మానవీయ దానం

మరణించిన తరవాతా జీవించేందుకు అత్యుత్తమ మార్గం- అవయవదానం. జీవన్మృతులైన వ్యక్తుల అమూల్య అవయవాలను అవసరమైన వారికి అందించగలిగితే- ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు పరచుకుంటాయి.  ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పన్నెండేళ్ల చిన్నారి అవయవదానంతో ఆరుగురి ప్రాణాలు నిలబడ్డాయి.

Published : 24 May 2024 00:27 IST

మరణించిన తరవాతా జీవించేందుకు అత్యుత్తమ మార్గం- అవయవదానం. జీవన్మృతులైన వ్యక్తుల అమూల్య అవయవాలను అవసరమైన వారికి అందించగలిగితే- ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులు పరచుకుంటాయి.  ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పన్నెండేళ్ల చిన్నారి అవయవదానంతో ఆరుగురి ప్రాణాలు నిలబడ్డాయి. నిరుడు గుజరాత్‌లో పుట్టిన నాలుగు రోజులకే దురదృష్టవశాత్తు నూరేళ్లు నిండిపోయిన పసిగుడ్డు అవయవాలను ముగ్గురు బాలలకు అమర్చేందుకు ఆ శిశువు కుటుంబసభ్యులు పెద్దమనసుతో అంగీకరించడం- ఎందరినో భావోద్వేగానికి గురిచేసింది. మరణించిన వ్యక్తి అవయవాలతో ఎనిమిది ప్రాణాలు కాపాడవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు. కానీ, మరణానంతర అవయవదానాల పరంగా అనేక దేశాలతో పోలిస్తే- ఇండియా చాలా వెనకంజలో ఉంది. స్పెయిన్, అమెరికాలలో చనిపోయాక అవయవదానాలు చేస్తున్నవారి సంఖ్య ప్రతి పది లక్షల జనాభాకు నలభైకి పైగా ఉంటోంది. పోర్చుగల్, ఫ్రాన్స్, స్వీడన్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లలో అది ఇరవైకి పైమాటే. ఇండియాలో మాత్రం ఆ సంఖ్య 0.8కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఐసీయూల్లోని జీవన్మృతుల కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం రాష్ట్రాలకు సూచించింది. సంబంధిత వ్యక్తులు అవయవదానానికి హామీ ఇచ్చారో లేదో తెలుసుకోవాలని, ఇవ్వకుంటే వారి కుటుంబసభ్యులకు దాని ప్రాధాన్యాన్ని విశదీకరించాలని కేంద్రం సూచించింది. ఆ మేరకు వైద్యవర్గాలు సత్వరం స్పందిస్తే- ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రోగులెందరికో అది రక్షరేకు కాగలదు. అదే సమయంలో కీలక అవయవాల కొరతను అక్రమార్జనకు అవకాశంగా మార్చుకుంటున్న నరహంతక ముఠాలను అసలేమాత్రం ఉపేక్షించకూడదు!

మధుమేహం, అధిక రక్తపోటు, ఇతర కారణాలతో చాలామందిలో అవయవాలు పనిచేయడం లేదు. మూత్రపిండం, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం తదితరాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్న నిస్సహాయుల సంఖ్య భారత్‌లో మూడు లక్షలకు పైగా ఉంటుందని అంచనా. సకాలంలో అవయవాలు అందక రోజుకు సగటున ఇరవై మంది విగతజీవులు అవుతున్నారు. దేశీయంగా 2022లో 16 వేలకు పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. వాటిలో 83శాతం కేసుల్లో అవయవాలను జీవించి ఉన్న వ్యక్తుల నుంచే సేకరించారు. ఆసేతుహిమాచలం ఏటా రోడ్డు ప్రమాదాల్లో దాదాపు లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో కొంతమంది కుటుంబసభ్యులైనా సరే, అవయవదానానికి ముందుకువస్తే- అనేక జీవితాల్లో నవ వసంతాలు చిగురిస్తాయి. వెల కట్టలేని మానవ అవయవాలు అంగడి సరకు కాకూడదన్న సత్సంకల్పంతో కేంద్రం పటిష్ఠ నిబంధనలను రూపొందించింది. కానీ, అక్రమ ముఠాల స్వైరవిహారాన్ని అవి అంతగా కట్టడి చేయలేకపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వ్యక్తులకు రకరకాలుగా వలవేస్తున్న దందాసురులు- ఆ అభాగ్యుల అవయవాలను కాజేస్తున్నారు. ఇరవై మంది భారతీయులను మభ్యపెట్టి ఇరాన్‌ తీసుకెళ్ళి అవయవ మార్పిళ్లు చేయించిన కేరళ కేటుగాడి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. లోగడ విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, నల్గొండ, హైదరాబాద్‌లలోనూ అవయవ వ్యాపారుల పైశాచికాలు బయటపడ్డాయి. అటువంటివారి పీచమణచడంతో పాటు మరణానంతర అవయవదానంపై విస్తృత జనచేతనకు ప్రభుత్వాలు ప్రోదిచేయాలి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అబ్బిడిపల్లె వాసులందరూ మరణానంతర అవయవదానానికి ప్రతిజ్ఞ చేసి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఆ గ్రామస్థుల బాటలో మిగిలిన వారూ  స్వచ్ఛందంగా ముందుకొస్తే- మానవతా దీపం దివ్యకాంతులు వెదజల్లుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.