icon icon icon
icon icon icon

By poll: ఉప ఎన్నిక బరిలో కల్పనా సోరెన్‌.. పోటీ ఎక్కడి నుంచంటే?

మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Published : 26 Apr 2024 00:06 IST

రాంచీ: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha elections) వేళ ఝార్ఖండ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేఎంఎం అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ అరెస్టుతో తెర వెనుక నుంచి పార్టీని నడిపిస్తోన్న ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు జేఎంఎం ఆమెను గాండీ అసెంబ్లీ ఉప ఎన్నిక  బరిలో దించుతున్నట్లు గురువారం ప్రకటించింది. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామాతో గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. దీంతో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఈ అసెంబ్లీ స్థానానికి మే 20న ఉప ఎన్నిక జరగనుండటంతో జేఎంఎం ఈ నిర్ణయం తీసుకుంది. జంషెడ్‌పుర్‌ నుంచి జేఎంఎం తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బహర్‌గోరా సిట్టింగ్‌ ఎమ్మెల్యే సమీర్‌ మహంతీని బరిలో దించింది.

గతంలో సీఎంగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో కల్పనా సోరెన్‌ తదుపరి సీఎం అవుతారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల సాధ్యంకాలేదు. దీంతో ఝార్ఖండ్‌ నూతన సీఎంగా చంపయ్‌ సోరెన్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. మార్చి 4న గిరిధ్‌ జిల్లాలో జరిగిన జేఎంఎం 51వ వ్యవస్థాపక దినోత్సవం రోజు కల్పన తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. 2019లో హేమంత్ సోరెన్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ప్రత్యర్థులు కుట్రలు చేస్తున్నారంటూ ఆమె విమర్శలు గుప్పించారు. అన్యాయం, అణిచివేతపై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత దిల్లీకి వెళ్లిన కల్పన.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.  ఆ తర్వాత దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో, ఇటీవల రాంచీలో నిర్వహించిన జరిగిన ‘ఇండియా’ కూటమి భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img