icon icon icon
icon icon icon

Priyanka gandhi: అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి: ప్రియాంక గాంధీ

తన జీవితంలో చాలామంది ప్రధానులను చూశానని, కానీ బహిరంగంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని చూడడం ఇదే తొలిసారి అని ప్రియాంక గాంధీ అన్నారు.

Updated : 27 Apr 2024 20:17 IST

Priyanka gandhi | అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ‘సంపద పంపిణీ’ హామీపై ప్రధాని మోదీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ (priyanka gandhi) తిప్పికొట్టారు. తన జీవితంలో చాలామంది ప్రధానులను చూశానని, కానీ ఇంత పచ్చి అబద్ధాలను చెప్పే ప్రధానిని చూడడం ఇదే తొలిసారి అన్నారు. ఇటీవల పలు ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలు కూడా తీసేసుకుంటుందంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక స్పందించారు. గుజరాత్‌లోని ధర్మపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో శనివారం ఆమె మాట్లాడారు.

‘‘నా కుటుంబం సహా చాలామంది ప్రధానులను చూశా. మా నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. మా నాన్న కూడా ప్రధానిగా సేవలందించారు. ఆయన చనిపోయినప్పుడు ముక్కలైన ఆ దేహాన్ని మా ఇంటికి తీసుకొచ్చారు. మన్మోహన్‌ సంస్కరణల విప్లవం తీసుకొచ్చారు. వాజ్‌పేయీ స్టేట్స్‌మన్‌. కానీ బహిరంగంగా అబద్ధాలు చెప్పే ప్రధానిని తొలిసారి చూస్తున్నా. నా తల్లిని, నానమ్మను, తాతయ్యను, సోదరుడు (రాహుల్‌)ను, నా భర్తను దూషిస్తున్నారు. అలాంటి విమర్శలను పట్టించుకోను’’ అని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మంగళసూత్రాలు తీసుకెళ్తుందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూసి భయంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

రాజ్యాంగం మార్పు ఖాయం

కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారని ప్రియాంక గాంధీ అన్నారు. ‘‘భాజపా నేతలు వివిధ సందర్భాల్లో రాజ్యాంగ మార్పు గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రధాని ఆ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. ఇదంతా కాషాయ పార్టీ రాజకీయ ఎత్తుగడ. అధికారం చేజిక్కించుకునేంతవరకు భాజపా ఇదే ఫాలో అవుతుంది. ఆ తర్వాత ముందు అనుకున్నదే అమలుచేస్తుంది. రాజ్యాంగాన్ని మార్చి సామాన్యుల హక్కులను హరించాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది’’ అని ఆరోపించారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా ఆపగల శక్తి మోదీకి ఉందని భాజపా నేతలు గొప్పలు చెబుతుంటారని, అలాంటప్పుడు దేశంలో ఉన్న నిరుదోగ్యం, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఇబ్బందులను ఎందుకని అదుపు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img