వేసవిలో ఫోన్‌ ఛార్జింగ్‌ వేగం తగ్గుతుంది..? ఎందుకు?

వేసవిలో స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది?

Published : 28 Apr 2024 12:40 IST

smartphone charging | ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవిలో సూర్యుడి ప్రతాపం మూలంగా మనుషులే కాదు.. మనం నిత్యం వాడే స్మార్ట్‌ ఫోన్‌ మీద కూడా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్‌ ఫోన్లు వేగంగా వేడెక్కుతుంటాయి. బ్రౌజింగ్‌ చేసినా, గేమ్స్‌ ఆడినా బ్యాక్‌ ప్యానెల్‌ మొత్తం హీటెక్కిపోతుంది. అంతేకాదు.. వేసవిలో స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ వేగంలో తేడానూ గుర్తించొచ్చు. మునుపటితో పోలిస్తే ఛార్జింగ్‌ స్పీడ్‌ తగ్గడం గమనించొచ్చు. ఇంతకీ వేసవికి, ఛార్జింగ్‌ వేగం తగ్గడానికి ఏమైనా సంబంధం ఉంటుందా?

స్మార్ట్‌ఫోన్లు రోజురోజుకూ పవర్‌ఫుల్‌గా మారుతున్నాయి. వాటి వేగం, పనితీరులో ఏయేటికాయేడు చాలావరకు మార్పులు వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వేగం పెరిగింది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ పెరిగింది. ఒకప్పుడు సన్‌లైట్‌లోకి తీసుకెళితే స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే కనిపించేది కాదు. ఇప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ ఆ స్థాయిలో మెరుగైంది. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌ హీట్‌ను పెంచేవే. దీనికితోడు బీజీఎంఐ వంటి హై ఎండ్‌ గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫోన్‌ హీట్‌ పెరుగుతుంది. సాధారణ రోజుల కంటే వేసవిలో వేడిమి కారణంగా స్మార్ట్‌ఫోన్లు మరింత వేగంగా హీటెక్కుతాయి.

ఛార్జింగ్‌ స్పీడ్‌ డౌన్‌..

స్మార్ట్ ఫోన్‌ పెర్ఫార్మెన్స్‌తో పాటు బ్యాటరీ ఛార్జింగ్‌ స్పీడ్‌ చాలావరకు పెరిగింది. నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్‌ఛార్జింగ్‌ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే, వేడిమి కారణంగా ఫోన్‌ డ్యామేజీ కాకుండా ఉండేందుకు వీటిలో డిఫెన్స్‌ మెకానిజం కూడా ఉంటుంది. అంటే ఫోన్‌ వేడిగా ఉన్నప్పుడు ఇందులోని సెన్సార్లు గుర్తిస్తాయి. అవి ఫోన్‌ ఛార్జింగ్‌ వేగాన్ని తగ్గిస్తాయి. ఒక్కోసారి మళ్లీ స్మార్ట్‌ఫోన్‌ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకునేవరకు పూర్తిగా ఛార్జింగ్‌ కూడా అవవు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ వేడెక్కితే చల్లబర్చడానికి వెనక ఉన్న కేస్‌ తొలగించడం మంచిది. ఒకవేళ వైర్‌లెస్‌ ఛార్జర్‌ వాడుతున్నట్లయితే వైర్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ ఎంచుకోవడం బెటర్‌. ముఖ్యంగా ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు గేమ్స్‌కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని