icon icon icon
icon icon icon

Congress: దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అర్విందర్‌ సింగ్‌ రాజీనామా

Congress: ఆప్‌తో పొత్తు సహా పార్టీలో కొందరు నాయకుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ దిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అర్విందర్‌ సింగ్‌ రాజీనామా చేశారు.

Published : 28 Apr 2024 11:12 IST

దిల్లీ: కాంగ్రెస్‌ దిల్లీ శాఖ (DPCC) అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తుకు దిల్లీ యూనిట్‌ అంగీకరించలేదని రాజీనామా లేఖలో అర్విందర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం పార్టీకి (Congress) తలనొప్పిగా మారింది.

కాంగ్రెస్‌ (Congress) పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు అర్విందర్‌ లేఖలో తెలిపారు. అలాంటి పార్టీతో పొత్తు వద్దని దిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామకాలను చేపట్టేందుకు దిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమతించడం లేదని ఆరోపించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ (Arvinder Singh Lovely) అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని చెప్పారు. అయితే, మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ.. ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు. కానీ, రెండు స్థానాల్లో అసలు దిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img