పాఠాలు... బలిపీఠాలు!

ఎలాగైనా సరే ర్యాంకులు కొల్లగొట్టాలన్న పోటీ వాతావరణం పెచ్చరిల్లుతున్న దేశంలో, నవతరం ఒత్తిడి కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. తల్లిదండ్రులు, గురువులు, శిక్షణ సంస్థల ఆశల భారాన్ని తట్టుకోలేక ఎన్నో విద్యాకుసుమాలు అర్ధాంతరంగా నేలరాలుతున్నాయి.

Published : 26 Apr 2024 00:10 IST

లాగైనా సరే ర్యాంకులు కొల్లగొట్టాలన్న పోటీ వాతావరణం పెచ్చరిల్లుతున్న దేశంలో, నవతరం ఒత్తిడి కోరల్లో చిక్కి విలవిల్లాడుతోంది. తల్లిదండ్రులు, గురువులు, శిక్షణ సంస్థల ఆశల భారాన్ని తట్టుకోలేక ఎన్నో విద్యాకుసుమాలు అర్ధాంతరంగా నేలరాలుతున్నాయి. ఉన్మాద రేసులో నెగ్గుకురాలేమేమోనన్న భయం, అందులోంచి తరుముకొచ్చే కుంగుబాటు వంటివి విద్యార్థుల ప్రాణాల్ని తోడేస్తున్నాయి. సంవత్సరం చివర్లో  వార్షిక పరీక్షలు నిర్వహించేటప్పుడు విద్యార్థులపై అలవిమాలిన ఒత్తిడి నెలకొంటోందని, అది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమేకాదు... ఆలోచనా విధానాన్నీ గాడి తప్పిస్తున్నట్లు ఏనాడో 1948-49నాటి యూనివర్సిటీ విద్యాసంఘం నివేదిక స్పష్టీకరించింది. ఆ దస్త్రాన్ని మునుపటి ప్రభుత్వాలు అటకెక్కించాయి. ఆపై దశాబ్దాల తరబడి పరీక్షల ఒత్తిడి, మానసిక ఆందోళన వేలాది భావిపౌరుల్ని పొట్టన పెట్టుకున్నాయి. 2019 నుంచి మూడేళ్లకాలంలోనే 35వేలమందికి పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డట్లు కేంద్రమే ప్రకటించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా 2025-26 విద్యాసంవత్సరం నుంచి పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏటా రెండుసార్లు నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మొన్న ఫిబ్రవరిలో ప్రకటించారు. అటువంటి పరిమిత, గురికి బారెడు దూరం చర్యలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు కుదుటపడవు. ఆ యథార్థాన్నే నిర్ధారిస్తున్నట్లు- తెలుగు గడ్డపై ఈసారీ విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతాలు వెలుగుచూశాయి. ఊపిరి సలపనివ్వని రీతిలో తరగతుల నిర్వహణ, ఆటపాటలకు ఏ కోశానా తావివ్వని పాఠ్య ప్రణాళికలతో అసంఖ్యాక విద్యార్థులు కుంగిపోతున్నారు. పరీక్ష రాయకపోతే నెత్తిన పిడుగు పడుతుందన్నట్లు కాకుండా- విద్యార్థులు ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో పోటీపడేలా చదువుల విధివిధానాలను ప్రక్షాళించాలి.

విద్యార్థుల ఆత్మహత్యల ప్రాతిపదికన మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగాల్‌, కర్ణాటక ముందున్నాయి. వివిధ శిక్షణ సంస్థల కేంద్రంగా పేరొందిన కోటా(రాజస్థాన్‌)లో ఏటా పదుల సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు కడతేరిపోతున్న వైపరీత్యాన్ని అక్కడి ఉన్నత న్యాయస్థానమే సూటిగా ప్రశ్నించింది. జీవితమంటే కేవలం పరీక్షలేనా? కాదు! రేయింబవళ్లు బట్టీపట్టి సాధించే ర్యాంకులే ప్రతిభా చిహ్నాలా? కానే కాదు! ఫిన్లాండ్‌లో ప్రామాణీకరించిన పరీక్షలంటూ ఏమీ ఉండవు. ఉన్నత మాధ్యమిక పాఠశాల విద్యానంతరం పిల్లలందరూ స్వచ్ఛందంగా ఒక పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అక్కడి విద్యార్థులందరికీ వారివారి వ్యక్తిగత శ్రద్ధాసక్తుల్ని బట్టి ఉపాధ్యాయులే గ్రేడింగ్‌ ఇస్తారు. ఏడాది పొడుగునా పిల్లల ప్రగతిని విద్యామంత్రిత్వ శాఖ మదింపు వేస్తుంది. ఒత్తిడి లేని చదువులకది శ్రేష్ఠమైన ఉదాహరణ! మున్ముందు జీవితంలో ఒత్తిళ్లను నిభాయించేలా తమ విద్యార్థుల్ని స్వీడన్‌, ఐర్లాండ్‌, ఆస్ట్రియా, జర్మనీ వంటివి తీర్చిదిద్దుతున్నాయి. భావోద్వేగాల నియంత్రణను అలవరచడం ద్వారా మొగ్గ దశలోనే ఆత్మహత్యా ధోరణుల్ని తుంచేయగలమని ఎస్తోనియా, ఇజ్రాయెల్‌ ప్రభృత దేశాలు సోదాహరణంగా నిరూపిస్తున్నాయి. ఆయా అనుభవాల నుంచి ఇండియా ఎన్నో విలువైన గుణపాఠాలు నేర్వగల వీలుంది. కాలదోషం పట్టిన పరీక్షలకు మంగళం పలకాలి. సాధనలో ఒడుపుల్ని, వ్యక్తీకరణలో మెలకువల్ని ఎంతవరకు ఒంటపట్టించుకున్నారన్నదాన్ని బట్టి పిల్లల నైపుణ్యాలను బేరీజు వేసే పద్ధతిని పట్టాలకు ఎక్కించాలి. కుంగుబాటుకు గురిచేసి రేపటి తరాన్ని బలిపెట్టుకోవడం కాదు- వారికి ఆత్మవిశ్వాసమనే ఆయుధాన్ని అందించేలా దేశీయంగా చదువులకు పదునుపెట్టాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.