జాతి ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు

ఏ దేశంలోనైనా ఖండంలోనైనా దట్టమైన అరణ్యాలు శీతోష్ణ స్థితిగతుల్ని కాపాడతాయి. పరిసరాల్ని హరితవర్ణ శోభలతో సింగారిస్తాయి. ఉద్ధృత జలప్రవాహాలను క్రమబద్ధీకరిస్తాయి.

Published : 28 Jan 2023 00:20 IST

దేశంలోనైనా ఖండంలోనైనా దట్టమైన అరణ్యాలు శీతోష్ణ స్థితిగతుల్ని కాపాడతాయి. పరిసరాల్ని హరితవర్ణ శోభలతో సింగారిస్తాయి. ఉద్ధృత జలప్రవాహాలను క్రమబద్ధీకరిస్తాయి. అంతటి కీలక ప్రాధాన్యం కలిగిన అడవులను అడ్డగోలుగా నరికేసే పెడ పోకడలు- మానవ మనుగడకే గొడ్డలిపెట్టు. దేశీయంగా 2017-2019 సంవత్సరాల మధ్య 3976 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ఛాయ విస్తరించిందన్న మూడేళ్లనాటి వన సర్వే నివేదికాంశాలు అప్పట్లో ఎందరినో విస్మయపరచాయి. 2021లో అడవుల ఆచ్ఛాదనను పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్‌(647 చ.కి.మీ.), తెలంగాణ(632), ఒడిశా(537) ముందున్నాయని నిరుడీ రోజుల్లో కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చేసిన ప్రకటన- పరిస్థితి ఎంతగానో తేటపడిందన్న భావన కలిగించింది. వాస్తవంలో, సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా వెలుగు చూసిన సమాచారం భిన్న దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. ‘గ్రీన్‌ ఇండియా మిషన్‌’ కింద లక్ష్యాల సాధన మందకొడిగా సాగుతోందని గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. 2015-16 నుంచి 2021-22 వరకు దేశంలో 53,377 హెక్టార్ల మేర అటవీ విస్తీర్ణం పెంపొందాలని కేంద్రం నిర్దేశించగా- నికరంగా సాధ్యపడింది 26,287 హెక్టార్లే(49శాతం) అన్న గణాంక విశ్లేషణ, హరితావరణ మందభాగ్యాన్ని కళ్లకు కడుతోంది. నిర్దేశిత లక్ష్యసాధనలో ఉత్తరాఖండ్‌(4941 హెక్టార్ల దాకా), మధ్యప్రదేశ్‌(3976), కేరళ(1070)లతో పాటు పశ్చిమ్‌ బెంగాల్‌, మహారాష్ట్ర, ఏపీ వంటివీ వెనకబడినట్లు కొత్తగా వెల్లడైంది. అనుకున్న దానికన్నా ఎక్కువగా అటవీ ఛాయ పెంపొందించిన పంజాబ్‌ రికార్డు తక్కిన రాష్ట్రాల్లో చురుకు పుట్టిస్తేనే తప్ప- హరిత భారత యోజన జోరందుకోలేదు.

ప్రస్తుతం దేశంలో మొత్తం అడవులు సుమారు ఎనిమిది కోట్ల హెక్టార్ల మేర విస్తరించి ఉన్నాయి. భారత భౌగోళిక వైశాల్యంలో వాటి వాటా 24.62శాతంగా లెక్క తేలుతోంది. ఏడేళ్ల క్రితం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన 21.34శాతంతో పోలిస్తే కొంత మెరుగుదల కనిపిస్తున్నా- అంతటితో సంతృప్తి చెందే వీల్లేదు. ఏ దేశ భూభాగంలోనైనా కనీసం 33శాతం దాకా అడవులు నెలకొంటేనే పర్యావరణ సమతూకం సాధ్యపడుతుంది. 1952లో, 1988లో రూపొందిన జాతీయ అటవీ విధానాల మౌలిక ధ్యేయమదే. నేటికీ అది నెరవేరని కలగానే మిగిలిపోవడానికి కారణాలేమిటో బహిరంగ రహస్యం. వేలకొద్దీ చదరపు కిలోమీటర్ల అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. మరెన్నో చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అభివృద్ధి పనుల పద్దులోకి మళ్ళింది. పరిశ్రమలు, ఖనిజ తవ్వకాలు, డ్యాములు తదితరాల నిమిత్తం బదలాయించే అడవికి సమాన విస్తీర్ణంలోని భూముల్లో వనాలు పెంచాలని, నరికేసిన వృక్ష సంపదకు తగిన పరిహారం చెల్లించాలన్న చట్ట స్ఫూర్తికి వాస్తవిక కార్యాచరణలో తూట్లు పడుతున్నాయి. కంపా(కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లానింగ్‌ అథారిటీ) కింద ప్రత్యామ్నాయ అటవీ పెంపక పథకానికి ఉద్దేశించిన నిధులు సకాలంలో విడుదల కాక- ఎక్కడికక్కడ పనులు చతికిలపడుతున్నాయి. అటవీ ఛాయ పెంపుదలలో వివిధ రాష్ట్రాల వైఫల్యానికి ఈ అంశమే ప్రధానంగా పుణ్యంకట్టుకుంటోంది. అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇతరత్రా సాధన సంపత్తి సమకూర్చడంలో రాష్ట్రాల అలసత్వం అడవి దొంగలకు అయాచిత వరమవుతోందని రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టే ఘాటుగా వ్యాఖ్యానించినా- ఇప్పటికీ సరైన దిద్దుబాటు చర్యలన్నవి లేవు. వాణిజ్యపరమైన ప్లాంటేషన్లను అరణ్యాలుగా జమకట్టేసే ధోరణులు నివ్వెరపరుస్తున్నాయి. హెక్టారు భూమిలో పది శాతానికి మించి పచ్చదనం నమోదైనా అడవుల పద్దులో చేర్చేయడం అసంబద్ధమన్న ప్రకృతి ప్రేమికుల విమర్శలు, అభ్యంతరాలు అరణ్య రోదనమవుతున్నాయి. బ్రెజిల్‌ (60శాతం), కోస్టారికా (51) వంటివి ఆహ్లాదకర హరితావరణంతో అబ్బురపరుస్తుండగా- జాతీయ అటవీ సంకల్ప దీక్ష సుదృఢం కాకపోవడం ఆవేదన రగిలిస్తోంది. జాతి సంస్కృతిలో వన సంరక్షణ అంతర్భాగమైతేనే- పుడమి తల్లికి కడుపుకోతను బాపగలిగేది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.