యువత భవితతో చెలగాటం

పరీక్షలు ఏవైనా సరే, ప్రశ్నపత్రాలు ముందుగానే నిక్షేపంగా బయటికొచ్చేసే అవ్యవస్థ దేశీయంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గడచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అలా చోటుచేసుకున్న 70కిపైగా లీకేజీలతో సుమారు కోటిన్నర మంది విద్యార్థులు, నిరుద్యోగులు బాధితులైనట్లు అంచనా.

Published : 25 Mar 2023 00:13 IST

రీక్షలు ఏవైనా సరే, ప్రశ్నపత్రాలు ముందుగానే నిక్షేపంగా బయటికొచ్చేసే అవ్యవస్థ దేశీయంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గడచిన ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అలా చోటుచేసుకున్న 70కిపైగా లీకేజీలతో సుమారు కోటిన్నర మంది విద్యార్థులు, నిరుద్యోగులు బాధితులైనట్లు అంచనా.

ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక పరీక్షలూ తదితరాలకు సంబంధించి రాజస్థాన్‌లో 2011-2022 మధ్యకాలంలో 26సార్లు ప్రశ్నపత్రాలు అంగడి సరకులయ్యాయి. గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లోనూ పోటీపరీక్షలెన్నో లీకుల నేరగాళ్ల పాలబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియ నుంచి పదో తరగతి, ఇంటర్‌, పాలిటెక్నిక్‌ పరీక్షల్లో చీకటి దందాలపై గత నాలుగేళ్లలో కథనాలెన్నో గుప్పుమన్నాయి. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)లో తిష్ఠవేసిన ఇంటిదొంగల బాగోతాలు కొద్దిరోజులుగా వెలుగుచూస్తూ గగ్గోలు పుట్టిస్తున్నాయి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినవాళ్ల నీతిమాలినతనం- నాలుగున్నర లక్షల మందికి పైగా హాజరైన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈ, ఏఈఈ, డీఏఓ పరీక్షల రద్దుకు కారణమైంది. ఎంతోమంది ప్రతిభావంతుల ఆశలను ఆ ప్రబుద్ధుల స్వార్థమే ఛిద్రంచేసింది. సర్కారీ కొలువులకోసం సర్వశక్తులూ ఒడ్డుతూ, సంవత్సరాల తరబడి తల్లిదండ్రులు, బంధుమిత్రులకు దూరంగా ఉంటూ సన్నద్ధమైన యువత- కొద్దిమంది కాసుల కక్కుర్తికి బలిపశువులు కావాల్సి రావడమే విషాదకరం. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బట్టబయలైన తరవాత రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటుచేసింది. ప్రశ్నపత్రాల చౌర్యం గుట్టుమట్లను వెలికితీయడంలో ‘సిట్‌’ పనితీరును పరిశీలిస్తే- తన బాధ్యతలను అది సమర్థంగా నిర్వర్తిస్తున్నట్లు విదితమవుతోంది. పక్కాగా ఆధారాల సేకరణతో భవిష్యత్తులో మరెవరూ లీకేజీలకు పాల్పడకుండా నేరగాళ్లను కఠినాతికఠినంగా శిక్షించాలి. కలలు కరిగి గుండెలు చెదిరిన నిరుద్యోగులకు అప్పుడే కాస్తయినా సాంత్వన లభిస్తుంది!

‘పరీక్షల అక్రమాలు విద్యారంగ ప్రమాణాలతోపాటు దేశాభివృద్ధినీ దెబ్బతీస్తాయి... యావత్‌ జాతికీ హానికారకమైనవి అవి’ అని న్యాయపాలిక గతంలో హెచ్చరించింది. సమకాలీన సాంకేతిక యుగంలో ఆ ముప్పు ఇంకా అధికమైంది. వివిధ వ్యవస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగమెంత అవసరమో- అప్రమత్తతతో మెలగకపోతే దాంతో ముంచుకొచ్చే ప్రమాదాలూ అంతే భారీగా ఉంటాయన్నది వాస్తవం. బలహీనమైన టీఎస్‌పీఎస్సీ ఐటీ వ్యవస్థ, ఇతర సంస్థాగత లోపాల దన్నుతోనే అక్రమార్కులు చెలరేగిపోయారు. రక్షణ రంగ ఉద్యోగులు, క్రెడిట్‌ కార్డులూ పాన్‌కార్డుల వినియోగదారులతోపాటు మొత్తం పదిహేడు కోట్ల మంది సున్నిత సమాచారాన్ని అమ్మకానికి పెట్టిన ముఠాను సైబరాబాద్‌ పోలీసులు తాజాగా పట్టుకున్నారు. లక్షల సంఖ్యలో ఎయిరిండియా వినియోగదారులు, రైలు ప్రయాణికుల వివరాలూ కొద్దినెలల క్రితం ఇలాగే బహిర్గతమయ్యాయి. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు వందకు పైగా దేశాలు ప్రత్యేక చట్టాలను రూపొందించుకొన్నాయి. ఆ మేరకు ఇండియాలో పదునైన శాసనమే కొరవడింది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల భవితతో చెలగాటమాడేవారికి చెక్‌పెట్టగలిగేలా కొత్త చట్టాలను రూపొందించుకోవడమూ అత్యావశ్యకం. ప్రశ్నపత్రాలను లీక్‌ చేసే దందాసురులకు పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానాల విధింపుతోపాటు వాళ్ల ఆస్తులను జప్తు చేసేలా కొత్త శాసన నిర్మాణానికి టీఎస్‌పీఎస్సీ ప్రతిపాదిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా అటువంటి చట్టాలను అమలులోకి తీసుకురావడంతోపాటు నగుబాటుకు గురవుతున్న పరీక్షల ప్రక్రియను లోపరహితం చేయడంపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత, పరీక్షల నిర్వహణకు సంబంధించి వ్యవస్థను పటిష్ఠపరచడంపై మేధావులు, భాగస్వామపక్షాలతో విస్తృతంగా సంప్రతింపులు జరపాలి. ఆ మేరకు విస్పష్ట విధివిధానాలు సాకారమైతేనే- దేశానికి లాభదాయకంగా ప్రతిభకు పట్టం కట్టడం సాధ్యపడుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.