icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ కబళించే తీగ

కాంగ్రెస్‌ పార్టీ వేర్లు, భూమితో సంబంధం లేని ఓ తీగ లాంటిదని.. అది తనకు అండగా నిలిచినవారినే ఎండగట్టి కబళిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

Published : 21 Apr 2024 04:51 IST

మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ

నాందేడ్‌/పర్భణీ: కాంగ్రెస్‌ పార్టీ వేర్లు, భూమితో సంబంధం లేని ఓ తీగ లాంటిదని.. అది తనకు అండగా నిలిచినవారినే ఎండగట్టి కబళిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన నాందేడ్‌, పర్భణీ ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై మాటల దాడిని కొనసాగించారు. ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిందన్నారు. 2019లో అమేఠీ నుంచి ఓడిపోయిన కాంగ్రెస్‌ యువరాజు ఈసారి వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి కూడా ఓడిపోనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమిపై మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ అందులోని కాంగ్రెస్‌, నకిలీ శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే పార్టీ) యాకుబ్‌ మెమన్‌ (1993 ముంబయి వరుస పేలుళ్ల దోషి) సమాధిని అలంకరించడంలో నిమగ్నమై ఉన్నాయని  ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని ఉద్దేశించి విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన కొందరు నేతలు లోక్‌సభను వదిలి రాజ్యసభకు వెళ్లిపోతున్నారని, వారికి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గురించి కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ తాను కూడా ఆ స్థాయిలో మాట్లాడలేదన్నారు. కనీసం 25 శాతం స్థానాల్లో పరస్పరం పోటీ పడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలను మీరు విశ్వసిస్తారా? అని ఓటర్లను ప్రశ్నించారు.


‘ట్యాంకర్‌ సిటీ’గా  టెక్‌ సిటీ

ఈనాడు, బెంగళూరు: దేశంలో శక్తిమంతులైన కొందరు వ్యక్తులు తనను అధికారం నుంచి తొలగించేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, బెంగళూరులలో నిర్వహించిన సభల్లో ప్రధాని ప్రసంగించారు.  బెంగళూరు వంటి టెక్‌ సిటీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నీళ్ల సమస్యతో ‘ట్యాంకర్‌ సిటీ’గా మార్చినట్లు మోదీ విమర్శించారు. ఇక్కడ ఆడబిడ్డలకు రక్షణ లేదా.. స్వేచ్ఛగా భజన చేసుకునే అవకాశం కూడా లేదా అంటూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలను ప్రస్తావించారు. యూపీఏ సర్కారు దేశ ఆర్థికస్థితిని దయనీయంగా మార్చిందని మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ ఆరోపించారు. మోదీ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. పత్రికలకు కాంగ్రెస్‌ ఇచ్చిన ఓ వ్యంగ్య ప్రకటనపై స్పందించారు. ఆ ప్రకటనలో ఓ చెంబును చూపిన కాంగ్రెస్‌.. కర్ణాటకకు మోదీ ఇచ్చిన బహుమతి ఇదేనంటూ వ్యాఖ్యానించింది. ఈ ప్రకటనను చూపుతూ దేవెగౌడ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img