చచ్చుపుచ్చు యంత్రాంగానిదే ఈ నేరం!

నాసిరకం విత్తనాల వెల్లువ పంట పొలాల్లో ఆనవాయితీగా సృష్టిస్తున్న అల్లకల్లోలం ఇంతా అంతా కాదు. దుక్కి దున్ని నారు పోసి పైరు కోసి కళ్లాల్లో దిగుబడిని కళ్లజూసేదాకా అవిశ్రాంతంగా శ్రమించే రైతులకు- విత్తు దశలోనే పెను విపత్తు దాపురిస్తోంది.

Published : 30 Apr 2024 00:16 IST

నాసిరకం విత్తనాల వెల్లువ పంట పొలాల్లో ఆనవాయితీగా సృష్టిస్తున్న అల్లకల్లోలం ఇంతా అంతా కాదు. దుక్కి దున్ని నారు పోసి పైరు కోసి కళ్లాల్లో దిగుబడిని కళ్లజూసేదాకా అవిశ్రాంతంగా శ్రమించే రైతులకు- విత్తు దశలోనే పెను విపత్తు దాపురిస్తోంది. పంటల సాగుకు అన్నదాతలు నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలని, నాసిరకాలు కొని మోసపోరాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు, తెలంగాణ విశ్వవిద్యాలయ అధికారులు తెలుగు రైతాంగానికి ఇటీవల పిలుపిచ్చారు. రైతులు కావాలని నకిలీ విత్తులు కొంటారా? ఏటా పంటకాలంలో దగాకోరు వ్యాపారులు జూలు విదిలిస్తున్నారు. మొన్న రబీ సీజన్‌లో వందకు పైగా కేసులు తెలంగాణలో నమోదయ్యాయి. ఈసారి ఖరీఫ్‌ పనులింకా ఊపందుకొనకముందే 12మంది కల్తీ విత్తన విక్రేతలపై క్రిమినల్‌ కేసులు పెట్టినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని, చిత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ రైతులు ఆందోళనలకు దిగారు. పులివెందుల, అనంతపురంలోని దుకాణాల్లో కొనుగోలు చేసిన నకిలీ విత్తనాలు తమ కొంప ముంచాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏపీలో కొంతమంది ప్రజాప్రతినిధులే నకిలీ విత్తన వ్యాపారంలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలోని గూడూరు, అక్కన్నపేట, హుస్నాబాద్‌, రామడుగు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ వంటిచోట్లా నాసిరకం విత్తనాలు విక్రయించిన ఉదంతాలు వెలుగు చూశాయి. గుంటూరు, ప్రకాశం, వరంగల్‌ ప్రభృత ప్రాంతాల్లో కల్తీ విత్తన వ్యాపారం కొన్నేళ్లుగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. సరిహద్దు జిల్లాల ద్వారా ఏపీ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి నకిలీ విత్తనాలు పెద్దయెత్తున తెలంగాణకు తరలుతున్నట్లు క్షేత్రస్థాయి కథనాలు విశదీకరిస్తున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాల విజృంభణతో నకిలీ విత్తన కలుపు ఏపుగా ఎదిగి దేశంలో వార్షిక విషాదం పునరావృతమవుతోంది!

పైరు ఏపుగా ఎదగాలన్నా, గింజ నాణ్యంగా ఉండాలన్నా, తగినంతగా పంట దిగుబడి రావాలన్నా- మేలిమి విత్తనాలే ప్రాణాధారం. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరవాతా వ్యవసాయ ప్రధాన భారతావనిలో విత్తన గండాలు రైతుల పుట్టి ముంచుతుండటం జాతి దౌర్భాగ్యం. మూడేళ్ల క్రితం తెలంగాణ వ్యవసాయ, పోలీస్‌ విభాగాల సంయుక్త కార్యదళాలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కొన్ని సంస్థలకు అసలు లైసెన్సులే లేవని, కొన్నింటికి విత్తన శుద్ధి ప్లాంట్లూ కరవేనని అప్పట్లో వెల్లడైంది. తరతమ భేదాలతో మిగతా చోట్లా ఎన్నో కంపెనీలు తాడూ బొంగరం లేకుండా అలాగే నెట్టుకొస్తున్నా, ఇప్పటికీ సరైన దిద్దుబాటు చర్యలు కొరవడటం ముష్కర ముఠాలకు కోరలు తొడుగుతోంది. లైసెన్సులు రద్దయితే మరో చోట ఇంకో పేరుతో కొత్తగా మళ్ళీ దోపిడికి పాల్పడుతూ వ్యవస్థకే సవాలు విసరుతున్నవాళ్లది సాధారణ నేరం కాదు. వాళ్లు సామాజిక ద్రోహులు! చచ్చుపుచ్చు విత్తనాల్ని మేలిమి సరకుగా భ్రమించి పంటను, పెట్టుబడిని సైతం కోల్పోయిన రైతులు- అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అదును తప్పకుండా విత్తుకోవాలన్న ఆరాటాన్ని నకిలీ విత్తన ముఠాలు ఎడాపెడా సొమ్ము చేసుకుంటున్నాయి. పెరూ, చిలీ, బెల్జియం వంటి చిన్న దేశాలు విత్తన ఎగుమతులతో విశేష లాభాలు పొందుతుండగా- దేశంలో వ్యవస్థాగత వైఫల్యాలు రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. విత్తనోత్పత్తిలో నిజామాబాద్‌ ప్రాంత రైతుల అద్భుత చొరవ విదేశాల్లోనూ గిరాకీ పెంచుతోంది. ఆ తరహా క్రియాశీల యత్నాలకు ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారం లభిస్తే- విత్తన గండాల్ని అధిగమించడానికి కొత్త దారులు ఏర్పడతాయి. నకిలీ విత్తన ముఠాల్ని, వాటికి లోపాయికారీగా సహకరించే అధికారుల్ని కఠినాతి కఠినంగా దండిస్తే... సామాజిక ద్రోహుల్లోనూ బెదురు పుడుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు