icon icon icon
icon icon icon

సూరత్‌లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవం

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated : 23 Apr 2024 06:50 IST

సూరత్‌: లోక్‌సభ ఎన్నికల్లో భాజపా బోణీ కొట్టింది. గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు స్పష్టంచేశారు. దీంతో ఆ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థి నామినేషనూ చెల్లలేదు. ఆ వెంటనే స్వతంత్రులు సహా ఇతరులంతా బరి నుంచి వైదొలగడంతో నాటకీయ పరిణామాల నడుమ ముకేశ్‌ దలాల్‌ విజేత అయ్యారు. ఈ స్థానంలో ఆయనపై కాంగ్రెస్‌, బీఎస్పీ, మూడు చిన్నపార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్రులుగా నలుగురు బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం నాటికి దలాల్‌ ఒకరే మిగిలారు. దీంతో ముకేశ్‌ నెగ్గినట్లు జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణపత్రం అందించారు. ప్రధాని మోదీ చేతికి మొదటి ‘విజయ కమలా’న్ని అందించారంటూ గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ తమ అభ్యర్థిని అభినందించారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కూడా స్పందించారు. భాజపా చరిత్రాత్మక విజయానికి నాంది పడిందని.. మోదీ నాయకత్వంలో గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా 400 స్థానాలతో కమలం విజయభేరీ మోగిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

చరిత్రలో ఇంతవరకు 35 మంది

1951 నుంచి ఇప్పటివరకు 35 మంది అభ్యర్థులు లోక్‌సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 12 ఏళ్లలో మాత్రం ఎవరూ ఎన్నిక కాలేదు. భాజపా నుంచి ఇది తొలి ఏకగ్రీవంగా చెబుతున్నారు. గతంలో వై.బి.చవాన్‌, ఫరూక్‌ అబ్దుల్లా, హరేకృష్ణ మెహతాబ్‌, టి.టి.కృష్ణమాచారి, పి.ఎం.సయీద్‌, ఎస్‌.సి.జమీర్‌, డింపుల్‌ యాదవ్‌ వంటివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఇది మ్యాచ్‌ ఫిక్సింగ్‌

-కాంగ్రెస్‌

సూరత్‌లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రజాస్వామ్యం ముప్పులో పడిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. మన జీవితకాలంలో ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img