icon icon icon
icon icon icon

మా ‘గాంధీ’ ఎవరో తేల్చాలి.. అమేఠీలో కాంగ్రెస్‌ నేతల ధర్నా

అమేఠీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తేల్చాలని కోరుతూ స్థానిక నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. 

Updated : 30 Apr 2024 23:44 IST

అమేథీ (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన అమేఠీ (Amethi) లోక్‌సభ స్థానంపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎవరిని బరిలోకి నిలుపుతుందనే దానిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. దీనిపై స్థానిక నేతలు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. దీంతో గాంధీ కుటంబం నుంచి రాహుల్‌ లేదా ప్రియాంక గాంధీని బరిలో నిలపాలంటూ మంగళవారం ధర్నాకు దిగారు.

అమేఠీ స్థానానికి ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయినా, ఇప్పటికీ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో జిల్లా నేతలు, కార్యకర్తలు కలిసి పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ‘అమేఠీ రాహుల్‌ను లేదా ప్రియాంకను కోరుకుంటోంది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గాంధీ కుటుంబంలో ఒకరిని ఇక్కడి అభ్యర్థిగా చూడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయని నేతలు తెలిపారు. అమేఠీ నుంచి రాహుల్ పోటీ చేసి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

అమేఠీ నుంచి 2014 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ గెలుపొందారు. 2019లో మాత్రం భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చవిచూశారు. అదే ఏడాది కేరళలోని వయనాడ్‌ నుంచి ఆయన గెలుపొందారు. స్మృతి ఇరానీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అమేఠీ నుంచి రాహుల్‌, ప్రియాంకలలో ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఖరారు కాలేదు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పోటీ చేస్తారంటూ కూడా ఆ మధ్య పోస్టర్లు వెలిశాయి. గతంలో ఇదే స్థానం నుంచి సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img