icon icon icon
icon icon icon

Ajit Pawar: ‘వాషింగ్‌ మెషిన్‌’ విమర్శలు.. విపక్షాలకు అజిత్ పవార్‌ కౌంటర్

తనపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని అజిత్‌ పవార్‌ తిప్పికొట్టారు. ఎన్డీయేలో చేరే విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.

Published : 20 Apr 2024 20:33 IST

Ajit Pawar | ముంబయి: ఇరిగేషన్‌ కేసులో తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajit Pawar) తిప్పికొట్టారు. భాజపా వాషింగ్‌ మెషిన్‌లో వాష్‌ అయ్యారంటూ చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తనపై ఇరిగేషన్‌ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఎన్డీయేలో చేరినందునే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.

మహావికాస్‌ అఘాడీ కూటమిలో ఒకటైన ఎన్సీపీని చీల్చి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ చేరిన సంగతి తెలిసిందే. దీంతో శరద్‌పవార్‌కు చెందిన ఎన్సీపీ రెండు ముక్కలైంది. దర్యాప్తు సంస్థల ఒత్తిడితోనే ఎన్డీయే గూటికి చేరారంటూ శరద్‌పవార్‌, సుప్రియసూలే సహా విపక్ష పార్టీల నేతలు అజిత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు.. భాజపాలో చేరిన వారిపై కేసుల దర్యాప్తు కొనసాగడం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో ఆ పార్టీపై ‘వాషింగ్‌ మెషిన్‌’ అంటూ విపక్షాలు దెప్పిపొడుస్తున్నాయి. ఈ క్రమంలో తనపై వచ్చిన విమర్శలను అజిత్‌ పవార్ ఖండించారు.

‘‘ఎన్డీయేలో చేరినందుకే విపక్షాలు ఇరిగేషన్‌ స్కామ్‌ విషయంలో నాపై ఈ ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే స్కామ్‌పై వారితో కలిసి ఉన్నప్పుడు వారు ఎలాంటి విమర్శలూ చేయలేదు. ఇవాళ వారితో లేనన్న అక్కసుతోనే ఇలా విమర్శల దాడికి దిగుతున్నారు’’ అని అజిత్‌ పవార్‌ అన్నారు. ఈడీ ఒత్తిడితోనే పార్టీని చీల్చారన్న విమర్శలనూ తోసిపుచ్చారు. ఉద్ధవ్‌ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేరాలని ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుకున్నారని చెప్పారు. మరోవైపు బారామతి లోక్‌సభ స్థానానికి అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర, ఆయన సోదరి (పవార్‌ వర్గం) సుప్రియసూలే పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానానికి మే 7న పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img