icon icon icon
icon icon icon

Kharge: ‘కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి’ - ఖర్గే భావోద్వేగం

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడకున్నా.. ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరుకావాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.

Published : 24 Apr 2024 19:10 IST

కలబురగి: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elelctions) ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సొంత జిల్లా కలబురగిలో పర్యటించారు. ఈసందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడకున్నా.. ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు ఇక్కడ ‘స్థానం’ లేదని భావిస్తానని అన్నారు.

‘ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే.. మీ హృదయాలను గెలవలేకపోయానని, నాకు ఇక్కడ చోటులేదనే భావిస్తా. కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. లేకున్నా.. నేను ఈ ప్రాంతానికి పని చేశానని అనుకుంటే, కనీసం నా అంత్యక్రియలకైనా హాజరవ్వండి’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా సిద్ధాంతాలను ఓడించేందుకు పోరాడతానన్నారు. వాళ్ల ముందు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు.

రాజకీయాల కోసమే తాను పుట్టానని, ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకున్నా.. చివరి శ్వాస వరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తానని మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఇదిలాఉంటే, కలబురగి నుంచి 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందిన ఖర్గే.. 2019లో ఓటమిని చవిచూశారు. ఈసారి ఆయన అల్లుడు రాధాకృష్ణ దొడ్డమాని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి ఉమేశ్‌ జాదవ్‌ బరిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img