icon icon icon
icon icon icon

తేజస్వీని ఆపేదెలా?

బిహార్‌లో అత్యధిక స్థానాలపై పట్టును నిలుపుకోవాలని చూస్తున్న ఎన్డీయే కూటమికి ఆర్జేడీ యువ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ రూపంలో అడ్డంకి ఎదురవుతోంది.

Published : 21 Apr 2024 04:53 IST

బిహార్‌లో చెమటోడుస్తున్న ఎన్డీయే
మోదీ, అమిత్‌ షాల ప్రత్యేక దృష్టి
పట్నా నుంచి నీరేంద్ర దేవ్‌

బిహార్‌లో అత్యధిక స్థానాలపై పట్టును నిలుపుకోవాలని చూస్తున్న ఎన్డీయే కూటమికి ఆర్జేడీ యువ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌ రూపంలో అడ్డంకి ఎదురవుతోంది. ఇక్కడ పోటీ గట్టిగా ఉందని భాజపా వ్యూహకర్తలే అభిప్రాయపడుతుండటంతో ప్రధాని మోదీ, అమిత్‌ షాలు తరచూ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 4 సీట్లలో శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఈ నాలుగు నియోజకవర్గాలకు ప్రధాని మోదీ మూడు సార్లు వచ్చారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టే పోటీ ఎంత తీవ్రంగా ఉందనేది అర్థమవుతోంది. బిహార్‌లో 40కి 40 సీట్ల లక్ష్యానికి తేజస్వీ యాదవ్‌ గట్టిగా ఎదురు నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ 39 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఒక్క కిషన్‌గంజ్‌లోనే గెలిచింది.


అత్యంత వెనుకబడిన వారికి ప్రాధాన్యం

అత్యంత వెనుకబడిన వర్గాలకు తేజస్వీ ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా ఇండియా కూటమిని ఎక్కువ మందికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మల్లా-నిషాద్‌ వర్గానికి చెందిన ముకేశ్‌ సాహ్ని పార్టీ వికాశ్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి (వీఐపీ)  మూడు సీట్లు ఇచ్చారు. దీంతో ఝంఝార్‌పుర్‌, తూర్పు చంపారన్‌, గోపాల్‌గంజ్‌లలో ఎన్డీయేకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పార్టీకి ఒక సీటు ఇస్తానని ఎన్డీయే కూడా బేరాలాడటం గమనార్హం.

  • తూర్పు చంపారన్‌లో సీనియర్‌ నేత, వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ను మరోసారి భాజపా బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లోనూ వికాశ్‌ శీల్‌ పార్టీకి మధుబని, ముజఫర్‌పుర్‌, ఖగారియా సీట్లను ఆర్జేడీ కేటాయించింది. ఈ మూడింట్లో ఆ పార్టీ ఓడిపోయింది.
  • పుర్ణియాలో ఆర్జేడీకి పప్పూ యాదవ్‌ రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ఆర్జేడీ తరఫున భీమా భారతి పోటీ చేస్తున్నారు. పప్పూ యాదవ్‌ గెలవకపోయినా ఆర్జేడీకి నష్టం చేకూర్చే అవకాశముంది. ఇక్కడ ఎన్డీయే తరఫున సంతోశ్‌ కుశ్వాహా పోటీ చేస్తున్నారు.
  • రామ మందిరం అంశం ఊహించినంతగా ప్రభావం చూపడం లేదని ఆధ్యాత్మిక నగరం గయలోని భాజపా కార్యకర్తలే కొందరు అంటున్నారు. అయోధ్య అంశం ఓట్లు రాల్చే అవకాశం పెద్దగా లేదని చెబుతున్నారు. అందుకే మోదీ బిహార్‌లోని ప్రతి సభలోనూ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు కాంగ్రెస్‌ రాలేదని విమర్శలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.

23 సీట్లలో ఆర్జేడీ పోటీ

రాష్ట్రంలోని 23 సీట్లలో ఆర్జేడీ పోటీ చేస్తోంది. తేజస్వీ యాదవ్‌ ప్రతిష్ఠ పెరుగుతోందని, నీతీశ్‌ ప్రభ తగ్గుతోందని ఆర్జేడీ సీనియర్‌ శివానంద్‌ తివారీ తెలిపారు. దివంగత రాం విలాస్‌ పాస్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాస్వాన్‌ ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తున్నారు. 7శాతం ఉన్న దళిత ఓట్లపై పాస్వాన్‌ ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఈసారి విజయం సాధించడం కష్టమేనని చాలామంది చెబుతున్నారు. చిరాగ్‌పై నమ్మకంతో అమిత్‌ షా.. ఆయనకు 5 సీట్లు ఇచ్చారు. ఇది చిరాగ్‌కు అంచనాలకు మించి ప్రాధాన్యం ఇవ్వడమేననే వాదన ఉంది. అంతేకాకుండా చిరాగ్‌ చిన్నాన్న పశుపతి కుమార్‌ పారస్‌ను పట్టించుకోలేదు.

