ప్రపంచానికే ప్రచ్ఛన్న శత్రువులు

సైబరాసురుల విజృంభణకు అద్దంపడుతూ కొన్నాళ్లుగా ఇంటాబయటా ర్యాన్సమ్‌వేర్‌ దాడులు పెచ్చరిల్లుతున్నాయి. హ్యాకర్లు ఏదైనా సంస్థ లేదా వ్యవస్థకు చెందిన కంప్యూటర్లలోకి చొరబడి కార్యకలాపాలను స్తంభింపజేసి పెద్దమొత్తంలో సొమ్ము దండుకుంటున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి.

Updated : 07 May 2024 00:34 IST

సైబరాసురుల విజృంభణకు అద్దంపడుతూ కొన్నాళ్లుగా ఇంటాబయటా ర్యాన్సమ్‌వేర్‌ దాడులు పెచ్చరిల్లుతున్నాయి. హ్యాకర్లు ఏదైనా సంస్థ లేదా వ్యవస్థకు చెందిన కంప్యూటర్లలోకి చొరబడి కార్యకలాపాలను స్తంభింపజేసి పెద్దమొత్తంలో సొమ్ము దండుకుంటున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. జర్మనీలోని ప్రభుత్వ టెలికాం వ్యవస్థ, క్యాలిఫోర్నియాలోని సాఫ్ట్‌వేర్‌ సంస్థ, ఫిన్లాండుకు చెందిన విద్యాసంస్థ... తదితరాలెన్నో బాధిత జాబితాలోకి చేరాయి. దేశంలో తమిళనాడు పోలీస్‌ పోర్టల్‌ తాజాగా ఆ వరసలో నిలిచింది. ముఖ కవళికల్ని బట్టి నేరగాళ్లను, కనిపించకుండా పోయిన వ్యక్తులను గుర్తించే పోర్టల్‌ను ఛేదించిన చోరముఠా చేతికి 60లక్షల మందికిపైగా వ్యక్తుల వివరాలు చిక్కాయి. వాటిని ఆ దుండగులు డార్క్‌వెబ్‌లో అంగడి సరకులుగా మార్చేశారు. లోగడ ఇదే పద్ధతిలో 81కోట్లమందికి పైగా భారతీయుల ఆధార్‌, పాస్‌పోర్టుల సమాచారం, ఫోన్‌ నంబర్లు, చిరునామాల్ని అంతర్జాతీయ చోరులు విక్రయానికి పెట్టినట్లు అమెరికా సైబర్‌ భద్రతా సంస్థ ‘రీసెక్యూరిటీ’ వెల్లడించింది. ఎయిరిండియా, రైల్వేస్‌ ప్రభృత సంస్థల వినియోగదారుల వివరాలూ ఇలాగే ముష్కరమూకల పాలబడ్డాయి. దిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ర్యాన్సమ్‌వేర్‌ దాడితో ఉక్కిరిబిక్కిరి చేసిన సైబర్‌ దండు నాలుగు కోట్లమంది రోగుల సమాచారాన్ని చెరపట్టి రూ.200కోట్ల వరకు డిమాండు చేసింది. తవ్వేకొద్దీ బయటపడే కంకాళాల్లాంటి ఇటువంటి ఉదంతాలు దేశీయంగా సైబర్‌ భద్రత ఎంతగానో కునారిల్లుతోందనడానికి దాఖలాలు. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా పేరొందిన ఇండియాలో సెర్ట్‌-ఇన్‌(కంప్యూటర్‌ అత్యవసర స్పందన దళం), ఐ4సీ(భారతీయ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం) వంటివి కొలువుతీరినా నేరగాళ్ల బరితెగింపునకు పగ్గాలు పడటంలేదు. దేశీయంగా సైబర్‌ భద్రత ఉల్లంఘనలపై విదేశీ సంస్థలు చెబితేనే తప్ప వెంటనే తెలుసుకోలేని దుస్థితి- వ్యవస్థాగతంగా మందకొడితనాన్ని కళ్లకు కడుతోంది.

ఒక్క 2023 సంవత్సరంలోనే 15.56లక్షలకుపైగా సైబర్‌ కేసులు దేశంలో నమోదయ్యాయి. తద్వారా రూ.10వేలకోట్లకు పైబడి నష్టం వాటిల్లినట్లు ఐ4సీ లెక్కకట్టింది. అందులో 50శాతం వరకు దాడులు కంబోడియా, వియత్నాం, చైనా వంటి దేశాలనుంచే జరిగాయి. చైనాకు చెందిన ‘రెడ్‌ ఎకో’ హ్యాకింగ్‌ బృందం భారత విద్యుత్‌ రంగంతోపాటు ఒక ఓడరేవు నెట్‌వర్క్‌లోకీ చొరవడిన వైనం మూడేళ్లక్రితం బట్టబయలైంది. తమ ఓటర్ల సమాచారాన్ని తస్కరించడానికి చైనా ప్రాపులోని సైబర్‌ సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయని బ్రిటన్‌ ఇటీవలే బీజింగ్‌ను బోనులో నిలబెట్టింది. సందు దొరికితే భారత్‌ను దెబ్బతీయడానికి వెనకాడని చైనాతోపాటు ఉత్తరకొరియా నుంచీ సైబర్‌దాడుల ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిషింగ్‌, ర్యాన్సమ్‌వేర్‌ తదితరాల రూపేణా సైబర్‌ నేరగాళ్ల దాడుల్ని దీటుగా ఎదుర్కోవడం ఎలాగన్నదానిపై బాధిత సంస్థలు, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు చురుగ్గా దృష్టిసారించాలి. ఆస్ట్రేలియా, జింబాబ్వే వంటి దేశాల్లో సైబర్‌ భద్రత నిమిత్తం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేశారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, బ్రెజిల్‌ లాంటివి సైబర్‌ నేరాల కట్టడికి అనుసరించదగ్గ వ్యూహాలకు ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటున్నాయి. రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విద్యాసంస్థలు కలిసి సైబర్‌ రక్షణే ధ్యేయంగా కృషి సాగిస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రమైన వ్యక్తి గౌరవంలో వ్యక్తిగత గోప్యత అంతర్భాగమన్న సర్వోన్నత న్యాయస్థానం, దాన్ని ప్రాథమిక హక్కుగా ఆరున్నరేళ్లనాడే నిర్ధారించింది. వాస్తవంలో ఆ స్ఫూర్తి కొల్లబోతోంది. దేశ రక్షణరంగానికిచ్చే ప్రాధాన్యంతో దీర్ఘకాలిక వ్యూహం కట్టుదిట్టంగా పట్టాలకు ఎక్కితేనే సైబర్‌ ఉత్పాతాల్ని దేశం దీటుగా ఎదుర్కోగలుగుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.