icon icon icon
icon icon icon

బెదిరిపోం.. లొంగిపోం..

కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము బెదిరిపోయేది, లొంగేది లేదని విపక్ష నేతలు తేల్చిచెప్పారు.

Updated : 22 Apr 2024 06:28 IST

ప్రజాస్వామ్యానికి ఎన్డీయేతో హాని  
ఒత్తిళ్లకు లొంగనివారిని జైలు పాల్జేస్తున్నారు  
రాంచీ సభలో విపక్ష నేతల ధ్వజం

రాంచీ: కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము బెదిరిపోయేది, లొంగేది లేదని విపక్ష నేతలు తేల్చిచెప్పారు. అన్నిరకాల వ్యవస్థల్ని గుప్పిటపెట్టుకుని ముఖ్యమంత్రుల్ని జైలు పాల్జేస్తున్న భాజపాను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీతో ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుందన్నారు. రాంచీలో ఆదివారం ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో 28 పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ శక్తి బలంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ అయినా, భాజపాకు చెందిన ఇతర నేతలైనా కూటమిని విచ్ఛిన్నం చేయలేరన్నారు. ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఒప్పుకోనందుకే ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే తన ప్రసంగంలో ఆరోపించారు. తాము ప్రజలకే తప్పిస్తే ప్రధాని వంటి నేతలకు భయపడేది లేదన్నారు. గిరిజనుల్ని అంటరానివారుగా భాజపా భావిస్తుందని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రామాలయ ప్రాణప్రతిష్ఠకు గానీ, పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి గానీ ఆహ్వానించనేలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కమలనాథులు 150-180 స్థానాలకే పరిమితమవుతారని జోస్యం చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ- రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు అంటున్నారని, అలాచేసే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. అవినీతిపరుల్ని భాజపాలో చేర్చుకోవడమే మోదీ చెబుతున్న గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.


శ్రీరాముడు అందరివాడు

-ఫరూక్‌ అబ్దుల్లా

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ- శ్రీరాముడు కేవలం హిందువులకే పరిమితం కాదని, రాముడు అందరివాడని చెప్పారు. కొందరు మాత్రం రాముడు తమకే చెందుతాడన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా భాజపాని విమర్శించారు.


సోరెన్‌, కేజ్రీవాల్‌ల కోసం ఖాళీగా కుర్చీలు

వేదికపై అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ల కోసం రెండు కుర్చీలను ఖాళీగా విడిచిపెట్టారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఝార్ఖండ్‌ సీఎం చంపయీ సోరెన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, ప్రియాంక చతుర్వేది (శివసేన యూబీటీ), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐ ఎంల్‌) తదితరులు హాజరయ్యారు. కారాగారం నుంచి సోరెన్‌ పంపిన సందేశాన్ని ఆయన భార్య కల్పన చదివి వినిపించారు. విపక్షపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చాలని భాజపా ప్రయత్నిస్తున్నా ప్రజాస్వామ్యం విఫలం కావడాన్ని అనుమతించేదే లేదని ఆ సందేశంలో సోరెన్‌ పేర్కొన్నారు.


అస్వస్థతతో రాహుల్‌గాంధీ గైర్హాజరు

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా రాంచీ సభకు హాజరు కాలేదని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది.


నా భర్తను జైల్లో చంపాలనుకుంటున్నారు

-సునీత

కేంద్ర సర్కారు తన భర్తను కారాగారంలోనే చంపాలనుకుంటోందని, అందుకే ఆయనకు ఇన్సులిన్‌ ఇచ్చేందుకు అంగీకరించడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీతా కేజ్రీవాల్‌ ఈ సభలో ఆరోపించారు. ‘నా భర్తకి మధుమేహం ఉంది. ఆయనకు రోజుకు 50 యూనిట్ల ఇన్సులిన్‌ ఇవ్వాలి. దానిని ఇవ్వనివ్వడం లేదు. ఆయనపై అభియోగాలేవీ రుజువు కావు. జైలు తలుపులు బద్దలుగొట్టుకుని కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌లు బయటకు వస్తారు’ అని సునీత చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img