చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత!

ఉగ్రవాదుల అభయారణ్యంగా, టెర్రరిస్థాన్‌గా ప్రపంచమంతా ఛీకొట్టినా- తన పిదపబుద్ధులను పాకిస్థాన్‌ ఏనాడూ మార్చుకోలేదు. నరహంతక ముష్కర మూకలను ముద్దుచేయడమూ మానలేదు.

Published : 03 Feb 2023 01:20 IST

గ్రవాదుల అభయారణ్యంగా, టెర్రరిస్థాన్‌గా ప్రపంచమంతా ఛీకొట్టినా- తన పిదపబుద్ధులను పాకిస్థాన్‌ ఏనాడూ మార్చుకోలేదు. నరహంతక ముష్కర మూకలను ముద్దుచేయడమూ మానలేదు. ఇప్పుడవే ఉగ్రతండాలు తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నాయని అదెంత ఏడిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? ఇల్లెక్కి కొరివి తిప్పి తప్పు చేశానంటూ గుండెలు బాదుకున్నంత మాత్రాన ఒనగూడేదేమిటి? ‘ముజాహిదీన్‌లను తయారుచేయాల్సిన అవసరమేమీ మనకు లేదు... కానీ, వాళ్లను సృష్టించాం... ఆ ముజాహిదీన్లే ఉగ్రవాదులుగా పరిణమించా’రంటూ పాకిస్థాన్‌ పార్లమెంటులో ఆ దేశ హోంమంత్రి రానా సనావుల్లా తాజాగా వ్యాఖ్యానించారు. తెహ్రీకే- తాలిబన్‌ పాకిస్థాన్‌(టీటీపీ) ముష్కరుడొకడు నాలుగు రోజుల క్రితం పెషావర్‌లోని ఓ మసీదుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డాడు. వందకు పైగా నిండు ప్రాణాలను ఆ కర్కోటకుడు పొట్టనపెట్టుకున్నాడు. ఆ ఘోరంపై సనావుల్లా స్పందిస్తూ- తమ పాత తప్పులను చట్టసభ సాక్షిగా నెమరువేసుకున్నారు. 2014లో అదే పెషావర్‌లోని ఒక సైనిక పాఠశాలపై టీటీపీ మూకలు కర్కశంగా విరుచుకుపడ్డాయి. 130మందికి పైగా పసిపిల్లలను అవి అప్పట్లో అన్యాయంగా బలితీసుకున్నాయి. అఫ్గాన్‌ తాలిబన్లకు సహకరించేందుకు టీటీపీ రక్కసులకు పాక్‌ అధికారవర్గాలే లోగడ ప్రాణంపోశాయి. వివిధ కారణాలతో పాక్‌పై కత్తిగట్టిన టీటీపీ కొంతకాలంగా కిరాతక దాడులతో చెలరేగిపోతోంది. ధూర్త ఆలోచనలతో అటువంటి పైశాచిక తండాలెన్నింటినో దాయాది దేశమే పెంచి పోషించింది. ఇండియాపై కడుపుమంటతో ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మార్చుకుని దశాబ్దాలుగా అది నెత్తుటి నెగళ్లను ఎగదోస్తోంది. అలా పాక్‌ ప్రాపకంలో రక్తం రుచి మరిగిన ఉగ్ర తోడేళ్లిప్పుడు తమను సాకిన దేశాన్నే పీక్కుతింటున్నాయి!

ఉగ్రవాదుల బీభత్సకాండలతో తామెంతగా చితికిపోతున్నామో ఎవరూ గుర్తించడం లేదని పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ బాధపడిపోయారు. ఒసామా బిన్‌ లాడెన్‌ను సైతం అమరవీరుడిగా నెత్తికెత్తుకున్న వాళ్లను అసహ్యించుకోక, ఎవరైనా సానుభూతి చూపుతారా? లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌, హర్కతుల్‌ జిహాద్‌ ఇస్లామీ వంటి ఉగ్రవాద సంస్థలు ఇండియాయే లక్ష్యంగా ఎడతెగని కుట్రలు పన్నుతున్నాయి. ఆయా తండాలకు అత్తింటి మర్యాదలు చేస్తోంది పాకిస్థానే! దాదాపు నలభై వేల మంది సుశిక్షితులైన ఉగ్రవాదులు తమ దగ్గర ఇంకా ఉన్నారని ఆ దేశ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించలేదా? సైన్యం కనుసన్నల్లో ముష్కర మిన్నాగులకు పాలుపోస్తున్న పాక్‌ను విశ్వశాంతికి ప్రథమ శత్రువుగా మిగిలిన ప్రపంచం భావించడంలో తప్పేముంది? దక్షిణాసియా టెర్రరిజం పోర్టల్‌ వివరాల ప్రకారం- 2000 సంవత్సరం నుంచి 2023 జనవరి నెలాఖరు వరకు పాకిస్థాన్‌లో ముప్ఫైవేలకు పైగా ఉగ్రవాద సంబంధిత ఘటనలు చోటుచేసుకున్నాయి. 66వేల మందికి పైగా విగతజీవులయ్యారు. ఉగ్రవాదంలో మంచీ చెడూ అన్న తేడాలేమీ ఉండవు. కరడుగట్టిన ఛాందసవాదంలోంచి పుట్టుకొచ్చే హింసాత్మక భావజాలమేదైనా అతిప్రమాదకరమైనదే. కానీ, పాక్‌ పాలకుల ఉగ్రవాద వ్యతిరేక పోరాటమంతా తమ మాట మన్నించని ముష్కర మూకలపైనే కేంద్రీకృతమవుతోంది. గతంలో ఇండియాలో నెత్తుటేళ్లు పారించిన పిశాచగణాలెన్నో ఇప్పటికీ పాక్‌లోనే భద్రంగా తలదాచుకొంటున్నాయి. చైనా మద్దతుతో ఉగ్రవాదులను అస్మదీయులూ తస్మదీయులుగా విభజించి పాలించే పెడధోరణులను పాకిస్థాన్‌ విడనాడాలి. మానవత్వంపై నిప్పులు గుమ్మరిస్తున్న ముష్కరులందరినీ నిష్కర్షగా ఏరిపారేయాలి. అది మానేసి పాక్‌ నేతాగణమెంతగా కన్నీళ్లు పెట్టుకున్నా- ఆ దేశం తలరాత మారదు. దక్షిణాసియాలో అది రగలించిన నిత్యాగ్ని గుండాలూ చల్లారవు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.