ఏపీ భవితకు కాలయముడు జగన్‌

గొర్రెతోలు కప్పుకొన్న తోడేలు, మేకవన్నె పులి వంటి మాటలకు అతికినట్లు సరిపోయే నయవంచక వ్యక్తిత్వం జగన్‌మోహన్‌ రెడ్డిది. ‘రాజధాని కచ్చితంగా రాష్ట్రం నడిమధ్యన ఉండేలా చూడండి... కనీసం 30వేల ఎకరాల ఖాళీస్థలం ఉండే చోట రాజధానిని నిర్మించాలి’ అని ప్రతిపక్షనేతగా జగన్‌ బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన ఆశించినట్లే- రాష్ట్రం మధ్యలోని అమరావతి రాజధానిగా ఎంపికైంది.

Published : 10 May 2024 00:18 IST

గొర్రెతోలు కప్పుకొన్న తోడేలు, మేకవన్నె పులి వంటి మాటలకు అతికినట్లు సరిపోయే నయవంచక వ్యక్తిత్వం జగన్‌మోహన్‌ రెడ్డిది. ‘రాజధాని కచ్చితంగా రాష్ట్రం నడిమధ్యన ఉండేలా చూడండి... కనీసం 30వేల ఎకరాల ఖాళీస్థలం ఉండే చోట రాజధానిని నిర్మించాలి’ అని ప్రతిపక్షనేతగా జగన్‌ బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన ఆశించినట్లే- రాష్ట్రం మధ్యలోని అమరావతి రాజధానిగా ఎంపికైంది. నవనగర నిర్మాణంకోసం 29వేల మందికి పైగా రైతులను ఒప్పించి 34వేల ఎకరాల భూములను తెదేపా ప్రభుత్వం సమీకరించింది. కోటి చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో పలు నిర్మాణాలు ఆరంభించి- వాటిలో యాభైశాతానికి పైగా పూర్తిచేసింది. అమరావతికి వ్యతిరేకిని కానని నమ్మబలికి అధికారంలో వచ్చిన జగన్‌- ఆపై అయిదేళ్లలో రాజధానిపై టన్నులకొద్దీ విషాన్ని విరజిమ్మారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో తెదేపా ప్రభుత్వం చేసిన పనులన్నింటినీ పాడుపెట్టించిన జగన్‌- అమరావతి ఆయువు తీశారు. ‘రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక మోడల్‌ సిటీగా కొత్త రాజధానిని నిర్మించా’లని 2014లో సెలవిచ్చిన జగన్‌- సీఎం అయ్యాక అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేవని దొంగ ఏడుపులు ఏడ్చారు. ఆయనే ఆర్థిక ఉగ్రవాదిగా తయారై రాష్ట్ర రుణభారాన్ని సుమారు రూ.11 లక్షల కోట్లకు చేర్చారు. ఆర్థికంగా స్వయంసమృద్ధమైన అమరావతి నిర్మాణం పూర్తయితే- ఉద్యోగ, ఉపాధి అవకాశాల స్వర్గధామంగా భాసిల్లేది. 1961 ఎకరాల్లోని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు ఒక్కటే దాదాపు 2.5 లక్షల మందికి అన్నం పెట్టేది. సర్కారీ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, భారీ నివాస సముదాయాలు, విద్యాలయాలతో అయిదు కోట్ల ఆంధ్రుల భవితకు అమరావతి ఆలంబన అయ్యేది. అలాంటి దాన్ని ఆదిలోనే దుంపనాశనం చేసి, స్వర్ణాంధ్రకు సమాధికట్టిన పైశాచికత్వం జగన్‌ది!

రాష్ట్ర విభజన అనంతరం దండిగా ఆదాయం తెచ్చిపెట్టే మహానగరమేదీ  ఏపీకి లేకుండా పోయింది. ఆ కొరతను తీర్చేలా భవ్యమైన రాజధాని నగరిని నిర్మించేందుకు చంద్రబాబు సర్కారు సంకల్ప దీక్ష వహించింది. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నిర్మాణానికి బృహత్‌ ప్రణాళికను సింగపూర్‌ సంస్థలతో సిద్ధం చేయించింది. ప్రజాభిప్రాయాలను బట్టి మాస్టర్‌ప్లాన్‌లో మార్పుచేర్పులు చేసి, సీఆర్డీఏ చట్టం ద్వారా అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణంలో రైతులను భాగస్వాములుగా గుర్తించింది. రెండు నెలల్లోనే భూసమీకరణను పూర్తిచేసిన తెదేపా ప్రభుత్వం- రాజధాని పనులనూ పరుగులు తీయించింది. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఆరు భవిష్య నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన అమరావతి నిర్మాణంలో పాలుపంచుకునేందుకు పలు దేశాలు ఆసక్తి చూపాయి. ప్రపంచ బ్యాంకు వంటివీ ఏపీ రాజధానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు ముందుకొచ్చాయి. ఇటువంటి తరుణంలో పదవిలోకి వచ్చిన జగన్‌- చంద్రబాబుపై అక్కసుతో అమరావతికి కాలయముడయ్యారు. రాజధాని రైతుల్లో 97శాతం చిన్న, సన్నకారు సాగుదారులే. వారిలో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే. పెత్తందారులంటూ వారిని అమానుషంగా వేధించిన క్రూరుడు జగన్‌. రైతులతో కుదుర్చుకున్న చట్టబద్ధమైన ఒప్పందం మేరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేయాలన్న హైకోర్టు తీర్పును కాలదన్నిన దురహంకారి జగన్‌. ‘రాజధానిలో మనం సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి ముఖ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి’ అంటూ 2014లో జగన్‌ గొంతు చించుకున్నారు. అదే మనిషి ముఖ్యమంత్రి కాగానే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టులను వేర్వేరు చోట్ల పెడతామంటూ మూడు రాజధానుల పాటందుకున్నారు. ప్రాంతీయ విద్వేష జ్వాలలను రగిల్చి ఓట్ల చలి కాచుకోవాలనుకున్న జగన్‌ పన్నాగం పరమ దుర్మార్గమైనది. రాష్ట్రానికి రాజధానితో పాటు భవిష్యత్తే లేకుండా చేసిన వైకాపా భూతాన్ని ఇక భూస్థాపితం చేయాల్సింది ఓటర్లే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.