icon icon icon
icon icon icon

కేరళ కదనరంగం!

ముక్కోణపు పోటీతో దేవ భూమి కేరళ కదన రంగాన్ని తలపిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

Published : 21 Apr 2024 04:52 IST

క్లీన్‌స్వీప్‌కు యూడీఎఫ్‌ ప్రయత్నం
సంస్థాగత బలంతో గెలవాలని ఎల్‌డీఎఫ్‌
పాదం మోపాలని ఎన్డీయే ఆరాటం
ఈనాడు ప్రత్యేక విభాగం

ముక్కోణపు పోటీతో దేవ భూమి కేరళ కదన రంగాన్ని తలపిస్తోంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన రాష్ట్రంలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. 2019 ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేయాలని యూడీఎఫ్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ఎన్నికల్లో 20 స్థానాల్లో 19 సీట్లను యూడీఎఫ్‌ గెలుచుకుంది. ఎల్‌డీఎఫ్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్‌ కూటమి ఘన విజయాన్ని సాధించడం విశేషం. తన సంస్థాగత బలంతో ప్రత్యర్థుల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని ఎల్‌డీఎఫ్‌ పోరాడుతోంది. కనీసం కొన్ని సీట్లయినా గెలిచి సత్తా చాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేయాలని ఎన్డీయే కూటమి విశ్వప్రయత్నాలు చేస్తోంది.

  • కేంద్రంలో అధికారంలోకి రావడానికి కేరళలో మెజారిటీ సాధించడం ముఖ్యమని పార్టీలు భావిస్తుంటాయి.
  • కేరళ లోక్‌సభ సీట్ల పరంగా 12వ పెద్ద రాష్ట్రం. ఇక్కడ 20 సీట్లున్నాయి. అందులో 18 సీట్లు జనరల్‌వే. రెండు సీట్లు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి.
  • దాదాపు దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఇక్కడ ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి.
  • ప్రస్తుత ఎన్నికలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.
  • కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి వయనాడ్‌ నుంచి విజయాన్ని ఆశిస్తున్నారు.

యూడీఎఫ్‌

గత ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధించిన యూడీఎఫ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కొట్టాయం లోక్‌సభ సీటును గెలుచుకున్న కేరళ కాంగ్రెస్‌ (మణి) పార్టీ ఎల్‌డీఎఫ్‌ కూటమిలో చేరడంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడింది. మధ్య ట్రావన్‌కోర్‌ ప్రాంతంలోని క్రైస్తవుల్లో మణి వర్గానికి పట్టుంది.

  • ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని నమ్మిన యూడీఎఫ్‌ త్రిశ్శూర్‌ మినహా మిగిలిన చోట్ల సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇచ్చింది.
  • కాంగ్రెస్‌కు చెందిన కొడికున్నిల్‌ సురేశ్‌.. మావెలికరా నుంచి ఎనిమిదో సారి ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • కాంగ్రెస్‌కు ఇప్పటికీ పట్టున్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.

ఎల్‌డీఎఫ్‌

2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ కూటమి 17 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి భారీ విజయాలు లేవు. ఈసారి సంస్థాగత బలాన్ని వినియోగించుకుని సత్తా చాటాలని ఆ పార్టీ చూస్తోంది.

  • కేకే శైలజ, థామస్‌ లాంటి మాజీ మంత్రులను, డి.రాజా సతీమణి అన్నీ రాజా లాంటి కీలక నేతలను ఈసారి ఎల్‌డీఎఫ్‌ బరిలోకి దించింది.
  • వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారం సాధించడం ఆ పార్టీకి అనుకూల అంశం. ప్రభుత్వ వ్యతిరేకత పరంగా చూస్తే అదే ప్రతికూలాంశం.

ఎన్డీయే

ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో అనేకసార్లు పర్యటించి భాజపాకు జవసత్వాలు కూడగట్టారు. రాష్ట్రంలో ఖాతా తెరవాలనే గట్టి పట్టుదలతో ఆ పార్టీ ఉంది. అందుకే ప్రధాని చాలాసార్లు రాష్ట్రంలో పర్యటించారు.