  • 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటునూ గెలవలేదు. యాదవుల ప్రాబల్యమున్న మాధేపుర లాంటి ప్రాంతాల్లోనూ భాజపా విజయఢంకా మోగించింది. ఇది ఆశ్చర్యపరిచింది.
  • సీమాంచల్‌లోని ముస్లింలు ఈసారి ఏం చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

మాకే మద్దతంటున్న ఎన్డీయే

సహజ భాగస్వాములమైన తమ కూటమినే బిహార్‌ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో భాజపా, జేడీయూ ఉన్నాయి. ‘గత 8 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6సార్లు భాజపా, జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఒకసారి విడిగా పోటీ చేశాయి. మరోసారి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌ కలిసి బరిలోకి దిగాయి. ఇందులో ఎక్కువసార్లు మేమే గెలిచాం’ అని భాజపా ఐటీ సెల్‌ విభాగాధిపతి అమిత్‌ మాలవీయ పేర్కొన్నారు.

  • ‘ఆర్జేడీ ముస్లిం-యాదవ్‌’ కార్డు పని చేయదు. 2019 ఎన్నికల్లో దానిని మేం ఛేదించాం. బిహార్‌ ప్రజలు కులమతాలకు అతీతంగా నీతీశ్‌కు మద్దతుగా నిలుస్తారు’ అని జేడీయూ నేత రాజీవ్‌ రంజన్‌ స్పష్టం చేశారు.
  • మోదీ మ్యాజిక్‌ బిహార్‌లో పని చేస్తుందని, ఇది అన్నింటికంటే ఎక్కువని భాజపా నేత రాంకృపాల్‌ యాదవ్‌ తెలిపారు.

మోదీకి ప్రత్యామ్నాయం లేదనడం భావ దారిద్య్రం

‘ఈ ఎన్నికలు రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంతోపాటు దాని బలోపేతానికి సంబంధించినవి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతోపాటు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అందించాల్సి ఉంది. ప్రజల గొంతుకను వినిపించాల్సి ఉంది. ఒకే అంశం చుట్టూ తిరగడం కాకుండా ప్రజల నిజమైన అవసరాలను గుర్తించాల్సి ఉంది. ప్రపంచ సూచీలో మన మీడియా స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందో మనందరికీ తెలుసు. ఇవీ అసలైన ఎన్నికల అంశాలు. మన ముందు ఎన్నో అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. మోదీకి ప్రత్యామ్నాయం లేదనడం భావ దారిద్య్రానికి నిదర్శనం.’

తేజస్వీ యాదవ్‌


నీతీశ్‌ రాకతో..

ఎన్డీయేలోకి జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ రాకతో కిషన్‌గంజ్‌లోనూ ఆధిక్యం సాధిస్తామనే ఆశాభావంతో భాజపా ఉంది. దీంతో 40 సీట్లూ గెలవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జేడీయూవల్ల ముస్లింల ఓట్లు పడి గెలుస్తామని అనుకుంటోంది. కానీ ఆర్జేడీ పార్టీ ప్రస్తుతం తేజస్వీ చేతుల్లో బలంగా ఉంది. ఆరోగ్యం, వయసు కారణంగా లాలూ ప్రసాద్‌ బాధ్యతలను కుమారుడికి వదిలేశారు.


తేజస్వీ సభలకు భారీగా..

‘తేజస్వీ యాదవ్‌కు యువతలో భారీగా మద్దతు లభిస్తోంది. ఆయన సభలకు భారీగా జనం వస్తున్నారు. ఆయన యువతలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నారు’ అని పట్నాలోని ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇది నూతన ఆర్జేడీ. తన తండ్రిలాగా తేజస్వీ కేవలం ముస్లింలు, యాదవ్‌ల ఓట్లపైనే ఆధారపడటం లేదు. ఆయన స్మార్ట్‌ సోషల్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు’ అని రాజకీయ విశ్లేషకుడు జాంతు దేయ్‌ పేర్కొన్నారు.


మోదీ, నీతీశ్‌ ప్రభావమున్నా..

కొన్ని అంశాల్లో మోదీ, నీతీశ్‌ల ప్రభావమున్నా కీలక విషయాల్లో యువత ఆర్జేడీపట్ల అనుకూలంగా ఉన్నారనిపిస్తోంది. 15ఏళ్లపాటు పాలించిన లాలూ 2005లో ఓటమితో మరుగునపడిపోయారు. అప్పటి నుంచి కూటములను మారుస్తూ నీతీశ్‌ 19ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన శకమూ అయిపోయిందని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి వస్తారని భాజపా ఆశగా ఉంది. ఇటు తమ ప్రభుత్వం వస్తుందని ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమీ నమ్మకంగా ఉంది. లాలూ కుమారుడు ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తారని భావిస్తోంది.


ఎన్నో అంశాలు

1990ల నాటి పరిస్థితులు ఇప్పుడు బిహార్‌లో లేవు. పలు అంశాలు ఇక్కడ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయి. అప్పట్లో లాలు కరిష్మా ఆర్జేడీకి విజయాలను అందించింది. అప్పట్లో మాదిరిగా కులాల వారీగా ఓట్లు పడే పరిస్థితీ అంతగా లేదంటున్నారు. సామాజికవర్గాల ఓట్లు గంపగుత్తగా ఎవరికీ పడటం లేదు. ప్రస్తుతం రామ మందిరం, శాంతి భద్రతల అంశం, నీతీశ్‌ పాలనతోపాటు మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, నిరుద్యోగం వంటివి ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి. మరుగు దొడ్ల అంశమూ ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి వచ్చింది.

  • జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయం లేదనే ప్రచారం ఎన్డీయేకు కలిసివచ్చే అంశం.
  • నీతీశ్‌ను వద్దనుకునేవారు ఆర్జేడీ, భాజపాల మధ్య చీలిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img