icon icon icon
icon icon icon

Lok Sabha Polls: సార్వత్రిక పోరులో రెండో దశకు ముగిసిన ప్రచారం.. బరిలో ప్రముఖులు వీరే..

లోక్‌సభ ఎన్నికల్లో రెండో విడత పోరుకు ప్రచార పర్వానికి తెర పడింది. శుక్రవారం 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

Published : 24 Apr 2024 20:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సార్వత్రిక సమరంలో (Lok Sabha Elections) భాగంగా రెండోవిడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడింది. 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్ని వారాలుగా హోరాహోరీగా కొనసాగిన ప్రచార పర్వం ముగిసింది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతల పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో హీటు పుట్టించారు. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అవిశ్రాంతంగా నేతలు శ్రమించారు. మరోవైపు, ఏప్రిల్‌ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలింగ్‌కు 48 గంటల ముందు బయటి వ్యక్తులెవరూ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉండకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. అలాగే, ఆయా నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ లేదా ప్రింట్ మీడియా ద్వారా ప్రచారం, బహిరంగ సభలు, విలేకర్ల సమావేశాలు, ఇంటర్వ్యూలు, ప్యానల్‌ చర్చలపై నిషేధం విధించింది. మొత్తం ఏడు దశల్లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గత శుక్రవారం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 65.5శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. 

రెండో దశ పోలింగ్‌ ఈ రాష్ట్రాల్లోనే..

శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో కేరళలో మొత్తం 20 స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనుండగా.. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో చెరో ఎనిమిది, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బిహార్‌లలో ఐదేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమబెంగాల్‌లో చెరో మూడు సీట్లు, మణిపుర్‌, త్రిపుర, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

బరిలో ప్రముఖులు వీరే..

రెండో దశలో జరుగుతున్న స్థానాల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఈ జాబితాలో ఇద్దరు కేంద్రమంత్రులు, ఒక మాజీ సీఎంతో పాటు ప్రముఖ సిట్టింగ్‌ ఎంపీలు, పలువురు సినీ నటులు ఉన్నారు. కేంద్ర మంత్రులు రాజీవ్‌ చంద్రశేఖర్‌ (తిరువనంతపురం), తేజస్వీ సూర్య (కర్ణాటక), హేమమాలిని, అరుణ్‌గోవిల్‌ (ఉత్తరప్రదేశ్‌) నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (వయనాడ్‌), శశిథరూర్‌ (తిరువనంతపురం), కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌.డి. కుమారస్వామి (మాండ్య), సినీనటి నవనీత్‌ కౌర్‌ రాణా (అమరావతి-మహారాష్ట్ర), సినీనటుడు సురేష్‌ గోపీ (త్రిశూర్‌-కేరళ) తదితర ప్రముఖులు పోటీలో ఉన్నారు. మరోవైపు, మే 7న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img