  • భాజపా ఇప్పటికీ ఒక్క సీటూ సాధించని రాష్ట్రాల్లో కేరళ ఉంది.
  • ఇప్పుడు గెలుస్తామా లేదా అన్నది పక్కనబెడితే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలీయశక్తిగా ఎదగాలని భాజపా భావిస్తోంది.
  • 2018 అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురపై దృష్టి సారించిన మోదీ అక్కడ సీపీఎంను ఓడించారు. మూడున్నర దశాబ్దాల లెఫ్ట్‌ పాలనకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.
  • కేరళలోనూ అదే తరహా విజయాన్ని ఆశిస్తున్న భాజపా ఆర్‌ఎస్‌ఎస్‌ సాయంతో పాగా వేయాలని చూస్తోంది. అయినా రాష్ట్రంలో 56 శాతం ఉన్న హిందువుల ఓట్లను స్థిరీకరించడంలో ఇంతవరకూ సఫలం కాలేదు.
  • కేరళలో 26శాతం ముస్లింలు, 18శాతం  క్రైస్తవులు ఉన్నారు. వారిలో ముస్లింల ఓట్లను కాకుండా క్రైస్తవ ఓట్లపై దృష్టి పెట్టింది. అందుకే పలువురు మత పెద్దలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. హిందూ, క్రైస్తవుల ఓట్లను కలిపి సాధించి గెలవాలనేది ఆ పార్టీ ఆలోచన.
  • భాజపా ప్రస్తుతం 5 నియోజకవర్గాలపై దృష్టి సారించింది. అవి తిరువనంతపురం, అట్టింగల్‌, పథనంథిట్ట, త్రిశ్శూర్‌, పాలక్కాడ్‌.

పోలింగ్‌ తీరిదీ..

  • దేశంలోనే అత్యధిక పోలింగ్‌ నమోదయ్యే రాష్ట్రాల్లో కేరళ ఒకటి.
  • 2019లో ఉత్తర కేరళలో అత్యధిక పోలింగ్‌ నమోదైంది. దక్షిణ కేరళలో తక్కువ పోలింగ్‌ జరిగింది.
  • రాహుల్‌ గాంధీ రాష్ట్రంలోనే   అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.
  • ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి ఏఎం ఆరిఫ్‌ అత్యల్ప మెజారిటీతో గెలిచారు. ఇదొక్కటే గత ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ గెలిచిన సీటు.

గట్టి పోటీ

  • అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉందని అంటున్నా దేశం దృష్టిని ఆకర్షించిన కొన్ని స్థానాలు కేరళలో ఉన్నాయి.
  • వయనాడ్‌లో రాహుల్‌ గాంధీపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అన్నీ రాజా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్‌ పోటీకి దిగారు.
  • రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌, కేంద్ర మంత్రి, భాజపా నేత రాజీవ్‌ చంద్రశేఖర్‌ తలపడుతున్నారు. ఇక్కడ సీపీఐ సీనియర్‌ నేత పన్నియన్‌ రవీంద్రన్‌ బరిలో ఉన్నారు. థరూర్‌ మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
  • మరో కీలక నియోజకవర్గం పథనంథిట్ట. ఇక్కడ మూడు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ నేత ఆంటో ఆంటోనీ పోటీ చేస్తున్నారు. ఈ సీటును ఎలాగైనా ఈసారి గెలవాలని సీపీఎం తరఫున మాజీ మంత్రి టీఎం థామస్‌ బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ కే ఆంటోనీ ఇక్కడ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
  • త్రిశ్శూర్‌లో ఉత్కంఠ పోరు నెలకొంది. సీపీఐ నుంచి సునీల్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి కె.మురళీధరన్‌, భాజపా నుంచి రాజకీయ నేతగా మారిన నటుడు సురేశ్‌ గోపి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలవాలని భాజపా అభ్యర్థి తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు.
  • వడకరలోనూ గట్టి పోటీ నెలకొంది. సీపీఎం తరఫున కేకే శైలజ, కాంగ్రెస్‌ నుంచి షఫీ పారంబిల్‌, భాజపా పక్షాన ప్రఫుల్‌ కృష్ణన్‌ పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img