చిరుధాన్యాలతో ఆరోగ్య సిరులు

సీఎస్‌ఈ (వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం) అధికారిక ధ్రువీకరణ ప్రకారం- ఎకాయెకి 71శాతం పౌరులకు సమతుల ఆహారం దక్కని దేశం మనది. మన ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమల్లో- ఎముకలు, నరాల పటుత్వానికి, వ్యాధి నిరోధకతకు ప్రాణాధారమైన కాల్షియం, ఇనుము, జింక్‌ వంటివి తెగ్గోసుకుపోతున్నాయి.

Published : 27 Mar 2024 00:46 IST

సీఎస్‌ఈ (వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం) అధికారిక ధ్రువీకరణ ప్రకారం- ఎకాయెకి 71శాతం పౌరులకు సమతుల ఆహారం దక్కని దేశం మనది. మన ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమల్లో- ఎముకలు, నరాల పటుత్వానికి, వ్యాధి నిరోధకతకు ప్రాణాధారమైన కాల్షియం, ఇనుము, జింక్‌ వంటివి తెగ్గోసుకుపోతున్నాయి. మరోవైపు- వాటిలో ఆర్సెనిక్‌, క్రోమియం, బేరియం వంటి విషతుల్య మూలకాల ఉనికి తీవ్రంగా ఆందోళనపరుస్తోంది. ఈ నేపథ్యంలో అందరికీ అవసరమైన పోషకాల నిమిత్తం చిరుధాన్యాల (మిల్లెట్స్‌) వినియోగం ఎంతో మేలన్న సూచనలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తనవంతుగా ప్రధాని మోదీ- సిరిధాన్యాల వినియోగం ప్రజా ఉద్యమంగా మారాలని ఆమధ్య పిలుపిచ్చారు. సెస్‌(ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ) తాజా అధ్యయనం, దేశంలో చిరుధాన్యాల సాగు విస్తృతమయ్యేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలంటోంది. మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలనీ సిఫార్సు చేస్తోంది. వరి, పత్తి వంటి ప్రధాన పంటలకే పరిమితమవుతున్న రైతులు చిరుధాన్యాల సాగు వైపు మళ్ళడం ఏ విధంగా ఉపయుక్తమో సెస్‌ అధ్యయన నివేదిక చాటుతోంది. మిల్లెట్స్‌ సాగుకు వ్యయంతోపాటు కూలీల అవసరం తక్కువ. ప్రధానంగా సేంద్రియ ఎరువుల వాడకం, స్వల్పంగా నీటి వినియోగం, భూసార పరిరక్షణ- ఇవన్నీ అన్నదాతకు కలిసివచ్చే అంశాలు. వాస్తవంలో సజ్జలు, రాగులకే తప్ప చిరుధాన్యాలుగా వ్యవహరించే కొర్రలు, ఊదలు, వరిగెలు, అరికెలు, సామలు తదితరాలు వేటికీ ప్రభుత్వ పంటల మద్దతు ధరల విధానం వర్తించడంలేదు. కొర్రల  వంటివి సాగు చేస్తే ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడిపై ఖర్చులన్నీ పోను మిగిలేది సుమారు రూ.10వేలే. అదే మరికొంత పెట్టుబడిని భరించి చెరకు లేదా పత్తి పండిస్తే రూ.20వేల నుంచి రూ.30 వేలదాకా రాబడి కళ్లజూడవచ్చన్న ఆశ రైతాంగాన్ని వాణిజ్య పంటలవైపు పురిగొలుపుతోంది. తగినన్ని ప్రోత్సాహకాలు, విపణి వసతులు కల్పించడం ద్వారా చిరుధాన్యాలూ సిరులు కురిపిస్తాయన్న నమ్మకం ఏర్పరిస్తేనే రైతుల పంట ప్రాధాన్యాలు మారతాయి. మిల్లెట్లతో కొత్తరకం వంటకాలు తయారు చేస్తున్న అంకుర పరిశ్రమలకు, సాగుదారులకు మధ్య అనుసంధానం ఏర్పరిస్తే- చిరుధాన్యాల సాగు గణనీయంగా జోరందుకుంటుంది!

ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాలెన్నో చిరకాలంగా చిరుధాన్యాలను పండిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాటి పంట విస్తీర్ణం సుమారు 18.30కోట్ల ఎకరాల్లో ఆఫ్రికా వాటాయే దాదాపు 12కోట్ల ఎకరాలు. దేశీయంగా హరిత విప్లవ సమయంలో దృష్టి అంతా వరి, గోధుమలపైనే కేంద్రీకృతమై చిరుధాన్యాల సాగు బాగా తగ్గిపోయింది. నాడు పేదవారి ఆహారంగా నిరాదరణకు గురైన సిరిధాన్యాలే కొవిడ్‌ సంక్షోభవేళ భిన్న వర్గాల ప్రజానీకానికి చేరువయ్యాయి. భారత్‌ చొరవతో 2023కు సిరిధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన దరిమిలా- ఆ ఒక్క ఏడాదే వాటి విక్రయాల్లో 30శాతం మేర వృద్ధి నమోదైంది. జనాదరణకు తగ్గట్లు చిరుధాన్యాల సాగును ఇతోధికం చేసేలా విస్తృత కార్యాచరణ తక్షణావసరం. మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, పీచు పదార్థాలు సిరిధాన్యాల్లో పుష్కలం. 30శాతానికి పైగా పిల్లలు గిడసబారిపోతున్న ఇండియాలో మిల్లెట్ల సమధిక వాడకం స్వస్థ బాల్యానికి గొప్ప ఆసరా కాగలుగుతుంది. జాతికి పోషక భద్రత కల్పించగల సిరిధాన్యాల దిగుబడుల్ని పెంపొందించేదెలా? రైతులకు అధిక దిగుబడినిచ్చే వంగడాల్ని సమకూర్చి, గిట్టుబాటు ధర అందించి, దేశం నలుమూలలా ప్రాసెసింగ్‌ కేంద్రాలు నెలకొల్పాలి. ఉప ఉత్పత్తుల తయారీపై పొదుపు సంఘాలకు శిక్షణ ఇస్తే- గ్రామీణార్థికానికి కొత్త ఊపొస్తుంది. పాశ్చాత్య దేశాల్లోనూ చిరుధాన్యాలతో ఆహార పదార్థాలకు మార్కెట్‌ విస్తరిస్తున్న దృష్ట్యా, ఎగుమతి అవకాశాల్నీ ఒడుపుగా అందిపుచ్చుకోవాలి. ఆరోగ్య సిరులకప్పుడు దేశం చిరునామా అవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.