Japan: ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్‌!

వివాహ బంధంలో కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోన్న జపాన్‌ యువత.. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది.

Published : 10 May 2024 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్‌ (Japan) యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మూడు పదుల వయసు వారిలో 75 శాతం మంది వివాహమే తమ జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో జపాన్‌ యువత కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోందట. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’ ధోరణి వైపు అడుగులు వేస్తోందని వెల్లడైంది.

ఏమిటీ మ్యారేజ్‌?

ప్రేమ లేదా లైంగిక సంబంధానికి తావు లేకుండా ఉండేదే ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’ (Friendship Marriage). భాగస్వామి పరస్పర ఆసక్తులు, విలువల ఆధారంగా వారితో కలిసి జీవించడం అన్నమాట. వీళ్లు చట్టపరంగా దంపతులే అయినప్పటికీ.. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటారట. కొందరు కలిసి జీవిస్తే.. మరికొందరు వేర్వేరుగా ఉంటారు. పిల్లలు కావాలనుకుంటే.. కృత్రిమ గర్భధారణ విధానాల ద్వారా ప్రయత్నిస్తారు. పరస్పర అంగీకారం ఉన్నంతకాలం తమకు నచ్చిన వారితో ఇరువురూ స్వేచ్ఛగా ఉండొచ్చు.

వాటిపై ఆసక్తి లేనివారు..

సంప్రదాయ వివాహ బంధంపై ఆసక్తి లేనివారు ఈ తరహా బంధంవైపు అడుగులు వేస్తున్నారని కొలొరస్‌ అనే జపాన్‌ సంస్థ నివేదించింది. 2015లో ఏర్పాటైన ఈ సంస్థ.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 500 మంది ఇటువంటి బంధంతో ఒక్కటయ్యారని, వారిలో కొందరు పిల్లల్ని కూడా పెంచుకున్నారని తెలిపింది. మొత్తం 12 కోట్లకుపైగా జనాభా ఉన్న జపాన్‌లో ఇలాంటి వారు దాదాపు ఒకశాతం మంది ఉండవచ్చని లెక్కకట్టింది. అంటే ఇలాంటి వారు దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది ఉన్నట్లు అంచనా.

జనాభా ఇలాగే తగ్గిపోతే.. జపాన్‌ మాయం...!

ఈ స్నేహ వివాహం పట్ల ఆసక్తి చూపుతున్నవారి సరాసరి వయసు 32 ఏళ్లుగా ఉందని కొలొరస్‌ ఏజెన్సీ పేర్కొంది. వీరిలో 85 శాతం మంది డిగ్రీ, ఉన్నత విద్య అభ్యసించిన వారే ఉంటున్నారని తెలిపింది. సంప్రదాయ వైవాహిక బంధాలు, ప్రేమపై ఆసక్తి లేనివారు ఇటువంటి సాంగత్యాన్ని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో సామాజిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న యువత ఈ తరహా బంధాన్ని ఎంచుకుంటున్నారనే వాదన ఉంది. పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను కూడా వీరు పొందుతున్నారు.

ఎలా జీవిస్తారు..?

పెళ్లికి ముందే ఒకరికొకరు పరిచయం పెంచుకుంటారు. ఆహారపు అలవాట్లు, ఇల్లు, దుస్తుల శుభ్రత, ఇతర ఖర్చులను ఎలా పంచుకోవాలనే విషయాలపైనా ఏకాభిప్రాయానికి వస్తారు. ఎటువంటి శృంగార సంబంధ అంశాలు లేనప్పటికీ దీన్ని ఎంచుకునే వారిలో 80 శాతం జంటలు సంతోషంగా ఉన్నట్లు కొలొరస్‌ పేర్కొంది.

‘ఎవరో ఒకరికి గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండటం నాకు నచ్చదు. కానీ, ఓ మంచి మిత్రురాలిగా ఉండగలను. నాలాంటి అభిరుచులు కలిగిన వ్యక్తితో జీవితాన్ని సరదాగా గడపపాలని కోరుకుంటున్నా’ అని ఓ అమ్మాయి వివరించింది. ‘ఒకే అభిరుచులు కలిగిన ఓ రూమ్‌మేట్‌తో ఉన్నట్లే ఉంటుంది. మేం మూడేళ్ల అంగీకారం కుదుర్చుకున్నాం’ అని ఓ వ్యక్తి చెప్పారు. ఇదిలాఉంటే, ఈ తరహా ట్రెండ్‌పై జపాన్‌ యువత ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. వీటివల్ల విడాకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని