icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (11)

విపక్షాలన్నీ తమ కుటుంబ పాలనను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో ప్రయత్నిస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని సర్కారు గత పదేళ్లలో ఎన్నో కీలక మైలురాళ్లు సాధించింది.

Updated : 22 Apr 2024 07:04 IST

కుటుంబ పాలన రక్షణకే విపక్షం యత్నం

విపక్షాలన్నీ తమ కుటుంబ పాలనను కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో ప్రయత్నిస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని సర్కారు గత పదేళ్లలో ఎన్నో కీలక మైలురాళ్లు సాధించింది. పీడనకు గురవుతున్న మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వాలన్న ఆలోచనే కాంగ్రెస్‌కు రానేరాదు.

మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లాలో ఎన్నికల సభలో భాజపా అధ్యక్షుడు నడ్డా


మోదీ మళ్లీవస్తే ప్రజాస్వామ్యం అంతం

మోదీ-షా ద్వయం సర్కారు కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంతమవుతుంది. వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారు. రాజ్యాంగాన్ని బతికించుకోవాలన్నా; మహిళలు, కూలీలు, రైతుల హక్కుల్ని కాపాడుకోవాలన్నా పంజా (హస్తం) గుర్తుకు ఓటెయ్యండి. కాంగ్రెస్‌ నేతల్ని, గాంధీ కుటుంబాన్ని ఆడిపోసుకోవడమే భాజపా పని.

మధ్యప్రదేశ్‌లోని సతనా బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే


మేం సురక్షితంగా లేం

న్ను, నా మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని భాజపా లక్ష్యంగా చేసుకుంది. మేం సురక్షితంగా లేం. అలాగని కాషాయదళం కుట్రలకు మేమేమీ భయపడేదిలేదు. దూరదర్శన్‌ చిహ్నం, వారణాసిలో పోలీసు దుస్తుల రంగు సహా అన్నింటినీ ఎందుకు కాషాయమయం చేస్తున్నారు?

పశ్చిమబెంగాల్‌లోని కుమార్‌గంజ్‌లో సీఎం మమతాబెనర్జీ


సమస్యలపై మాట్లాడని మోదీ

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకుండా, కేవలం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారు. దేశ భవిష్యత్తుపై తమ దృక్పథం ఏమిటో గతంలో ప్రధానమంత్రులు ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. మోదీ మాత్రం తనదైన వాక్చాతుర్యంతో ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మహారాష్ట్రలోని జల్గావ్‌లో మీడియాతో ఎన్సీపీ (ఎస్పీ) అగ్రనేత శరద్‌పవార్‌


జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో భాజపాకు లబ్ధి

సీట్ల ఒప్పందం కుదరకపోవడంతో జమ్మూకశ్మీర్‌లో ఇండియా కూటమిపై పోటీచేయడం ద్వారా భాజపాకు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) ప్రయోజనం చేకూరుస్తోంది. మతతత్వ భాజపాకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతోంది. మేం స్వార్థపూరితంగా ఉన్నామని ముఫ్తీ ప్రతిచోటా మాట్లాడటం విడ్డూరం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సమరానికి సెమీ ఫైనల్స్‌.

అనంత్‌నాగ్‌ జిల్లాలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పొత్తుపై


కాంగ్రెస్‌కు పునరాలోచన అవసరం

మ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పొత్తుపై కాంగ్రెస్‌ పునరాలోచించుకోవాలి. కూటమి పక్షాల్లో ఏకాభిప్రాయం కోసమే మేం ప్రయత్నించాం. ఎన్‌సీ కార్యకర్తలు పొత్తును కోరుకుంటున్నా ఆ పార్టీ నాయకత్వం మాత్రం ఒంటరిగా వెళ్లాలనుకుంది. మమ్మల్ని విమర్శించినవారికి ప్రజలే జవాబు చెబుతారు.

అనంతనాగ్‌ జిల్లాలో మీడియాతో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ


మేం రాగానే సీఏఏ రద్దు చేస్తాం

ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక పార్లమెంటు తొలి సమావేశాల్లోనే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రద్దవుతుంది. మ్యానిఫెస్టో పెద్దది అయిపోతుందని దానిలో చేర్చకపోయినా సీఏఏను రద్దు చేయడం ఖాయం. భాజపా పదేళ్ల పాలనలో దేశానికి ఎంతో నష్టం వాటిల్లింది. అయోధ్య రామాలయ ప్రభావం ఎన్నికల్లో ఏమాత్రం ఉండదు. భాజపా ఒక రాజకీయ పార్టీలా కాకుండా మోదీని ఆరాధించే భజన బృందంలా కనిపిస్తోంది.

తిరువనంతపురంలో విలేకరులతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ పి.చిదంబరం కుంభకోణం, ఉగ్రవాదాలకు


కాంగ్రెస్‌ మారుపేరు

పురాతన కాంగ్రెస్‌ పార్టీ అంటే కుంభకోణాలు, ఉగ్రవాదం, నక్సలిజానికి మారుపేరు. అందరికీ రక్షణ కల్పించగలిగేది, అన్ని విశ్వాసాలనూ గౌరవించేది భాజపా మాత్రమే.

ఛత్తీస్‌గఢ్‌ కబీర్‌ధామ్‌ జిల్లాలో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌


40 మంది భాజపా స్టార్‌ క్యాంపెయినర్ల నియామకం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా అగ్రనేతలు జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీలతో పాటు 40 మందిని భాజపా స్టార్‌ క్యాంపెయినర్లుగా నియమించింది. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, పురందేశ్వరి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, మందకృష్ణ మాదిగ, పలువురు నేతలున్నారు.


పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంపై శిక్షణ ఇచ్చి.. ఓట్ల తిరస్కరణలు తగ్గించండి

ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య లేఖ

ఈనాడు-అమరావతి: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగంపై శిక్షణ ఇచ్చి.. ఓట్ల తిరస్కరణలు తగ్గించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు ఆదివారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘రాష్ట్రంలో 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. పీఓ, ఏపీఓలకు ఇచ్చిన విధంగానే ఓపీఓ(ఇతర పోలింగ్‌ అధికారులు)లకు శిక్షణ ఇవ్వకపోతే వారు పోస్టల్‌ బ్యాలట్‌ను సరిగా వినియోగించుకోలేరు. 2019 ఎన్నికల్లో 56,545 పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు తిరస్కరణకు గురయ్యాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నియోజకవర్గానికి 50 బస్సులు, 50 జీపులను ఎన్నికల విధుల్లో ఉపయోగిస్తారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా వాహనాల డ్రైవర్లు, వీడియోగ్రాఫర్లు, ఐటీ ఉద్యోగుల్ని ముందే గుర్తించి వారికి ఫాం-12 అందేలా చూడాలి. మరోవైపు ఫాం-12 ఎవరికి ఇవ్వాలనే విషయంపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.


పోస్టల్‌ బ్యాలట్‌ దరఖాస్తుకు 30 వరకు గడువు పెంచండి

ఈసీకి భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ వినతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పెంచాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనాకు ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ ఆదివారం వేర్వేరుగా లేఖలు రాశారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం.. ఉద్యోగులకు సాధారణ సెలవు ఇచ్చిందని గుర్తుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img