icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ వస్తే.. సంపదంతా ముస్లింలకే

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Updated : 22 Apr 2024 09:17 IST

అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాల్నీ వదలరు
రాజస్థాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు
ఇది విద్వేష ప్రసంగమే.. మండిపడిన కాంగ్రెస్‌

జైపుర్‌, దిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ ఉదాహరించారు. ఆదివారం రాజస్థాన్‌లోని జాలౌర్‌, భీన్‌మాల్‌తోపాటు బాంస్‌వాడా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా?’’ అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. వామపక్షాల ఉచ్చులో చిక్కిన కాంగ్రెస్‌ మావోయిజం సిద్ధాంతాలను అమలుచేయాలని చూస్తోందన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మొదటిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగు సరళిని చూసి అసంతృప్తికి గురైన మోదీ మరిన్ని అబద్ధాలతో, విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తింది. భారతదేశ చరిత్రలో మోదీ స్థాయిలో మరే ప్రధాని ఆ పదవి ప్రతిష్ఠను ఇంతగా దిగజార్చలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆరెస్సెస్‌, భాజపా ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ప్రతి భారతీయుడి సమానత్వం కోరుకొంటుందని, ప్రధాని తీరు చూస్తుంటే గోబెల్స్‌ లాంటి మన నియంత కుర్చీ కదులుతోందని స్పష్టమవుతోందని ఖర్గే అన్నారు.

ఇండియా కూటమి దారం తెగిన గాలిపటం

దేశంలో ఒకనాడు 400కు పైగా స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ నేడు 300 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయడం కూడా కష్టంగా ఉందని, ఆ పార్టీ చేసిన పాపాలకు దేశం శిక్షిస్తోందని రాజస్థాన్‌ సభల్లో మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోందని విమర్శించారు. ‘ఇండియా’ పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసినది అవకాశవాద కూటమి అని, అది ఆకాశంలోకి ఎగరకముందే దారం తెగిన గాలిపటం లాంటిదని ప్రధాని అభివర్ణించారు. ‘‘ఎన్నికల క్షేత్రంలో పోటీ పడేందుకు వెనుకాడుతున్నవారు ఈసారి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు వచ్చారు. ఇదీ కాంగ్రెస్‌ దుస్థితి’’ అంటూ పరోక్షంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మొదటిదశ ఎన్నికల్లో రాజస్థాన్‌లో సగభాగం ఇప్పటికే కాంగ్రెస్‌ను శిక్షించిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారులో ప్రధానిని ఎవరూ పట్టించుకోలేదని, పాలన అంతా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నడిచిందని ఆరోపించారు. అప్పటి క్యాబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్సును సొంత పార్టీ నాయకుడే మీడియా సమావేశంలో చించి పక్కన పడేశారని రాహుల్‌గాంధీని ఉద్దేశించి విమర్శించారు. అస్థిరతకు మారుపేరైన ఇటువంటి పార్టీ దేశాన్ని నడపగలదా? అని ఓటర్లను ప్రధాని ప్రశ్నించారు.


మొదటిదశతో మోదీలో అసంతృప్తి

-రాహుల్‌

మోదీ అబద్ధాల తీవ్రత చూస్తుంటే మొదటిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగు సరళి ఆయనను ఎంతగా అసంతృప్తికి గురిచేసిందో తెలుస్తోందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. తమ పార్టీ విప్లవాత్మక మ్యానిఫెస్టోకు విపరీతమైన మద్దతు వస్తోందని ఆదివారం ‘ఎక్స్‌’ ద్వారా రాహుల్‌ పేర్కొన్నారు. దేశం ఇపుడు తన సమస్యల ఆధారంగా ఓటు వేస్తుందని వ్యాఖ్యానించారు. యువత, మహిళలు, రైతులు, దళితులకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా రాజస్థాన్‌ ర్యాలీల్లో మోదీ అబద్ధాలు చెబుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ధ్వజమెత్తారు. మొదటిదశ పోలింగు సరళిని చూసి ఒత్తిడికి గురైన మోదీ మానసిక సమతుల్యతను కోల్పోయినట్లుందని ఆయన ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. ‘‘గుర్తుపెట్టుకోండి. భాజపా దక్షిణ్‌ మే సాఫ్‌, ఉత్తర్‌ మే హాఫ్‌ (దక్షిణ భారతంలో శూన్యం, ఉత్తర భారతంలో సగమే)’’ అన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో హిందూ - ముస్లిం అని ఎక్కడ ఉందో ప్రధాని చూపాలని కాంగ్రెస్‌ మీడియా ఇన్‌ఛార్జి పవన్‌ ఖేడా సవాలు విసిరారు. ‘పునః పంపిణీ’ గురించి అందులో మాట్లాడలేదని, సమగ్ర సామాజిక, ఆర్థిక కులగణన తమ విధానమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img