icon icon icon
icon icon icon

మోదీ నోట మళ్లీ అదే మాట

కాంగ్రెస్‌ పార్టీపై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీ సోమవారం కూడా అవే ఆరోపణల్ని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్నవారి నుంచి ఒక ఇంటిని లాక్కొంటుందని విమర్శలు చేశారు.

Published : 23 Apr 2024 05:12 IST

రెండిళ్లు ఉంటే ఒకటి కాంగ్రెస్‌ లాక్కొంటుంది
అలీగఢ్‌ ర్యాలీలో ప్రధాని ధ్వజం
‘ముస్లిం’ ఆరోపణలకు దూరం

అలీగఢ్‌ : కాంగ్రెస్‌ పార్టీపై ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీ సోమవారం కూడా అవే ఆరోపణల్ని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్నవారి నుంచి ఒక ఇంటిని లాక్కొంటుందని విమర్శలు చేశారు. రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన ‘సంపద పునఃపంపిణీ’ ప్రకటనను ఉద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో భాజపా నిర్వహించిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వివాదాస్పదంగా మారిన ‘ముస్లింలకు సంపద పంపిణీ’ వ్యాఖ్యల జోలికి ఇక్కడ ప్రధాని వెళ్లకపోవడం గమనార్హం. దీనికి బదులుగా ట్రిపుల్‌ తలాఖ్‌ వ్యతిరేక చట్టం అమలు, హజ్‌ కోటా పెంపు వంటి చర్యలను భాజపా ప్రభుత్వం తీసుకొన్నట్లు ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న అలీగఢ్‌ వేదికగా మోదీ మాట్లాడారు. ‘‘నేను దేశ ప్రజలను హెచ్చరిస్తున్నా. ఇండియా కూటమి దృష్టి మీ సంపాదన, ఆస్తులపై పడింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘యువరాజు’ చెప్పినట్టు ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, అమ్మానాన్నలకు, అక్కచెల్లెళ్లకు ఎంత బంగారం ఉందో విచారణ జరుపుతారు. ఇది మావోయిస్టు భావజాలం. కాంగ్రెస్‌ భారతదేశంలో దీన్ని అమలు చేయాలనుకుంటోంది’’ అని విపక్షంపై ప్రధాని మాటల దాడి కొనసాగించారు. బుజ్జగింపు రాజకీయాలను అనుసరించే కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు మాత్రం ఏమీచేయడం లేదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img