icon icon icon
icon icon icon

అవినీతి పాఠశాలను నడుపుతున్న మోదీ

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.

Published : 21 Apr 2024 04:51 IST

రాహుల్‌గాంధీ విమర్శ

దిల్లీ, భాగల్‌పుర్‌: ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ వేదిక వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారు. అక్కడ అంతా అవినీతి శాస్త్రమే పాఠ్యాంశంగా ఉంటుంది. ‘విరాళాల వ్యాపారం’ సహా అన్ని అధ్యాయాలను మోదీయే బోధిస్తారు. సోదాలు నిర్వహించి విరాళాలు ఎలా సేకరించాలో వివరిస్తారు. విరాళాలు తీసుకున్న తర్వాత కాంట్రాక్టులు ఎలా పంచిపెట్టాలో నేర్పుతారు. అవినీతి పనులను వాషింగ్‌ మెషిన్‌ (భాజపా) ఎలా శుభ్రం చేస్తుంది? దర్యాప్తు సంస్థలను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘బెయిల్‌-జైలు’ క్రీడను ఎలా ఆడాలి? వంటి అంశాలపై తర్ఫీదు ఇస్తారు. అవినీతిపరుల స్థావరంగా భాజపా మారిపోయింది. ఈ క్రమంలో ఇటువంటి క్రాష్‌ కోర్సులను రూపొందించింది. పార్టీలోని నాయకులందరికీ ఈ కోర్సు తప్పనిసరి. ఈ పరిస్థితికి దేశం మూల్యం చెల్లించుకుంటోంది. ఇండియా కూటమి ప్రభుత్వం వారి అవినీతి పాఠశాలతోపాటు ఆ కోర్సును శాశ్వతంగా మూసేస్తుంది’’ అని రాహుల్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేసిన ఓ ప్రకటన వీడియోలో పేర్కొన్నారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో శనివారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ..తమ చుట్టూ కోటీశ్వర్లను పెట్టుకున్న భాజపా-ఆరెస్సెస్‌ ద్వయం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పుగా పరిణమించిందని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం సుమారు 25 మందికి రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది..ఇది గత కాంగ్రెస్‌ హయాంలో రైతులకు చేసిన రుణమాఫీ కంటే 25 రెట్లు ఎక్కువ అని ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img