icon icon icon
icon icon icon

Hemang Joshi: మోదీ స్థానంలో హేమాంగ్‌ ‘జోష్‌’

ఒకప్పుడు ప్రధాని మోదీ పోటీ చేసిన స్థానం నుంచి ఈసారి హేమాంగ్ జోషి(Hemang Joshi) లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. 

Published : 20 Apr 2024 18:01 IST

వడోదర: సార్వత్రిక ఎన్నికల వేళ.. గుజరాత్ (Gujarat) రాజకీయాల్లో హేమాంగ్ జోషి (Hemang Joshi) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అతిపిన్న వయస్కుడైన అభ్యర్థి అయిన ఆయన.. ప్రధాని మోదీ (Modi) పదేళ్ల క్రితం పోటీ చేసిన స్థానం నుంచి బరిలో నిలిచారు. అసలు తనకు టికెట్ వస్తుందని అనుకోని జోషి.. వడోదర (Vadodara) నుంచి పోటీ చేయాలని అగ్రనాయకత్వం ఆదేశించడంతో అమితానందం వ్యక్తం చేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, యూపీలోని వారణాసి నుంచి మోదీ పోటీ చేశారు. రెండుచోట్ల విజయం సాధించడంతో వడోదర స్థానాన్ని రంజన్‌ భట్‌కు కేటాయించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికతో పాటు 2019 పోటీలో విజయం సాధించిన భట్‌కు ఈసారి కూడా కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే అంతర్గతంగా వచ్చిన అసమ్మతి కారణంగా ఆయన వైదొలిగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజే విద్యార్థి నాయకుడైన జోషికి ఆ టికెట్ దక్కింది.

‘‘అధికారికంగా నా పేరు ప్రకటించేవరకు.. అసలు ఎలాంటి సమాచారం లేదు. నా భార్య, నేను నిత్యం మా విధులతో బిజీగా ఉంటాం. దాంతో ఆ రోజు సరదాగా బయటకు వెళ్లాం. అప్పుడే నా పేరు బయటకు తెలియడంతో జాతీయ, రాష్ట్ర నాయకుల నుంచి వరుసగా ఫోన్లు వచ్చాయి. నాలాంటి వ్యక్తికి ఇంత పెద్ద ఎలక్షన్‌లో అవకాశం ఇవ్వడం, పెద్దల మద్దతు దక్కడం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలు టికెట్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. పార్టీ నిర్ణయం నన్నెంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇతర సీట్లలో అభ్యర్థులకు విక్టరీ మార్జిన్ 5 లక్షల ఓట్లు కాగా.. నాకు మాత్రం 10 లక్షల ఓట్ల టార్గెట్ విధించారు’’ అని జోషి వెల్లడించారు. మీడియా సంస్థ ఫాక్స్‌ స్టోరీ ఇండియా రూపొందించిన 40 ఏళ్ల లోపు యంగ్‌ లీడర్ల జాబితాలో జోషికి స్థానం దక్కింది. గుజరాత్‌లోని 26 ఎంపీ స్థానాలకు ఒకేసారి మూడో దశలో పోలింగ్ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img