icon icon icon
icon icon icon

LS polls: ప్రపంచంలోనే ‘కాస్ట్‌లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?

2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Published : 25 Apr 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజాస్వామ్య పండగగా భావించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరంలో వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు ఖర్చవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓపెన్‌సీక్రెట్స్‌ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం (రూ.1.2 లక్షల కోట్లు)ను ఇది దాటిపోనుంది. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది కాగా.. ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో అయిన రూ.60 వేల కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ కానుండటం గమనార్హం.

ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సెంటర్‌ ఫర్ మీడియా స్టడీస్‌ (CMS) అనే స్వచ్ఛందసంస్థ.. గత 35 ఏళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. ఈక్రమంలో 2024 ఎన్నికల్లో భారీ ఖర్చు అవనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌ రావు అంచనా వేశారు. ఈ సమగ్ర వ్యయంలో ఎన్నికల సంఘంతోపాటు ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎంఎస్‌ ఛైర్మన్‌ భాస్కర్‌రావు ఈ వివరాలు వెల్లడించారు.

మూడు, నాలుగు నెలల ముందే..

‘‘ఎన్నికల వ్యయం తొలుత రూ.1.2 లక్షల కోట్లు అవుతుందని అంచనా వేశాం. అయితే.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల సంబంధిత ఖర్చులన్నింటినీ లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును రూ.1.35 లక్షల కోట్లుగా సవరించాం. ఎన్నికల తేదీలను ప్రకటించడానికి మూడు, నాలుగు నెలల ముందునుంచి చేసిన వ్యయాలు ఇందులోకి వస్తాయి’’ అని సీఎంఎస్‌ చీఫ్‌ వివరించారు. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా వివిధ మార్గాల్లో ధన ప్రవాహం కొనసాగుతుందన్నారు.

వాస్తవ వ్యయం మరింత ఎక్కువ..

ఎన్నికలకు ముందునుంచీ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రచార ఖర్చుల్లో.. బహిరంగ సభలు, రవాణా, క్షేత్రస్థాయిలో వర్కర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సహా నేతలతో బేరసారాల వంటివీ ఇందులో భాగమే. మొత్తం అంచనాల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఖర్చు పెట్టేది దాదాపు 10 నుంచి 15 శాతమే. ఎన్నికల వ్యయంలో వివిధ మీడియా మాధ్యమాల ద్వారా పెట్టేది 30 శాతం ఉంటుంది. ఈ 45 రోజుల ప్రచార సమయంలో కనిపించే ఖర్చు కంటే వాస్తవ వ్యయం మరింత ఎక్కువగా ఉంటుంది’ అని భాస్కర రావు అన్నారు.

45 శాతం ఆ పార్టీదే..

‘‘ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందికి రాకుండా పార్టీలు, అభ్యర్థులు పలు మార్గాలు అన్వేషిస్తుంటాయి.  2019 ఎన్నికల్లో రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేయగా.. అందులో 45 శాతం భాజపాదే. ఈసారి ఎన్నికల్లో ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది’’ అని సీఎంఎస్‌ చీఫ్‌ పేర్కొన్నారు.  ప్రచారంలో డిజిటల్‌ వేదికల పాత్ర మరింత పెరిగిందన్నారు. సిద్ధాంతాల కంటే ధనబలం పైనే విశ్వాసం పెరుగుతోందని ఇటీవల రాసిన ‘నెక్ట్స్‌ బిగ్‌ గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ఎలక్షన్స్‌’ పుస్తకంలో ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img