icon icon icon
icon icon icon

Lok Sabha Polls: గిఫ్ట్‌ ఓచర్లు, నగదుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు.. కుమారస్వామి ఆరోపణలు

లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు రూరల్‌ నియోజకవర్గంలో ఓటర్లను కాంగ్రెస్‌ ప్రలోభపెడుతోందని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. 

Published : 26 Apr 2024 16:56 IST

రామనగర: సార్వత్రిక సమరంలో (Lok Sabha elections)  రెండో విడత ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్న వేళ జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి (Kumaraswamy) కాంగ్రెస్‌ (Congress)పై ఆరోపణలు చేశారు. బెంగళూరు రూరల్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని కనకపుర తాలుకాలో ఓటర్లకు కాంగ్రెస్‌ నగదు, గిఫ్ట్‌ ఓచర్లు పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. ఇక్కడ ‘హస్తం’ పార్టీ నుంచి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌ పోటీ చేస్తుండగా.. భాజపా టిక్కెట్‌పై జేడీఎస్‌ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు డా.సీఎన్‌ మంజునాథ్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సీటు నుంచి మూడు పర్యాయాలు గెలిచిన సురేష్‌.. తనకు నాలుగోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కనకపుర తాలుకాలో భాజపా, జేడీఎస్‌ మద్దతుదారులపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడులు చేసి చొక్కాలు చింపేశారని ఆరోపించారు. రూ.10వేలు వరకు కొనుగోలు చేసుకోగలిగేలా గిఫ్ట్‌ ఓచర్లు పంపిణీ చేస్తుండటంతో అదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారని కుమారస్వామి ఆరోపించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. 

ఓటేసిన ప్రముఖులు.. 3 గంటల వరకు 51% పోలింగ్‌ 

మరోవైపు, కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను 14 సీట్లకు శుక్రవారం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు కర్ణాటకలో 50.93శాతం పోలింగ్‌ నమోదైనట్లు టర్న్‌అవుట్‌ యాప్‌ పేర్కొంది. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవెగౌడ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. అలాగే, సినీనటి, మాండ్య ఎంపీ సుమలత, మాజీ క్రికెటర్‌ అనిల్ కుంబ్లే, ఐటీ రంగంలో ప్రముఖులైన క్రిష్‌ గోపాలకృష్ణన్‌, మోహందాస్‌ పాయ్‌తో పాటు సినీ నటులు ఉపేంద్ర, శివరాజ్‌కుమార్‌, సుదీప్‌ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img