‌ (Sanju Samson) ఔట్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. సెంచరీకి చేరువైన సంజు.. మ్యాచ్‌ గెలిపించే బయటకు వెళ్లాలనే పట్టుదలతో కనిపించాడు. కానీ ముకేశ్‌ కుమార్‌ వేసిన 16వ ఓవర్లో సంజు కొట్టిన భారీ షాట్‌ని బౌండరీ లైన్‌ దగ్గర షై హోప్‌ అందుకున్నట్లే అందుకున్నాడు. కానీ ఊపు ఆపుకోలేక అలా ముందుకు కాస్త తుళ్లాడు. ఈ క్రమంలో అతడి పాదం కొంచెం బౌండరీ లైన్‌కు తగిలినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌.. మూడో అంపైర్‌కు నివేదించాడు. విజువల్స్‌ చూస్తే హోప్‌ పాదం బౌండరీని టచ్‌ అయినట్లు స్పష్టంగానే కనిపించింది. ఒకవేళ ఎక్కువ స్పష్టత లేకపోతే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాటర్‌కే అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలి. కానీ అనూహ్యంగా సంజు ఔట్‌ అని థర్డ్‌ అంపైర్‌ ప్రకటించాడు. సంజుకే కాదు అభిమానులకు కూడా ఈ నిర్ణయం పెద్ద షాక్‌ ఇచ్చింది. 

గతంలోనూ ఐపీఎల్‌లో అంపైర్ల నిర్ణయాలు తప్పుడు తడకలుగా వచ్చాయి కానీ 2024 సీజన్లో ఉన్నంత నాసిరకంగా మాత్రం ఎప్పుడూ లేవు. మున్ముందు కూడా అంపైరింగ్‌ ఇలాగే సాగుతుందో లేక మెరుగుపడుతుందో చూడాలి.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని