ఆమెదే నిర్ణయాధికారం

స్త్రీ శరీరంపై సర్వహక్కులు ఆ స్త్రీకి మాత్రమే ఉంటాయి. మహిళల ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమైన ఆ కీలకాంశానికి- సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు గతంలోనే పట్టంకట్టాయి. పిల్లలకు జన్మనివ్వాలా వద్దా అన్న దానిపై నిర్ణయాధికారమూ ‘ఆమె’దేనని సుచితా శ్రీవాస్తవ కేసులో సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. గర్భవిచ్ఛిత్తి విషయంలో వివాహితలు, ఒంటరి మహిళల నడుమ దుర్విచక్షణ చూపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టంచేసింది.

Updated : 01 Oct 2022 05:39 IST

స్త్రీ శరీరంపై సర్వహక్కులు ఆ స్త్రీకి మాత్రమే ఉంటాయి. మహిళల ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమైన ఆ కీలకాంశానికి- సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు గతంలోనే పట్టంకట్టాయి. పిల్లలకు జన్మనివ్వాలా వద్దా అన్న దానిపై నిర్ణయాధికారమూ ‘ఆమె’దేనని సుచితా శ్రీవాస్తవ కేసులో సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. గర్భవిచ్ఛిత్తి విషయంలో వివాహితలు, ఒంటరి మహిళల నడుమ దుర్విచక్షణ చూపడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టంచేసింది. అవాంఛిత గర్భాన్ని 24 వారాల్లోపు సురక్షితంగా, చట్టబద్ధంగా తొలగించుకునే హక్కు స్త్రీలందరికీ ఉంటుందన్న ‘సుప్రీం’ ఆదేశాలు సహర్షంగా స్వాగతించదగినవి. వివిధ కారణాల రీత్యా తాను కోరుకోని బిడ్డను కడుపున మోసి తీరాలని ఏ మహిళనైనా ఎవరైనా నిర్బంధించడమన్నది- ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే! గర్భవిచ్ఛిత్తి కోసం తమను ఆశ్రయించే మైనర్‌ బాలికల వివరాలను పోలీసులకు వైద్యులు చెప్పనక్కర్లేదన్న న్యాయపాలిక నిర్దేశం- వ్యక్తిగత గోప్యతా హక్కుకు కాపుగాచేదే. భార్య ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా భర్త బలవంతంగా లైంగిక కార్యం జరపడాన్ని మానభంగ నేరంగా పరిగణించాలని జస్టిస్‌ వర్మ కమిటీ తొమ్మిదేళ్ల నాడు సిఫార్సు చేసింది. అది ఇంతవరకు అమలుకు నోచుకోని నేపథ్యంలో- మొన్నటి తన తీర్పులో వైవాహిక అత్యాచారాన్ని ‘సుప్రీం’ మొదటిసారి గుర్తించడం ఆసక్తిదాయకం. స్త్రీల పునరుత్పత్తి హక్కులకు బాసటగా నిలవడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల ప్రతికూలంగా స్పందించింది. దాంతో అక్కడ ప్రజాందోళనలు మిన్నంటాయి. తద్భిన్నంగా రాజ్యాంగదత్తమైన వ్యక్తిస్వేచ్ఛను సమున్నత పీఠంపై నిలబెట్టిన భారత సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు- దాని పురోగామి దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పాయి!

సర్కారీ లెక్కల మేరకు 2014-19 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 61.29 లక్షల గర్భస్రావాలు నమోదయ్యాయి. కానీ, ఇండియాలో ఏటా ఎన్ని అబార్షన్లు జరుగుతున్నాయో తెలిపే విశ్వసనీయ సమాచారమేదీ లేదని, అధికారిక గణాంకాలు సైతం అసమగ్ర వివరాలనే అందిస్తున్నాయని లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ నివేదిక లోగడే పెదవి విరిచింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా సురక్షిత గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన సమగ్ర సేవలకు అమిత ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రం చెబుతోంది. నిజానికి పన్నెండు వారాల్లోపు గర్భవిచ్ఛిత్తి సేవలు అందించగలిగే ప్రజారోగ్య కేంద్రాలు- 2020 మార్చి నాటికి దేశం మొత్తమ్మీద సుమారు 11వేలే ఉన్నాయి. ఇక ఇరవై వారాల వరకు వయసు ఉన్న పిండాన్ని తొలగించగలిగే వైద్య సదుపాయాలైతే కేవలం 4,213 కేంద్రాల్లోనే ఏర్పాటయ్యాయి. దేశీయంగా సగటున ఇరవైశాతం అబార్షన్లే సర్కారీ దవాఖానాల్లో చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదకర గర్భవిచ్ఛిత్తి విధానాల కారణంగా ఇండియాలో రోజుకు కనీసం ఎనమండుగురు మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎటువంటి శిక్షణ లేని వ్యక్తులు, నకిలీ వైద్యులు కాసుల కక్కుర్తితో విచ్చలవిడిగా అబార్షన్లు చేస్తున్నారు. గ్రామీణ భారతంలోని ప్రభుత్వాసుపత్రుల్లో డెబ్భై శాతానికిపైగా స్త్రీ, ప్రసూతి వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా పడిఉండటం- ప్రైవేటు వైద్యశాలలు, దొంగ డాక్టర్ల దోపిడికి దారితీస్తోంది. ప్రభుత్వ వైద్యసేవలను పటిష్ఠపరుస్తూ, పితృస్వామ్య భావజాల సంకెళ్లను పూర్తిగా బద్దలుకొట్టేలా సామాజిక చేతనకు పాలకులు ప్రోదిచేయాలి. విద్య, ఉపాధి అవకాశాల కల్పనతో సంపూర్ణ స్త్రీ సాధికారతకు బాటలు పరవాలి. అసమానతల్లేని సమాజాలే అభివృద్ధి పథంలో ముందడుగు వేయగలుగుతాయి. ప్రభుత్వాలు ఆ స్పృహతో బాధ్యతలు నిర్వర్తించినప్పుడే- భారతావనిలో ప్రగతి దీపాలు దేదీప్యంగా వెలుగుతాయి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.