icon icon icon
icon icon icon

ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్‌ అవసరం

ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

Updated : 20 Apr 2024 12:51 IST

మన పొరుగుదేశం రొట్టెలపిండి కోసం పాట్లు పడుతోంది
మధ్యప్రదేశ్‌ ఎన్నికల ర్యాలీలో ప్రధాని

దమోహ్‌ (మధ్యప్రదేశ్‌): ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని దమోహ్‌లో శుక్రవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ పేరెత్తకుండా ‘‘ఉగ్రవాదులను సరఫరా చేసే మన పొరుగు దేశమొకటి, నిత్యావసరమైన రొట్టెల పిండి కోసం నేడు పాట్లు పడుతోంది’’ అని విమర్శించారు. మన రక్షణరంగాన్ని బలహీనం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి  ఫ్రాన్స్‌ తయారీ రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు రావడం ఇష్టం లేదని మోదీ విమర్శలు గుప్పించారు. 

‘ఇద్దరు యువరాజుల జోడీ’ ఫ్లాప్‌ సినిమా

అమ్రోహా (యూపీ): లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీల జోడీపై ప్రధాని మోదీ సినీ పరిభాషలో ధ్వజమెత్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘‘ఇద్దరు యువరాజుల జోడీ (దో షెహజాదేకీ జోడీ) సినిమా షూటింగు ఇక్కడ జరుగుతోంది.  వారిద్దరి చిత్రాన్ని యూపీ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు’’ అని ఎద్దేవా చేశారు. అమ్రోహా నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్‌ ఎంపీ దానిశ్‌ అలీని కూడా ప్రధాని వదల్లేదు. ‘‘ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ‘భారత్‌ మాతా కీ జై’ అని చెప్పడం కూడా కష్టం. ఇలాంటి వ్యక్తి భారత పార్లమెంటులో అవసరమా?’’ అని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కేసులో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్‌ అన్సారీ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు పిలిస్తే వచ్చారని.. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం తిరస్కరించాయని దుయ్యబట్టారు. ద్వారకలో శ్రీకృష్ణుని పూజించేందుకు తాను సముద్రం అడుగుకు వెళితే, కాంగ్రెస్‌ యువరాజు అక్కడ ఏమీలేదని ప్రజల విశ్వాసాలను కించపరిచారన్నారు.


తల్లి చిత్రం చూసి భావోద్వేగం.. ప్రసంగం ఆపిన ప్రధానమంత్రి

దమోహ్‌ ఎన్నికల సభలో ఓ యువకుడు ప్రదర్శించిన పెన్సిల్‌ చిత్రాన్ని చూసి మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీని ఆయన మాతృమూర్తి హీరాబెన్‌ ఆశీర్వదిస్తున్న చిత్రమది. ఈ సందర్భంగా మోదీ తన తల్లిని గుర్తుచేసుకొని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందిస్తూ ఫొటో వెనుక అతని పేరు, చిరునామా రాసిస్తే తాను లేఖ రాస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img